Read more!

English | Telugu

అలాంటి కథ అయితేనే చేస్తాను.. లేకపోతే లేదు : రీ ఎంట్రీపై సోనమ్‌

 

బాలీవుడ్‌ స్టార్లు కొందరు తెలుగు సినిమాతోనే పరిచయమై ఆ తర్వాత బాలీవుడ్‌లో చక్రం తిప్పారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది హేమమాలిని, అనిల్‌కపూర్‌. హేమమాలిని పాండవవనవాసం చిత్రంలోని చిన్న పాత్రతో పరిచయమై ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లింది. ఇక అనిల్‌ కపూర్‌ హీరోగా నటించిన తొలి సినిమా తెలుగులోనే రూపొందింది. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘వంశవృక్షం’ చిత్రంలో హీరోగా నటించిన అనిల్‌ ఆ తర్వాత బాలీవుడ్‌లో టాప్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలా తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయమైన మరో నటి సోనమ్‌. 

సూపర్‌స్టార్‌ కృష్ణ తనయుడు రమేష్‌బాబు హీరోగా నటించిన తొలి సినిమా ‘సామ్రాట్‌’ చిత్రంతో సోనమ్‌ హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్ళిపోయి స్టార్‌ హీరోల సరసన నటించి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో కొదమసింహం, ముగ్గురు కొడుకులు చిత్రాల్లో నటించింది. దాదాపు 40 సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సోనమ్‌ చివరగా 1994లో వచ్చిన ‘ఇన్‌సానియత్‌’లో కనిపించింది. 1991లో బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ రాయ్‌ని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పిన సోనమ్‌ 2016లో అతని నుంచి విడాకులు తీసుకుంది. 30 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న సోనమ్‌ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అంటోంది. ‘త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటి జనరేషన్‌కి నేను తెలియకపోవచ్చు. నన్ను ఎవరూ గుర్తు పట్టరని నేను ఫీల్‌ అవ్వను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వస్తున్నాను. మీరందరూ నన్ను గుర్తుపెట్టుకునేలా చేస్తాను. సినిమాల్లో నటిస్తారా, ఓటీటీలో కనిపిస్తారా అని అడుగుతున్నారు. నేను ఓటీటీకు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇవ్వాలనుకుంటున్నాను. నాతో పాటే సాగే కథ అయితేనే చెయ్యాలనుకుంటున్నాను’ అంటోంది 51 ఏళ్ళ సోనమ్‌.