స్వీట్ హార్ట్ జామ్ డ్రాప్స్!
వేలెంటైన్స్ డే అంటే ఆ రోజున ప్రతీదీ స్పెషల్‌గానే వుండాలి. మనసుకు నచ్చిన వారి కోసం కొత్తగా కనిపించాలి... కొత్త ఊసులాడుకోవాలి.. కొత్త బాసలు చేసుకోవాలి... అంతేనా... కొత్త రకం స్వీట్లు కూడా చేసుకోవాలి. ఆ స్వీట్లు ఎవరి కోసం చేశారో వారికి కొసరి కొసరి తినిపించాలి. అప్పుడే వేలెంటైన్స్ డే కొత్త అనుభూతుల్ని మిగులుస్తుంది.. తమవారి కోసం చక్కని స్వీట్లు చేసి పెట్టగలిగే అవకాశం ఈరోజుల్లో అమ్మాయిలకే ఎక్కువ వుంది. ఎందుకంటే నేటి అమ్మాయిలు ఆధునిక వంటలను ఇట్టే చేసేయగలరు. పాపం అబ్బాయిలకు వంట చేసేంత సీన్ ఎక్కడుంటుంది? అందుకే అమ్మాయిలు ఈ క్రింది స్వీట్ తయారు చేసి... అదిగో... వంటలు చేయలేమని బిక్కముఖం వేసుకుని కూర్చున్నారే.. ఆ అబ్బాయిలకు తినిపించండి... వేలెంటైన్స్ డే సందర్భంగా ఈరోజు ఒక వైరెటీ స్వీట్ ఎలా చేయాలో చూడండి.. ఈ స్వీట్ పేరు స్వీట్ హార్ట్ జామ్ డ్రాప్స్.
కావలసిన పదార్థాలు:
బటర్ - 125 గ్రాములు
పంచదార - అరకప్పు
వెనీలా ఎస్సెన్స్ - అర టీ స్పూన్
కోడిగుడ్డు - ఒకటి
మైదా - కప్పున్నర
జామ్ - ఐదు స్పూన్లు
తయారుచేసే విధానం:
సేకరించి ఉంచుకున్న పదార్థాలతో స్వీట్ హార్ట్ జామ్ డ్రాప్స్ తయారు చేయడం ప్రారంభించడానికి ముందుగా ఓవెన్‌ని ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. 180 డిగ్రీల ఉష్ణోగ్రత వుండేలా చూసుకోవాలి. మిక్సీలో బటర్, పంచదార, వెనీలా ఎసెన్స్ ఈ మూడూ మిక్సీలో వేసుకుని బాగా కలిసిపోయేలా చేయాలి. ఆ తర్వాత అందులోనే కోడిగుడ్డు, మైదా పిండి వేసి బాగా ముద్దలా అయ్యేలా చేయాలి. మిక్సీలోంచి బయటకి తీసిన తర్వాత కూడా ఆ మిశ్రమాన్ని బేసిన్‌లో వేసుకుని పూరీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఆ పిండిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకుని, అంటే పైన పేర్కొన్న కొలతలకి 10 ముద్దలు అవుతాయి.
ఆ ముద్దలకు గుండ్రని షేప్ ఇవ్వాలి. ఆ గుండ్రని షేప్‌కి మధ్యలో హార్ట్ షేప్‌లో గుంట వచ్చేలా చేయాలి. ఆ తర్వాత వీటిని ఓవెన్‌లో ఉంచి వాటికి బంగారు రంగు వచ్చే వరకూ 20 నిమిషాలపాటు బేక్ చేయాలి. ఇప్పుడు బంగారు రంగులో కరకరలాడే హార్ట్స్ తయారవుతాయి. వాటిని బయటకి తీసి చల్లార్చిన తర్వాత ఆ హార్ట్స్‌లో మధ్యలో వున్న ఖాళీలో మీకు నచ్చే తరహా జామ్ నింపుకోవాలి. ఇప్పుడు సిద్ధమైన స్వీట్ హార్ట్ జామ్ డ్రాప్స్‌ని ఇష్టమైన వాళ్ళతో కలసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కొద్దికొద్దిగా కొరుక్కుని తింటూ వుంటే... అబ్బ... ఎంత బాగుంటాయో...! |