నువ్వుల ఆవకాయ
ఇప్పటి వరకు ఆవకాయల్లో చాలా రకాలు చూశాం. ఈరోజు నువ్వుల ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. నువ్వుల ఆవకాయలో కారం చాలా తక్కువగా ఉండటం వలన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైగా నువ్వులలో కాల్షియం కూడా ఉంటుంది. ఈ నువ్వుల ఆవకాయ తినడం వల్ల వేడి చేస్తుందనే బాధ కూడా ఉండదు. మీరు కూడా ఈ నువ్వుల ఆవకాయ ఒకసారి ట్రై చేయండి.
కావలసిన పదార్ధాలు:
మామిడికాయలు -- 3
నూనె -- 500 గ్రాములు
తెల్ల నువ్వులు -- 500 గ్రాములు
ఉప్పు -- 250 గ్రాములు
పసుపు -- 10 గ్రాములు
ఆవాలు -- 50 గ్రాములు
మెంతులు -- 50 గ్రాములు
ఇంగువ -- చిటికెడు
అల్లం వెల్లుల్లి ముద్ద -- 200 గ్రాములు
జీలకర్ర -- 10 గ్రాములు
తయారీ విధానం:
ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడిగి, ఆరబెట్టి చిన్నముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, మెంతులు, నువ్వులను పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆవపొడి, మెంతిపొడి, ఉప్పు, నువ్వులపొడి, పసుపు సమంగా వేసి కలుపుకోవాలి. మరో గిన్నె తీసుకొని దానిలో నూనె వేసి అది కాగిన తరువాత ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగాక దించాలి. నూనె కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. దీనివల్ల దానిలో ఉన్న పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వస్తుంది. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత ముందుగా కలిపి ఉంచుకున్న పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పూర్తిగా ముక్కలకు పట్టిన తరువాత ఒక జాడీలో పెట్టుకోవాలి.
-పావని గాదం
|