స్టఫడ్ కాప్సికం
ఏ కూరలో అయినా కాప్సికం వేస్తే ఆ కోరకె రుచి వస్తుంది. అలాంటిది కాప్సికంలో ఆలు కర్రీ స్టఫ్ చేసి పెట్టి కూర చేస్తే ఇంకా చెప్పక్కర్లెద్దు ఆహా ఏమి కాంబినేషన్ అనిపిస్తుంది. చాలా మంది స్టఫడ్ కాప్సికం అనగానే కూర తయారుచేసి దానిని కాప్సికంలో పెట్టి, అప్పుడు కుక్ చేస్తారు. కాని అలా కన్నా ఇంకో పద్దతిలో ఈజీగా ఈ రెసిపీని తయారుచేయచ్చు. అది ఎలాగో చూద్దామా.
కావాల్సిన పదార్థాలు:
కాప్సికం - 5
బంగాలదుంపలు - 4
ఉల్లిపాయ - 2
టమాటా - 2
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 చెంచా
పోపు దినుసులు - కొద్దిగా
గరం మసాలా పొడి - 1/4 చెంచా
ఉప్పు, కారం - తగినంత
కొత్తిమీర - 1 కట్ట
కసూరి మెంతి - 1 చెంచా
తయారి విధానం:
కాప్సికం కడిగి దాని తొడిమతో పాటు పై భాగాన్ని కొంత వరకు కట్ చెయ్యాలి. లోపల ఉన్న విత్తనాల్ని చాకుతో మెల్లిగా తీసెయ్యాలి. ఆ కాప్సికంలని నూనే వేసిన కడాయిలో వేసి ఉప్పు చల్లి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు చాలు అవి మగ్గటానికి. వాటిని తీసి వేరే ప్లేట్ లో ఉంచాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనే వేసి పోపు దినుసులు వేసి చిటపటలాడాకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి. ఒక 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. అందులో ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి. అంతా బాగా కలిపి అందులో ఉప్పు, కారం, గరం మసాలా పొడి, కసూరి మెంతి,కొత్తిమీర వేసి కలపాలి. కూర రెడీ అయిన తర్వాత ముందుగా మగ్గించుకున్న కాప్సికంలో ఈ కూరని స్టఫ్ చేయాలి. అప్పుడు కాప్సికం మాడిపోకుండా, పచ్చిగా లేకుండా చూడటానికి ఎంతో బాగుంటుంది. అంతే టేస్టీ టేస్టీగా ఉండే స్టఫడ్ కాప్సికం కర్రీ రెడీ అయినట్టే.
..కళ్యాణి
|