Facebook Twitter
జెయింట్ వీల్

                                                           జెయింట్ వీల్

                                                


ఊర్లోకి ఎగ్జిబిషన్ వచ్చింది.
వీధుల్లో రిక్షా బండి కి మైకు తగిలించి ప్రచారం చేస్తున్నారు.

 

ఎప్పుడూ టీవీలకు అతుక్కుపోయిన మొహాలు ఇంట్లోనుంచి బయటికి వచ్చి రిక్షా బండి ని తొంగిచూసి వెళ్తున్నాయి. వాడిపోయిన సాయంత్రాలకు జీవం నింపడానికి అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్లు వస్తుంటాయి అనుకుంటాను.

నేను కూడా వెళ్లాలి. చూడాలి... కనీసం ఈ సాయంత్రం అయినా వీలు కుదురుతుందో లేదో ! ఆఫీసు మిత్రులతో ఇదే మాట అంటే నవ్వారు. 'చిన్నప్పట్నుంచి ఎన్నిసార్లు వెళ్ళ లేదు. ఇప్పుడు మాత్రం వెళ్లి కొత్తగా చూసేది ఏముంటుంది' అని కొందరన్నారు.' ఆ తిరిగే జెయింట్ వీల్ ను చూస్తూ పెద్ద అప్పలాన్నో, మిరపకాయ బజ్జినో ఆ దుమ్ములో తినడం కోసమా...'అని వెటకారం గా అన్నారు ఇంకొందరు.

 

నా చిన్నప్పుడు మా ఊరిలో జరిగే జాతరకు, తిరునాళ్ళకు, ఉరుసుకు ఒకరోజు ముందే 'రంగులరాట్నం' వచ్చేది. దాన్ని బిగిస్తునప్పుడే బడిలో పిల్లలందరికీ తెలిసిపోయేది.

ఇక ఆ తర్వాత సమయం అంతా అక్కడే గడిచిపోయేది.

నేను ఎప్పుడు జాతరకు వెళ్ళినా ' రంగులరాట్నం' తప్పనిసరిగా ఎక్కే వాడిని. ఆ తరువాత రంగులరాట్నం ఎప్పుడు మాయమైయిందో తెలియదు. దాని స్థానం లోకి 'జెయింట్ వీల్' వచ్చి చేరింది. జెయింట్ వీల్ వచ్చిన తర్వాత రంగులరాట్నం పరిస్థితి ఉన్నాకూడా లేనట్లుగానే తయారయ్యింది. రంగులరాట్నాన్ని జెయింట్ వీల్ మింగేసింది.

పిల్లలందరూ జెయింట్ వీల్ వద్దనే గుమికూడే వారు.

వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు.

దాని చుట్టూ చేరి కేరింతలు కొట్టే వారు. వారి సంబరం అంబరాన్ని తాకేది. ఊర్లో నువ్వు ఏ వైపు నుంచి చూసినా అదో వింత జంతువులా 'జెయింట్ వీల్' కనిపిస్తూ ఉండేది. వచ్చి తనను కలవమని పిలుస్తున్నట్లు గానే ఉండేది. అంతకంటే ఆహ్వానం ఇంకేముంటుంది...

 

రెండు రోజులు దాటిపోయింది.

ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి కుదరలేదు.

ఈరోజు సాయంత్రం మిత్రుడు నాగరాజు వచ్చాడు. ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్ కి బయలుదేరాం. ఎడమ గేటు కు అవతల జెయింట్ వీల్ కనిపిస్తోంది.

 

వాతావరణం అంతా కోలాహలంగా ఉంది.

కుడివైపు గేటు వద్ద ఒక సన్నటి, పొడవాటి వ్యక్తిని చూసి అక్కడున్న పిల్లలు పరుగు పరుగున వచ్చి చేరుతున్నారు. చుట్టుముడుతున్నారు. అతను తన చేతిలోని టిక్కెట్లు పిల్లలందరికీ పంచుతున్నాడు . అందులో రెండు టికెట్లు ఉన్నాయి. ఒకటి లోపలికి ప్రవేశం కోసం, మరొకటి జెయింట్ వీల్ ఎక్కడం కోసం.

అతడికి ప్రేమగా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు పిల్లలు. వాళ్లందరూ పేద పిల్లలని చూస్తేనే అర్థమౌతోంది. మట్టి కొట్టుకపోయిన మాసిన ముఖాలు, చిరుగులు పడిన దుస్తులు, దుమ్ము పాదాలు ... బయటి నుంచి రోజూ లోపలికి చూసే కళ్ళు, వారి లేత చూపుల పిల్లలు

అట్నుంచి సంతోషంతో కేరింతలు కొడుతూ లోపలికి పరుగు పెడుతున్నారు. వాళ్లను చూసి అతడు కళ్ళనిండా సంతృప్తిని నింపుకుంటున్నాడు.

 

ఎగ్జిబిషన్ లోపలికి వెళ్లడానికి డబ్బులు లేక బయట నిలబడి.

రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులతో తిరుగుతున్న జెయింట్ వీల్ ను చూస్తూ గడిపే పేద పిల్లలకు ఇలా రోజూ వచ్చి ఉచితంగా టికెట్లు పంచుతూ అందులో తన సంతోషాన్ని వెతుక్కునే వ్యక్తిని నేను చూడడం ఇదే మొదటిసారి. ఎప్పుడూ వినింది కూడా లేదు. ఆశ్చర్యంగా ఉంది.

' ఆ వ్యక్తి ఊరి బయట ఉన్న ఆటోనగర్లో మెకానిక్ గా పనిచేస్తూ ఉన్నాడట. తన చిన్నప్పుడు డబ్బుల్లేక ఎగ్జిబిషన్ బయట నిలబడే వాడని , తనలాగా ఎవరూ పిల్లలు బాధపడకూడదని, ఇట్లా చేస్తున్నాడని అక్కడున్న వారు చెప్పుకుంటున్నారు.

 

నేనట్లా అతన్ని చూస్తూ ఉండిపోయాను.

అతను జెయింట్ వీల్ కంటే ఎత్తుగా కనిపించాడు!

                                                                  - డాక్టర్ వేంపల్లి గంగాధర్