Facebook Twitter
జనతా ట్రైన్!

జనతా ట్రైన్!

జబర్దస్తుగా జనతా రైలుబండెక్కి
రంగురంగుల తాయిత్తుల రిజర్వేషన్లతో కొందరు
రాజ్యాధికార రుబాబుతో బెర్తులెక్కి కొందరు
అమ్యామ్యాల ఆశజూపి సీట్లుబట్టి మరికొందరు!

పంచభూతాల్నీ ప్రైవేటుకివ్వాలనీ
పబ్లిక్ పౌరులు వాటిని కాపాడుకోలేరనీ
ఆస్తుల దస్త్రాలు బస్తాలు బండెడు వెంటేసుకొనీ
బోగీలనిండా నింపేసి మూటలతో సంస్కర్తలు!

ఉగ్రంగారేగే ఉద్యమాల లావా ప్రవాహంపై
చలువపందిళ్ళ వంతెన్లేసుకు సాగే నిరంకుశులు
అభినవ అప్రజాస్వామ్య రాజసూయానికై
ఆంగ్లజిత్తుల కుయుక్తులేయు సామ్రాజ్యవాదులు!

తక్కెడల్లో దూకే రాజకీయ మండూకాలు
కసిపోట్ల కరకు పొట్టేళ్ళ తత్వాలొదిలేసి
మందతోసాగు గొర్రెదాటు ఓటరు మహారాజులు
చట్టాలుజేయలేని డొల్ల బిల్లుల ప్రభుత్వాలు!

పాలక ప్రభువుల ప్రాపకాన
బ్రతకనేర్చి కర్తవ్యాలు మరచిన సేవకులు
ఏలికల పథకాలతో భద్రంగా
బ్రతుకీదుతూ కాలక్షేపంజేస్తూ బద్దక ప్రజలు!

గమ్యానికి నడిపించే కాపుల్లాగాక
జీవనచక్రాలకు తూట్లుపొడుస్తున్న సారధులు
ముస్తాబుల అబ్బురాన మురుస్తూ
బలికి సిద్ధపరుస్తున్నారన్న సోయిలేని జనాలు!

దుర్మార్గుల దులిపెయ్యాలనోచ్చి
కంగారులోయావన్మందినీ పీడిస్తున్న కరోనా
సాంతం జాతిరత్నాలతో కిక్కిరిసిన జనతా ట్రైన్
సామాన్యుడికి స్థానంలేక జీవనయానం దుర్భరమై!

-- రవి కిషోర్ పెంట్రాల

లాంగ్లీ, లండన్!