నేలమీద రంగుల హరివిల్లు... హోలీ
.jpg)
హోలీ పండుగ అంటేనే రకరకాల రంగుల్లో తడుస్తూ సంతోషాన్ని రెట్టింపు చేసుకోవడం. ఈ రంగుల పండుగకి సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాల గురించి చెప్పుకుందాం !
పంటలు బాగా పండాలని, వర్షాలు బాగా కురావాలని, అందరూ పిల్లా పాపలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హొలీని జరుపుకుంటారు. ఈ హోలీ పండుగాకి వసంతోత్సవం, కాముని పున్నమి అనే పేర్లు కూడా ఉన్నాయి.
ఈ హోలీకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. తెలిసిన వారి మీద, సన్నిహితుల మీదే కాకుండా తెలియని వారి మీద కూడా రంగులు చల్లి కొత్త బంధుత్వాలను, బాంధవ్యాలను కల్పించుకోవచ్చు. ఈ రోజు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ద్వేషాలకు, పగలకు, ప్రతీకారాలకు చోటు లేకుండా అతీతంగా అందరిని ఒక చోట చేర్చే గొప్ప అనుభూతి ఈ హొలీ పండుగా అని కూడా మనం చెప్పుకోవచ్చు.
1. ద్వాపరయుగంలో హోలీ
ఈ హోలీ పండుగా ఈనాటిది కాదు. ద్వాపర యుగంలోనే ఈ పండుగ జరుపుకున్నట్లు చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి. రాధ తనకంటే తెల్లగా ఉంటుందని, తనది నలుపని కృష్ణుడు తన తల్లి యశోదతో చెప్పుతూ బాధపడతాడు. చిన్ని కృష్ణుడి భాధ చూసిన ఆ తల్లి ఒక సలహా ఇస్తుంది. రాధ శరీరం నిండా రంగులు పూయమని! తల్లి సలహా మేరకు ఆ చిన్నికృష్ణుడు రాధను పట్టుకుని ఆమె మీద రంగులు కలిపిన నీటిని కుమ్మరిస్తాడు. అందుకు రాధ ఊరుకోకుండా తిరిగి కృష్ణుడి మీద వసంతం కుమ్మరిస్తుంది. అప్పటి నుండి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమయిందని అప్పటి నుండి ఈ హోలీకి వసంతోత్సవం అనే పేరు వచ్చిందని మన పెద్దలు చెబుతుంటారు.
హోలీకి మరొక పేరు కాముని పున్నవి. మరి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?
హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. ఈ విధంగా హోళీ ముందు రోజు చలి మంటలు వేసుకోవడంలో కూడా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కథల్లో నుంచి రెండు కథలు మీ కోసం!
2. కాముని దహనం
హిరణ్యకశపుని సోదరి, ప్రహ్లాదుని మేనత్త అయిన హోళిక, తన అన్నను చంపించాడన్న కోపంతో ఇంట్లోనే మంటలు రగిల్చి అందులోకి ప్రహ్లాదుడిని తోసే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో మంటలు ప్రహ్లాదుడిని ఏమి చేయకుండా హోళీకనే దహించి వేస్తాయి. ఇలా చెడుపైన మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోళీ ముందు రోజు కాముని దహనం పేరుతో చలిమంటలు వేసుకుంటారు.
3. ప్రచారంలో ఉన్న మరొక కథ.
ధ్యాన నిష్ఠలో ఉన్న శివునిపై మన్మధుడు పూలబాణాలు వేసి తపోభంగం కలిగిస్తాడు. అందుకు శివుడు ఆగ్రహించి మన్మధుడిపై తన మూడో కన్ను తెరిచి భస్మం చేస్తాడు. ఆ తరువాత రతీదేవి మొర ఆలకించిన శివుడు శాంతించి మన్మధుడిని మళ్ళీ బ్రతికిస్తాడు. డానికి గుర్తుగానే హోళీ పున్నమికి ముందు కాముని దహనం చేస్తారు.
ఆ రంగుల అర్థం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం !
సంతోషం, విషాదం, బాధ, ఆనందం, దుఖం, సుఖం, ఇలా వీటన్నిటి యొక్క కలయికే జీవితం. వీటిల్లో ఏ ఒక్కదానికో పొంగిపోవడమో లేదా కుంగిపోవడమో జరగకుండా అన్ని సమయాలలో, అన్ని సందర్భాల్లో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో రకరాకల రంగులు కలిపిన నీటిని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు.
ఇదండీ రంగుల పండుగ హోలీ విశేషాలు. అయినవారిని మరింత దగ్గర చేసే పండుగ, కానివారిని అయినవారిగా మార్చే పండుగ, పిల్లపాపల నుంచి పెద్దల దాకా అందరిని ఆనంద డోలికల్లో ముంచితేల్చే పండుగ ఈ హోలీ.
అలాంటి ఈ హోలీ అందరి జీవితాలను మరింత రంగుల మయం చేయాలని కోరుకుంటోంది మీ తెలుగువన్.కామ్
