Top Stories

political-news-img

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్తహెల్త్ స్కీమ్ ప్రారంభం..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల దశాబ్దాల కల నెరవేరింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ‘న్యూ ఎంప్లాయ్స్ హెల్త్ స్కీమ్‌ను అధికారికంగా ప్రారంభించింది. సచివాలయంలో జరిగిన ఒక ఉన్నత స్థాయి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కలిసి ఈ చారిత్రాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సరికొత్త ఎన్‌ఈహెచ్ఎస్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులతో పాటు సరికొత్త ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ డీడ్‌ను వారు ఆవిష్కరించారు. దీనివల్ల దాదాపు 17.88 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు పూర్తి నగదు రహిత (క్యాష్‌లెస్) ఆరోగ్య రక్షణ లభించనుంది. ఈ పథకం పరిధి ఎంత విస్తృతమైనదో అర్థం చేసుకోవడానికి కొన్ని కీలక గణాంకాలను పరిశీలించాలి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 886 కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆస్పత్రులు, అలాగే 114 ప్రభుత్వ ఆస్పత్రుల నెట్‌వర్క్ ద్వారా ఈ నగదు రహిత సేవలు అందనున్నాయి. మొత్తంగా 1,000 ఆస్పత్రులలో ఉద్యోగులు రూపాయి కూడా చేతి నుంచి ఖర్చు పెట్టకుండా సూపర్ స్పెషాలిటీ చికిత్సలు పొందవచ్చు. అపోలో, యశోద, కిమ్స్, మెడికవర్, కేర్, కామినేని వంటి అగ్రశ్రేణి కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఈ ప్యానెల్‌లో భాగస్వామ్యమయ్యాయి. కేవలం సాధారణ రోగాలు మాత్రమే కాకుండా దాదాపు 1,816 రకాల వైద్య మరియు శస్త్రచికిత్స ప్యాకేజీలను ఈ పథకం ద్వారా ఉచితంగా అందించేలా డిజైన్ చేశారు. ఈ సరికొత్త హెల్త్ స్కీమ్ పూర్తి పారదర్శకంగా సాగడానికి డిజిటల్ వ్యవస్థను రంగంలోకి దించారు. రోగి హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి ప్రీ-ఆథరైజేషన్, చికిత్స, మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్ వరకు జరిగే పూర్తి ప్రక్రియ అంతా కూడా ఆన్‌లైన్‌లోనే డిజిటల్ రూపంలో జరగనుంది. ఇదివరకు ఉన్న అనేక అడ్డంకులు, కాలయాపనలను ఈ నూతన విధానం పూర్తిగా దూరం చేయనుంది. ఇక వైద్య సేవల నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 12 వెల్‌నెస్ సెంటర్లతో పాటు అదనంగా మరో 24 వెల్‌నెస్ సెంటర్లను త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి వెల్‌నెస్ సెంటర్‌ను అక్కడి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో అనుసంధానం చేస్తారు. దీనివల్ల స్థానికంగానే నిరంతర సంరక్షణ, అవసరమైన మందులు సులభంగా అందుతాయి. ఈ పథకం ఆర్థిక నమూనా కూడా చాలా ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది. దీని నిర్వహణ కోసం ఉద్యోగుల మూల వేతనం లేదా పెన్షనర్ల మూల పెన్షన్ నుండి ప్రతి నెలా 1.5 శాతం మొత్తాన్ని ఈహెచ్‌ఎస్ హెల్త్ ఫండ్‌కు మినహాయిస్తారు. ఉద్యోగుల నుంచి సేకరించే నిధుల మొత్తానికి సరిసమానంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తన వంతు వాటాను (మ్యాచింగ్ గ్రాంట్) జోడించి ఈ ట్రస్ట్‌కు అందిస్తుంది. దీనివల్ల ఏటా దాదాపు ₹528 కోట్ల నిధుల పూల్ సమకూరుతుంది. ఈ మొత్తం నిధులను ప్రత్యేక అకౌంట్ హెడ్ కింద భద్రపరిచి, కేవలం ఉద్యోగుల అత్యవసర వైద్య చికిత్సల కోసమే వినియోగిస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పుడు వచ్చే డబుల్ డిడక్షన్ సమస్యకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఒకే ఇంట్లో ఇద్దరు ఉద్యోగులున్నా, లేదా ఒకరు ఉద్యోగి మరొకరు పెన్షనర్‌గా ఉన్నా కూడా కేవలం ఒకరి జీతం నుంచి మాత్రమే 1.5 శాతం నిధుల కటింగ్ ఉంటుంది. పొరపాటున ఎవరికైనా రెండు సార్లు కట్ అయి ఉంటే, ఆ మొత్తాన్ని వెంటనే తిరిగి రీఫండ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పడిన న్యూ ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఈ సేవల నాణ్యతను, బిల్లుల చెల్లింపులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఉద్యోగుల ఆరోగ్యానికి బలమైన భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Publish Date: Jul 17, 2026 6:43PM

