Read more!

English | Telugu

అప్పుడు 'జెర్సీ', ఇప్పుడు 'హిట్'.. దిల్ రాజుకి కలిసిరాని బాలీవుడ్!

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు దిల్ రాజు. తెలుగులో ఆయన డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో విజయాలు అందుకున్నాడు. కానీ ఆయనకు బాలీవుడ్ మాత్రం కలిసి రావడం లేదు. ఆయన నిర్మిస్తున్న సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయి.

నేచురల్ స్టార్ నాని సినిమాల రీమేక్ లతో దిల్ రాజు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అందులో మొదటిది నాని నటించిన 'జెర్సీ' కాగా, రెండోది నాని తెలుగులో నిర్మించిన 'హిట్ ది ఫస్ట్ కేస్'. ఈ రెండు సినిమాలను అవే టైటిల్ తో, ఒరిజినల్ డైరెక్టర్స్ తోనే హిందీలో రీమేక్ చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన 'జెర్సీ' పలుసార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఏప్రిల్ 22న విడుదలైంది. పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది కానీ యాక్షన్ సినిమాల ట్రెండ్ లో కలెక్షన్స్ రాబట్టలేక కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఇప్పుడు 'హిట్ ది ఫస్ట్ కేస్' పరిస్థితి కూడా అలాగే ఉంది.

రాజ్ కుమార్ రావు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ మూవీ జులై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. రెండు రోజుల్లో రూ.3.36 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. చూస్తుంటే ఈ మూవీ కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలే ఛాన్స్ ఉంది.