ఆకాకరకాయ కూర
కావలసిన పదార్ధాలు:
ఆకాకరకాయలు - 1 కప్పు గుడ్రంగా చక్రాలుగా తరిగిన ముక్కలు
ఉల్లిపాయముక్కలు - 1/2 కప్పు
పచ్చిమిరపకాయ - 1 (తరిగిన ముక్కలు)
కరివేపాకు - 10 ఆకులు
చింతపండు రసం - 1/8 కప్పు
మెంతిపిండి - 1/4 స్పూన్
బెల్లం - సగంనిమ్మచెక్క అంత
వరిపిండి - 1 చెంచా
ఉప్పు - 1/2 చెంచా
కారం - 1/2 చెంచా
నూనె - తగినంత
పోపుగింజలు - ఎండు మిరపకాయలు 2
ఇంగువ
తయారు చేసే విధానం :
ముందుగా ఆకాకరకాయలు గుండ్రని ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దళసరి బాణలిలో నూనె పోసి కాగాక పోపుగింజలు, ఎండు మిరపకాయలు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయిస్తూ ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుతూ కొంచము వేగిన తరువాత ఉప్పు, పసుపు వేసి ఇష్టమైన వారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలుపుతూ వేయించుకుని గుడ్రంగా చక్రాలుగా తరిగి ఉంచుకున్న ఆకాకరముక్కలు వేసి కొద్ది నీరు చిలకరించి..... మూతపెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆతరువాత అందులో బెల్లం, చింతపండు రసం, మెంతిపొడి వేసి పూర్తిగా కూర ఉడుకుతున్న సమయంలో వరిపిండిని నీటిలో కలిపి కూరలో వేసి కలియబెట్టాలి. ఈ పిండి వేయడంవల్ల కూర దగ్గరపడి చక్కగా రుచిగా ఉంటుంది. స్టౌవ్ ఆఫ్ చేసి ..... కొద్దిగా నేతిని కలిపి గిన్నెలోకి తీసుకోవాలి. ఇది అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. |