లెమన్ షర్బత్
ఎండలుగా వున్నప్పుడు నిమ్మరసం తాగితే హాయిగా వుంటుంది. ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు కలుపుకోవటం, లేదా మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ రసాలు తెచ్చుకుని తాగటం చేస్తాం. కాని పూర్వం ఇంట్లో నిమ్మ షరబత్ చేసి పెట్టేవారు. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కుండలో నీళ్ళతో నిమ్మరసం చేసుకుని తాగేవారు. బయట కొనే శీతల పానీయాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని మనందరికీ తెలిసిందే కాబట్టి మళ్ళీ పూర్వంలా నిమ్మ షరబత్ చేసి పెట్టుకుందాం. ఇది చేసేటప్పుడు పిల్లలని పిలిచి నేర్పిస్తే , ఇంకోసారి వాళ్ళే చేస్తారు.. ఎందుకంటే చాలా సింపుల్ చేయటం. చాలామందికి ఈ ప్రాసెస్ తెలిసే వుంటుంది. కాని ఏవి, ఎంత వేయాలి అన్నది డౌట్ గా వుంటుంది. అందుకే ఆ వివరాలు, చేసే విధానం ఒకసారి చెప్పుకుందాం.
కావలిసినవి:
నిమ్మ రసం - ఒక గ్లాసుడు
పంచదార - నాలుగు గ్లాసులు
మంచి నీరు - అర గ్లాసు
ఉప్పు - ఒక టీ స్పూన్
తయారీ విధానం:
నిమ్మరసాన్ని వడకట్టి పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో పంచదార వేసి, నీరు పోసి కలుపుతూ వుండాలి. ఇలా తీగ పాకం వచ్చేదాకా స్టవ్ మీద ఉంచాలి. పంచదార పాకాన్ని చేత్తో తీసి రెండు వేళ్ళ మద్య పట్టు కుంటే తీగలా సాగుతుంది. అలా పాకం వచ్చాక స్టవ్ ఆపేయాలి. చల్లారాక అందులో నిమ్మరసం , ఉప్పు వేసి బాగా కలపాలి. పొడి సీసా లో పోసి వుంచుకుని.. కావలసినప్పుడు ఒక గ్లాసు మంచి నీరుకు రెండు చెమ్చా ల నిమ్మ షరబత్ వేసి కలిపితే చాలు.
-రమ