చిల్లీ పన్నీర్
చిల్లి పన్నీర్ హోటల్స్ లో వుండే రుచికి దగ్గరగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీని తయారీకి ఎక్కువ సమయం పడుతుంది కానీ చేయటం చాలా సింపుల్. ఇందులో గ్రేవీకి వాడే కాప్సికం, ఉల్లి పాయలని క్యూబ్ లుగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం , వెల్లుల్లి సన్నగా తరుక్కోవాలి . డ్రై చిల్లి పన్నీర్ చేసినప్పుడు గ్రేవీ మొత్తం ముక్కలకి అంటేలా పెద్ద మంట మీద వుంచి కదపాలి. కొంచం గ్రేవీగా కావాలంటే సన్న మంటమీద వుంచి గ్రేవీ ముక్కలకి అంటుకున్నాక స్టవ్ ఆర్పాలి.
కావలసిన పదార్ధాలు:
పన్నీర్ - 500 గ్రాములు
కార్న్ ఫ్లోర్ - 4 చెమ్చాలు
మైదా - 2 చెమ్చాలు
వెల్లుల్లి - 4 రెబ్బలు (సన్నగా తరగాలి )
మిరియాల పొడి - రుచికి తగినంతా
ఉప్పు - రుచికి తగినంతా
నూనె - చిన్న కప్పు
గ్రేవీ తయారికి:
కాప్సికం -ఒక కప్పు
ఉల్లిపాయలు -అర కప్పు
ఉల్లి కాడలు - అర కప్పు
అల్లం , వెల్లుల్లి తరుగు -రెండు చెమ్చాలు
కార్న్ ఫ్లోర్ - రెండు చెమ్చాలు
సోయా సాస్ - రెండు చెమ్చాలు
పచ్చి మిర్చి - 4
చిల్లి సాస్ -ఒక చెమ్చా
తయారి విధానం:
ముందుగా ఒక కప్పులో కార్న్ ప్లోర్, మైదా, మిరియాల పొడి, ఉప్పు, వెల్లుల్లి వేసి, తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి ఆ మిశ్రమం ముక్కలకి పూర్తిగా అంటేలా కలపాలి. అలా కలిపాక ఆ కప్పుని డీప్ ఫ్రిడ్జ్ లో ఓ పది నిముషాలు పెట్టాలి. అలా చేస్తే ముక్కలకి మైదా మిశ్రమం చక్కగా పడుతుంది. ఫ్రిడ్జ్ లోనుంచి తీసాకా వెడల్పాటి నాన్ స్టిక్ పాన్ లో చిన్న కప్పుడు నూనె వేసి ఆ ముక్కలని వేయించాలి .( డీప్ ఫ్రై చేయచ్చు, లేదు నూనే ఎక్కువ వద్దు అనుకుంటే షాలో ఫ్రై కూడా చేయచ్చు ) కొంచం ఎరుపు రంగులోకి వస్తుండగా ముక్కలని తీసి పేపర్ నాప్కిన్ మీద వేయాలి.
గ్రేవీ తయారీ:
ముందుగా కార్న్ ఫ్లోర్ ని చిన్న కప్పు నీళ్ళల్లో కలపాలి. వెడల్పాటి నాన్ స్టిక్ పాన్ లో చెమ్చా నూనె వేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత సోయాసాస్ వేసి పెద్ద మంట మీద ఓ నిమిషం కదపాలి. ఆ తర్వాత వరసగా కాప్సికం, ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు వేసి పెద్ద మంటమీద వేయించాలి. కూర ముక్కలు పచ్చిదనం పోతే చాలు. మెత్తగా అవ్వకూడదు. అందుకే పెద్ద మంట మీద వేయించేది. చివరికి చిల్లి సాస్ వేసి కదిపాక నీళ్ళల్లో కలుపుకున్న కార్న్ ఫ్లోర్ ని వేసి కలుపుతూ, మద్యలో వేయించి పెట్టు కున్న పన్నీర్ వేయాలి. ఇప్పుడు కూర ముక్కలు, పన్నీర్ లకి గ్రేవీ పూర్తిగా అంటి, మిశ్రమం దగ్గర పడుతుండగా స్టవ్ ఆపాలి.
టిప్ :ఉప్పు రుచి చూసి వేసుకోవాలి గ్రేవీ లో. ఎందుకంటే పన్నీర్ లో ముందే ఉప్పు వేస్తాం. ఇక సోయాసాస్ లో ఉప్పు ఎక్కువగానే వుంటుంది. కాబట్టి గ్రేవీ రుచి చూసి, చప్పగా అనిపిస్తే చిటికెడు ఉప్పు కలపాలి.
-రమ
|