Facebook Twitter
ప్రతినాయకులే

రాజ్యమిపుడు మాటలతో మాయచేసి
అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్ళ చేతుల్లో
మరణశాసనం లిఖిస్తుంది
జనంకోసం తపనపడే నాయకుడొకడులేడు
ఉత్తుత్తి మాటలతో కోటలుగట్టే 
మోసగాళ్ళ చేతుల్లో తగలడుతున్న రావణకాష్టం
జనాలు కళ్ళింకా మూతబడేవున్నయ్ 
మూతబడుతూనే వున్నయ్ శాశ్వతంగా
దోచుకుని దాచుకునే కుటిలనాయకత్వమే 
ఉన్నోడికెప్పుడూ చుట్టమే చట్టమైనా  ఏదైనా 
కాపాడిల్సినోళ్ళే బయటికిరాకుండా చేతులుముడుచుకున్నరు
చేతకానితనాన్ని ప్రదర్శిస్తున్నరు
పూటగడవని బతుకులకింత ఆసరా లేకపాయే
సినిమా కథానాయకులైతే అభిమానం మాటున కోట్లు గడించి 
చడిచప్పుడులేకుండా
మన్నతిన్నపాములైరి వారురారు సహాయంచేయరు
ఆకాశహార్మ్యాల్లో కులుకుతున్నరు
ఎవరురా నాయకులు?
ఏదిరా అభిమానం?
గమనించుకోవాలందిరిపుడైనా
ఎవరికోసం ఎవరురారు 
నీ కోసం నువ్వే బతకాలి
అందరూ సోనుసూదులు కారు
మానవత్వాన్ని మనసునిండా నింపుకున్న మనిషి
ఈ యుగానికొక్కడు

మాటలతో లేనిదాన్ని ఉన్నట్లుజూపే పిట్టలదొరలు నేటి నాయకులు
జాగ్రత్త... జాగ్రత్త... జాగ్రత్త!!

 

సి. శేఖర్(సియస్సార్)