జిల్లేడు కాయలు
(వినాయకచవితి స్పెషల్)
వినాయకునికి ఉండ్రాళ్లు, కుడుములతో పాటు జిల్లేడు కాయలని కూడా ఆరగింపుగా పెడతారు. వినాయకుని నైవైద్యంలో ప్రతీ వంటంక ఆవిరి మీద ఉడికించినదే. ఈ జిల్లేడు కాయలు కూడా అంతే. చేయడం సులువు... రుచిగా కూడా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు:
బియ్యపు పిండి - 2 కప్పులు
బెల్లం - 1 కప్పు
కొబ్బరి తురుము - 1/2 కప్పు
జీడిపప్పు - 4 చెమ్చాలు
కిస్మిస్ - 4 చెమ్చాలు
నువ్వులు - పావుకప్పుడు
పల్లీలు - పావు కప్పుడు
నీళ్లు - రెండు కప్పులు
ఉప్పు - రుచికి తగినంత
యాలుకుల పొడి - చిటికెడు
తయారీ విధానం:
1. ముందుగా నీళ్లని ఒక వెడల్పాటి గిన్నెలో పోసి బాగా మరిగించాలి. అవి కళపెళ మరుగుతుండగా బియ్యపు పిండిని కొంచం, కొంచం పోస్తూ కదుపుతూ ఉండాలి ( బియ్యపు పిండిలో ముందుగానే ఉప్పు కలిపి ఉంచాలి). ఉండలు చుట్టకుండా చూసుకోవాలి. పిండి ఉడికి గిన్నెని వదులుతుండగా స్టవ్ ఆపేసి దించాలి.
2. ఇప్పుడు ఒక బాణలిలో పల్లీలని, నువ్వులని విడివిడిగా ఎర్రబడే వరకూ వేయించి ఆరనివ్వాలి. ఆరాకా మరీ మెత్తగా కాకుండా బరక బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
3. ఒక ప్లేట్ లోకి కొబ్బరి తురుము, పల్లీలు, నువ్వుల పొడి, బెల్లం తురుము, యాలుకుల పొడి, అలాగే జీడిపప్పు, కిస్ మిస్ ( వీటిని వేయించుకోవద్దు. సన్నగా కట్ చేసుకోవాలి) తీసుకొని వాటిని బాగా కలపాలి.
4. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బియ్యపు పిండిని చిన్న ఉండలుగా చేసి నెమ్మదిగా చేతితో వత్తుకోవాలి. ( పూరీలలా అరచేతి సైజులో ఉండాలి).
5. అలా వత్తిన పిండి మధ్యలో కొబ్బరి తురుము మిశ్రమాన్ని పెట్టి, కజ్జికాయలని మడిచినట్టు మధ్యకి మడవాలి (చూడటానికి కజ్జికాయలలా వస్తాయి). చూట్టూ చేతితో వత్తితే పిండి మధ్యలో మిశ్రమం ఉంటుంది.
6. ఆఖరిగా అలా సిద్దమయిన జిల్లేడు కాయలని ఒక కుక్కర్ గిన్నెలో పెట్టి ఆవిరిమీద ఒక పది నిమిషాలు ఉడికించాలి (ఎక్కువ సేపు ఉంచకూడదు విడిపోతాయి).
...రమ
|