ఒకసారి శివుడు ‘ఈ ప్రపంచం అంతా మాయ. అంతా ఈ మాయలోనే బతికేస్తున్నారు’ అని ఎగతాళి చేశాడట. శివుడి భార్య పార్వతీదేవికి ఈ ఎగతాళి నచ్చలేదు. శివుడికి ఎలాగైనా ఓ గుణపాఠం చెప్పాలనుకుంది. అంతే! ప్రపంచంలో ఉన్న ఆహారాన్నంతా మాయం చేసేసింది. ఆహారం లేక జీవులన్నీ తపించిపోయాయి. ఆఖరికి శివుడు కూడా ఆకలితో దహించుకుపోయాడు. అప్పుడు పార్వతీదేవే ఆయనకు స్వయంగా తన చేతులతో భిక్షను అందించింది. అలా శివునికి సైతం భిక్షను అందించిన పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తున్నారు. అందుకే కాశీలో శివునికి ఎంత ప్రాధాన్యత ఉందో, అక్కడ కొలువైన అన్నపూర్ణాదేవికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.
ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే దసరాల్లో అన్నపూర్ణాదేవిని కూడా పూజిస్తారు. ఈ రోజు అమ్మవారిని గంధపు రంగు వస్త్రంతో అలంకరించాలి. అన్నపూర్ణాష్టకం చదువుతూ పొగడ పూలతో అర్చించాలి. ఈ రోజు ‘హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయై నమః’ అన్న మంత్రాన్ని కనుక వీలైనన్ని సార్లు జపిస్తే, అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభించి తీరుతుందట. మనిషికి వెంటనే ఆకలి తీరిపోవాలంటే పాలు తాగుతాడు. కడుపు చల్లగా ఉండాలంటే పెరుగన్నం తింటాడు. అందుకే అన్నపూర్ణా దేవి దద్ధ్యోదనం కానీ పాలతో చేసిన పరమాన్నం కానీ నైవేద్యంగా స్వీకరించేందుకు ఇష్టపడుతుంది. ఈ రెండూ కుదరకపోతే కనీసం పాలనైనా నైవేద్యంగా అందించాలి. జీవుల ఆకలిని తీర్చే కూరగాయలంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకని ఈ రోజు కూరగాయలను తరగకుండా వాటిని గౌరవించాలని పెద్దలు చెబుతున్నారు.
ఇక అన్నపూర్ణాదేవికి అన్నదానం అంటే చాలా ఇష్టం. ఇంట్లో అన్నపూర్ణాదేవిని పూజించిన తర్వాత దధ్యోదనం, పరమాన్నం, గారెలు లాంటి పదార్థాలతో కనుక అన్నదానం చేస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇదేమీ కుదరని పక్షంలో ఉత్త అన్నాన్నయినా దానం చేయాలి. ఇంట్లో ఎప్పుడూ ఆహారం ఉండాలంటే తగినంత డబ్బు కూడా ఉండాలి. అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే జీవితంలో ఆకలి బాధ అనేదే ఉండదు. ఆ ఆకలిని కలిగించే ఆర్థికబాధలూ ఉండవు. అకలి తీర్చే తల్లికి ప్రతిరూపం అన్నపూర్ణ. అందుకనే సంతానం కావాలనుకునేవారు దసరాల్లో అన్నపూర్ణాదేవిని కనుక పూజిస్తే తప్పకుండా వారి కోరిక తీరుతుంది.