అచారి ఆలూ
ఇంట్లో ఏం కూర చేయాలి ఈ రోజు ? అని అడిగాం అనుకోండి, పిల్లలు వెంటనే ' ఆలు ' అంటారు. అలా అని ఏ వేపుడో చేస్తాం అంటే.. కాదు ఇంకేదన్నా చెయ్ అంటారు. నాకు అర్ధమయ్యింది ఒక్కటే.. అమ్మల ఆలూ కూరని మాత్రం రకరకాలుగా వండటం నేర్చుకుని తీరాలి. అప్పుడే మన ఇంట్లోని బుజ్జి బాబులు పేచీలు లేకుండా అన్నం తింటారు. అలా నేను మా పిల్లలు పెట్టే పరీక్షలో పాస్ అవ్వటానికి ఆలూని ఎన్ని రకాలుగా వండుతారు డిఫెరెంట్ ప్లేసెస్ లో అని తెలుసుకుంటుంటే బోల్డన్ని మంచి వెరైటీ లు తెలిసాయి. అందులో ఒకటి ఈ అచారి ఆలూ...
అసలుకి ఈ ఆలూ కూర కి ఆవకాయ రుచి రావాలట. కొన్ని ప్రాంతాలలో ఆలూ ఉడికించి, ముక్కలు చేసి ఆవ నూనె లో ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి ఆ తర్వాత ఆలు ముక్కలు వేసి బాగా కలిపాక, కొంచం పసుపు వేసి ఆ తర్వాత ఇంట్లోని ఆవకాయ నుంచి కొంత పిండిని తీసి ( ఓ రెండు చెంచాలు ) వేసి కలుపుతారుట. ఈ కూర లో వేరేగా కారం, ఉప్పు వేయనవసరం పడదుట. అన్ని కలిపాక రుచి చూసి అప్పుడు కావాలంటే, ఉప్పు, కారం కలుపుకోవాలి. ఈ విధానం కాకుండా.. కూర కి పచ్చడి రుచి వచ్చేలా ఆవపిండి, నువ్వుల పొడి వంటివి చేర్చి కూడా కూర చేస్తారు. ఈ రోజు ఆ విధానం చెప్పుకుందాం .
కావలసిన పదార్ధాలు:
ఆలూ - 500 గ్రాములు
మెంతులు - అర చెమ్చా
ఆవాలు - ఒకటిన్నార చెమ్చా
నువ్వులు - పావు చెమ్చా
ఎండు మిర్చి - ఒక అయిదు
వెల్లుల్లి - అయిదు రేకులు
ఉప్పు, పసుపు - తగినంత
అమ్చూర్ పొడి - పావు చెమ్చా
పప్పు నూనె - రెండు చెమ్చాలు
తయారి విధానం:
ముందుగా ఆలు ని ఉడికించు కోవాలి . ఆ తర్వాత తొక్క వొలిచి , చాకుతో ఒక సైజు లో వచ్చేలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ లోపు మెంతులని పొడి మూకుడులో (నూనె వేయకూడదు) ఎర్రగా వేయించుకొని , అవి కొంచం వేగగానే నువ్వులు కుడా వేసి వేయించాలి . నువ్వులు చిటపట అంటుండగా ఎండు మిర్చి వేసి వేయించాలి . ఆఖరుగా ఆవాలు వేసి దించేయాలి. ఆవాలు వేడి ఎక్కితే చాలు . ఎర్రగా వేగాక్కరలెద్దు. అలా వేయించిన దినుసులన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి . ఆఖరులో వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్కసారి తిప్పి ఆపేయాలి. వెల్లుల్లి మెత్తగా అవ్వకూడదు. ఇక ఇప్పుడు బాణలి లో పప్పు నూనె వేసి ( ఈ నూనె తోనే కూర రుచి వచ్చేది ) ఆవాలు, కరివేపాకు వేసి, వెంటనే ఒలిచి సిద్దం గా పెట్టుకున్న ఆలు ముక్కలు, ఉప్పు, పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసి బాగా కలపాలి . ఆఖరులో ఆమ్చూర్ పొడి వేసి కలియ పెట్టి దింపుకోవాలి. డిఫరెంట్ టేస్ట్ తో అచారి ఆలు పిల్లలకి బాగా నచ్చుతుంది . ఆఖరులో కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు .
టిప్: కొంతమంది ఉడికించిన ఆలూ ని నూనె లో ఎర్రగా వేయించి వేస్తారు . అలాగే నువ్వులు వద్దు అనుకుంటే మానేయచ్చు . దాని బదులు కొంచం కొబ్బరి వేసుకున్నా బావుంటుంది .
- Rama
|