ఊదల పుదీనా అన్నం
కావలసిన పదార్ధాలు:
ఊదలు - ఒక కప్పు
నెయ్యి లేదా నూనె - 2 టీ స్పూన్లు
ఉల్లి తరుగు - పావు కప్పు
టొమాటో తరుగు - అర కప్పు
నీళ్లు - 2 కప్పులు
బిర్యానీ ఆకు - 1
కరివేపాకు - 2
ఉప్పు - తగినంత
తరిగిన పచ్చి మిర్చి - 2
క్యారట్ తరుగు - ఒక కప్పు
కొత్తిమీర - పావు కప్పు
పుదీనా - ఒక కప్పు
లవంగాలు - 2
అల్లం, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను
తయారుచేసే విధానం:
ఊదలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి. స్టౌ మీద కుకర్‌లో ఊదలు, నీళ్లు, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి కుకర్ మూత పెట్టాలి. మంటను కొద్దిగా తగ్గించి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పుదీనా ఆకును శుభ్రంగా కడిగి, కొద్దిగా నీళ్లు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక లవంగాలు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. పుదీనా ముద్ద వేసి బాగా కలిపి, కొద్దిసేపు ఉడికించాలి. చివరగా ఉప్పు వేసి కలియబెట్టి దింపేయాలి. ఒక పెద్ద పాత్రలో ఉడికించిన ఊదలు, వేయించి ఉంచుకున్న పుదీనా మిశ్రమం వేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించాలి. రైతాతో వడ్డించాలి.
|