తీపి - పులుపుల గుమ్మడి కూర
తీపి గుమ్మడికాయలో పీచు పదార్ధం ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఎ కూడా ఉండటంతో చాల మంది దీనిని తినటానికి ఇష్టపడతారు. మరి గుమ్మడికాయ కూర ఎలా చెయ్యాలో చూద్దామా.
కావాల్సిన పదార్థాలు:
తీపి గుమ్మడి కాయ ముక్కలు - 3 కప్పులు
పచ్చి మిర్చి - 6
సోంపు - 1 టీ స్పూన్
పంచదార - 1 స్పూన్
మిరియాలు - 1/2 స్పూన్
ఆమ్చూర్ పొడి - కొద్దిగా
పోపు దినుసులు - సరిపడా
ఉప్పు తగినంత
తయారి విధానం:
ఈ కర్రీ తయారుచేసుకోవటానికి ముందుగా మనం చెయ్యాల్సింది గుమ్మడికాయని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి కాస్తంత నూనే వేసి అందులో సోంపు, మిరియాలు వేసి వేయించుకోవాలి. అవి ఘుమఘుమలాడే వాసన రాగానే వాటిని ఒక ప్లేట్ లోకి తీసి ఉంచాలి. అదే కడాయిలో మరికొంత నూనే వేసి పోపు దినుసులు,పచ్చి మిర్చి వేసి వేగాకా, గుమ్మడి ముక్కల్ని వేసి మూట పెట్టాలి. అవి మెత్తబడేలోపు వేయించి పెట్టుకున్న సోంపు, మిరియాలని పొడి చేయాలి. ఉడికిన ముక్కల్లో పంచదార, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అందులో పొడి చేసి పెట్టుకున్నసోంపు ,మిరియాల పొడిని చల్లి ఒక 3 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. కూర రావాలంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఆఖరుగా ఆమ్చూర్ పొడిని వేసి కలిపాలి. దించే ముందు కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవటమే. చాలామందికి తీపి గుమ్మడి తింటే వాతం నొప్పులు వస్తాయనే చాయం ఉంటుంది. కాని ఈ కూరలో మనం మిరియాల పొడి కలపటం వల్ల అలాంటి ఇబ్బంది కూడా పడే అవసరం లేదు. తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఉండే గుమ్మడికూర వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అబ్బా భలే రుచిగా ఉంటుంది.
..కళ్యాణి
|