TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తీరిన కష్టం
ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకడి పేరు తరుణ్, మరొకడి పేరు బాలాజీ. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే బడిలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఆ సంవత్సరం వాళ్ల తరగతికి కొత్తగా రాజు అనే పిల్లవాడు వచ్చి చేరాడు. వాడొక గొప్ప 'యాక్టర్' అనచ్చు. వాడు వీళ్లతోటి ఒక మంచి స్నేహితుడిలాగా నటిస్తూనే, ఇద్దరి దగ్గరా దొంగతనాలు చేయసాగాడు.
అనుమానపడ్డ తరుణ్‌కు బాలాజీ మీద, బాలాజీకి తరుణ్ మీద చాడీలు చెప్పాడు. వాడు చెప్పింది నిజం అనుకొని, వాళ్ళిద్దరూ ఒకరికొకరు దూరమైనారు. కనీసం మాట్లాడుకోవటం కూడా మానేసారు. అయితే ఒక రోజున రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తరుణ్‌కు అక్కడ బాలాజీ పుస్తకాలు, వస్తువులు కనిపించాయి. వేరేవాళ్ళు పోగొట్టుకున్న వస్తువులు కూడా కొన్ని కొన్ని కనిపించాయి. సరిగ్గా అదే సమయానికి బాలాజీకేమో తరుణ్ వస్తువులు కనబడ్డాయి! దాంతో బాలాజీ, తరుణ్ మళ్ళీ మంచి స్నేహితులైపోయారు.
ఇద్దరూ కలిసి రాజు గురించి హెడ్ మాస్టర్ గారికి చెప్పారు. హెడ్మాస్టరుగారు రాజు వాళ్ల అమ్మ-నాన్నలను పిలిపించి మాట్లాడారు. తన బండారం బయట పడ్డందుకు రాజు సిగ్గుతో తల వంచుకున్నాడు. అయితే 'ఇకమీద నేను మంచిగా ఉంటాను' అని రాజునుండి మాట తీసుకున్నారు హెడ్మాస్టరు గారు. వాడి పేరు బయట పడకుండానే బడిలో పిల్లలకందరికీ వాళ్ల వాళ్ల సామానులు తిరిగి ఇప్పించారు.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో