Facebook Twitter
జమీందారి బంగ్లా

                                  జమీందారి బంగ్లా

                                      

                                        1
గుర్రపు బగ్గీ చెట్టు కింద నీడలో కనిపిస్తోంది.
బయటికి వెళ్లే పని లేకుండా ఇవాళ జమీందారు గారు బంగ్లా లోనే ఉంటారు కాబోలు. నౌకర్లు అటు ఇటు గా ఇంటి పనులు చేస్తూ వేగంగా తిరుగుతున్నారు.
సిరా బుడ్డీ లో కలాన్ని అద్దుకొని చేవ్రాలు పెట్టిన కాగితాలు పట్టుకొని గుమస్తాలు కార్యాలయంలోని గదిలోకి పరుగులు పెడుతున్నారు. వాతావరణం అంతా హడావిడిగా ఉంది.
పట్నం నుంచి నలుగురు కొత్త వ్యక్తులు వచ్చారు.
తాము వచ్చిన సంగతి, తమ వివరాలను అక్కడున్న బంట్రోతుకు చెప్పారు.
అతను కాసేపు వాళ్లను ఆవరణ లోని చెక్క కుర్చీ ల్లో ఆసీనులు కమ్మని సైగ చేశాడు.
వాళ్లు పిలుపు కోసం ఎదురు చూస్తూ ఆ కుర్చీల్లో కూర్చుండిపోయారు.
కొంతసేపటి తర్వాత వారికి జమీందారు గారి గదిలోకి అనుమతి లభించింది. తేనీరు కప్పులు లోపలికి వెళ్లాయి.
గట్టిగా జమీందారు గారు నవ్విన నవ్వు బయటకు వినిపించింది. వారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. మామూలుగా అయితే వారి కేకలతో బంగ్లా మొత్తం దద్దరిల్లుతుంటుంది . క్షణమొక యుగమై , తుఫాను ముందు ప్రశాంతతను మోస్తూ, నిరంతరం అప్రమత్తమై ఉంటుంది.
నౌకర్లు గుండెను అరచేతిలో పెట్టుకొని తిరగడం ఒకటే తక్కువ.
బంగ్లాలో పని చేయడం అంటే ఆషామాషీ కాదు.

                                     2
కొంత సమయం గడిచిన తరువాత జమీందారు గారి తో సహా,
ఆ నలుగురు కూడా బయటికి వచ్చారు. బంగ్లా మొదట్లో ఉన్న పొడవాటి రాతి మెట్లను దిగారు. అట్నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చారు. వాళ్ళల్లో పొడవుగా ,లావుగా ఉన్న వ్యక్తి అక్కడొక పెద్ద వలయం గీశాడు మట్టిలో. సరిపోతుంది అన్నట్లు జమీందారు గారు తలాడించారు. మళ్లీ వాళ్లను లోపలికి తీసుకెళ్లారు.

అక్కడ ఎడమ వైపు గోడకు ఉన్న ఎత్తైన తైలవర్ణ చిత్రాన్ని చూపిస్తున్నారు. అది జమీందారు గారి తండ్రి గారిది. ఆ చిత్రంలోని వ్యక్తి అశ్వం పై కూర్చున్న విధానంలోని గంభీర ధీరత్వం , ముఖకవళికలను, తేజస్సును, రాజసాన్ని, వీరత్వాన్ని గురించి కథలు కథలుగా చెప్తున్నారు. వాళ్లు వింటున్నారు. తన తండ్రిగారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని తయారుచేయించి బంగ్లా బయట ప్రవేశ మార్గంలో ప్రతిష్టించాలని జమీందారు గారు చాలా కాలంగా అనుకుంటూ ఉన్నారు. ఆ పని నిమిత్తమై ఇప్పుడు పట్నం నుంచి అదేపనిగా ఈ తయారీదారులను పిలిపించారు. కాంస్య విగ్రహం ఎలా ఉండాలని తను కోరుకుంటున్నాడో, తన మనసులోని ఆలోచనలన్నింటినీ వారికి వివరంగా చెప్పారు. దివాణం లోని ఖజానా అధికారిని పిలిచి కొంత రొక్కాన్ని వారికి ఇప్పించారు. ఇక వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పి, వారు సంతోషంగా వెళ్లిపోయారు.

                                    3
బంగ్లా లోపలికి అడుగుపెడుతూనే పైన ఎదురుగా
భీకర రూపంలో ఉన్న పులి తల, దాని చర్మము గోడకు బిగించబడి ఉన్నాయి.
కుడి వైపు గది పై భాగాన బలిష్టమైన , నునుపైన తెల్లని ఏనుగు దంతాలు అలంకరించబడి ఉన్నాయి. ఎడమ వైపు గది పైభాగాన ఒంపులు సొంపులు గా పురి తిరిగిన జింక కొమ్ములు కనిపిస్తాయి. మరో వైపు గోడకు నాటు తుపాకులు సగర్వంగా పలకరిస్తాయి.

బంగ్లా దర్బారు మందిరంలో అటు ఒక సింహం , ఇటు ఒక సింహం తో తయారుచేసిన నైపుణ్య మైన కొయ్య సింహాసనం. దానికి అటువైపుగా నిలువెత్తు వీర ఖడ్గం. ధరించడానికి సిద్ధంగా ఉన్నా ముత్యాల పట్టుకుచ్చుల తలపాగా , పులిగోరు హారం, మెరిసేటి విదేశీ పట్టు వస్త్రాలు, ఆభరణాలు, మెత్తటి మేజోళ్ళు, పరిమళాల అత్తర్లు, పూలాభిషేకాలు .. ఒక్కటేమిటి ? తరతరాల జమీందారు గారి సంస్థానం చూడ్డానికి రెండు కళ్లు చాలవని జనం అందరూ చెప్పుకుంటారు.

జమీందారు గారు సంస్థానంలో కి ఎవరొచ్చినా మంచి ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ.
మీది ఏ ఊరు అయినా, ఏ పని ఉండి ఇక్కడికి వచ్చినా ఆకలి కడుపుతో బాధపడకూడదని జమీందారు గారి ఆజ్ఞ. అందుకోసమే ఎడమవైపు చింతవనం దగ్గర వంటశాల, భోజనశాల కట్టించారు. పొయ్యి ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. రావుబహద్దూర్ అనిపించుకున్న తన తండ్రి గారు బాటసారుల కోసం నిర్మించిన సత్రాలు కూలిపోయిన చోటల్లా మళ్లీ కొత్తగా నిర్మిస్తూనే ఉన్నారు. గ్రామ ప్రజల కోరిక మేరకు చెరువులు, బావులు త్రవిస్తూనే ఉన్నారు. కరువు కాటకాలు వచ్చిన ప్రతిసారి, ఆదుకోమని చెయ్యి చాచి, బంగ్లా బయట నిలబడ్డ ప్రతి నిరుపేదకు, నిర్భాగ్యునికి సహాయం అందేది. వారి కన్నీళ్లు తుడిచి పంపేవారు.

                                  4
జమీందారు గారి గుర్రాన్ని చూడ్డానికి కూడా చుట్టుపక్కల ఊర్లల్లో నుంచి జనం వచ్చేవారు. వారి గుర్రపుస్వారీ కనువిందుగా ఉండేది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గుర్రాలను తేప్పించే వారు.

తెల్లటి గుర్రానికి ముఖంపైన నల్లటి నామం ఉంటే అదృష్టం అని నమ్మారు. అలా రాజసం ఉట్టిపడేలా ఉండే గుర్రం కోసం చెన్నపట్నం వెళ్లారు. దొరకలేదు. అట్నుంచి బొంబాయి పోయారు. దొరకలేదు. అట్లా అన్వేషిస్తూనే బరోడా , ఇండోర్, గ్వాలియర్ తిరిగొచ్చారు. చివరికి మైసూరు లోనే దొరికింది. ఎక్కువ మొత్తానికి ఖరీదు చేసికొన్నారు.

ఆ గుర్రం అంటే వారికి ప్రాణం. ఎంతో నమ్మకం. గుర్రపు పందాలు ఆడడం అలవాటైంది. సంస్థానంలో ఉన్న కాలం కంటే, గుర్రపు పందాలు ఆడుతూ ఎక్కడెక్కడో తిరిగే సమయం ఎక్కువ. బంగ్లాకు వచ్చినా కూడా మత్తుగా తాగి, చిత్తుగా పేకాట ఆడుతూ గడిపేవారు. విలాస పురుషుడు. సుఖ లోలుడు . అందుకే తన ఒక్కగానొక్క కుమారుడికి పెళ్లి చేయకుండానే పెద్ద వాళ్ళందరూ కాలంతో పాటు వెళ్ళిపోయారు.

                                  5
ఉదయాన్నే ఒక నాటక సమాజం వాళ్ళు వచ్చారు.
ఇక్కడే మూడు రోజులపాటు విడిది చేసి, 'సారంగధర' నాటకాన్ని ప్రదర్శిస్తామని వేడుకున్నారు. తమరు దయతలచి సహాయ , సహకారాలు అందించాలని మనవి చేసుకున్నారు.
జమీందారు గారు ' సరే' నని ఒప్పుకున్నారు.

ప్రతిరోజు సాయంత్రం నాటకం ఆసక్తిగా జనం చుట్టుపక్కల పల్లెల నుంచి బండ్లు కట్టుకొని వచ్చి మరీ తిలకించేవారు. బంగ్లా పైనుంచి మద్యం సేవిస్తూ జమీందారు గారు వీక్షించే వారు. నాటకంలో చిత్రాంగి పాత్ర వేసిన నాట్య నర్తకి ని తన గదికి రమ్మన్నాడు.
వెళ్లక తప్పలేదు.
చివరి రోజు పొద్దున్నే దివాణం లోని ఖజానా గుమస్తా వచ్చాడు.
నాటక బృందంతో మాట్లాడి వాళ్లకి ఏం కావాలో అది ఇచ్చి సంతోషంగా పంపాడు.

                                  6
కాలం ఇట్లా సాగుతుండగానే...
సంస్థానంలోని గ్రామాల్లో మశూచి ప్రబలింది. అనారోగ్యంతో ఎంతోమంది ప్రాణాలు విడిచారు. కరువు మేఘాలు కమ్ముకున్నాయి. పంటలు దెబ్బతిన్నాయి.
ఆహారం అందని పరిస్థితి.
కూడళ్ళలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయవలసి వచ్చింది.

కాలం ఇప్పుడు ఏం బాగోలేదు. కర్కశంగా ఉంది.
సాయంత్రం కాగానే బంగ్లా లోని దీపాలన్నిటికీ నూనె పోసి వెలిగించి వెళ్లిపోయారు పనివాళ్ళు.
అవి అట్లా తెల్లవార్లూ వెలుగుతూనే ఉంటాయి.
బంగ్లా నిశ్శబ్దంగా ఉంది. నిర్మానుష్యంగా ఉంది.
'దివాణం దివాలా తీసింది. ఖజానా ఖాళీ అయింది.' అని అందరూ అనుకుంటున్న మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి.
జమీందారు గారికి రాత్రంతా ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి.
అసహనంగా ఉంది. దూరం గా ఏదో పక్షి ఆగి ఆగి అరుస్తోంది .
కాలుస్తున్న నోట్లోని పొగచుట్ట అయిపోయింది. వేళ్ళ మధ్యలో మిగిలిన చివరి ముక్క అటువైపు కోపంగా విసిరేసాడు.
ఒక నిశ్చయానికి వచ్చాడు.
తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.
అప్పటివరకు బయట వరండాలో దేదీప్యమానంగా, ప్రకాశవంతంగా వెలుగుతున్న దీపం నూనె అయిపోవడంతో ఒక్కసారిగా బగ్గున వెలిగి ఆరిపోయింది.


                                                                   - డాక్టర్ వేంపల్లి గంగాధర్