political-news-img

మోకాళ్ల నొప్పికి మందుల కంటే ముందు ఈ యోగా వ్యాయామాలు తప్పక ప్రయత్నించండి!

మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే సులభమైన యోగా ఆసనాలు మరియు వ్యాయామాలను వివరంగా చూపించారు. ఈ యోగా పద్ధతులను సరైన విధంగా, క్రమం తప్పకుండా చేస్తే మోకాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్ల కదలిక మెరుగుపడుతుంది. మోకాళ్లలో గట్టిదనం తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి ఉపయోగపడవచ్చు. వయస్సుతో వచ్చే మోకాళ్ల సమస్యలు, ఆస్టియోఆర్థ్రైటిస్ ప్రారంభ దశలో ఉన్నవారు లేదా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ వ్యాయామాల గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: మోకాళ్ల నొప్పికి కారణాలు మోకాళ్ల కండరాలను బలపరిచే యోగా వ్యాయామాలు నొప్పిని తగ్గించే సులభమైన స్ట్రెచింగ్ పద్ధతులు నడవడం, మెట్లు ఎక్కడం సులభం కావడానికి ఉపయోగపడే సూచనలు మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే యోగా చిట్కాలు గమనిక: మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా శస్త్రచికిత్స అనంతర పరిస్థితి ఉంటే, ఈ వ్యాయామాలను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి

Publish Date: Jul 17, 2026 6:22PM

political-news-img

వైసీపీ విధ్వంసం నుంచి ఏపీని నిలబెట్టింది కేంద్రమే.. చంద్రబాబు.!

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆర్థిక, పాలన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని కేంద్రమే రక్షించి నిలబెట్టిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందించిన బహుముఖ సహాయ సహకారాల వల్లే రాష్ట్రం నేడు తిరిగి ప్రగతి పథంలోకి వచ్చిందన్నారు. నరసరావుపేట వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక క్రెడిట్ అవుట్ రీచ్ బహిరంగ సభలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలోని దాదాపు లక్షా 3వేల మందికి పైగా లబ్థిదారులకు 3 వేల 216 కోట్ల భారీ రుణాలను చంద్రబాబు, నిర్మలా సీతారామన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక చేయూతను ప్రస్తావించారు. రాజధాని అమరావతి నిర్మాణం, ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచిందన్నారు. Chandrababu Naidu, Nirmala Sitharaman, Narasaraopet Credit Outreach, Andhra Pradesh Loans Distribution, AP Economy Recovery

Publish Date: Jul 17, 2026 5:49PM

political-news-img

ఓటు బ్యాంకు కోసం నేరస్థులను నెత్తిన పెట్టుకుంటున్నారా...?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల సమీకరణాలు, ప్రాంతీయ భావోద్వేగాల చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో ఈ ధోరణి మరింత ముదిరి, నేరస్థులకు కూడా కులాన్ని ఆపాదించే స్థాయికి చేరడం ఆందోళనకరం.. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే నేరగాళ్లను నెత్తిన పెట్టుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ‘సాయి కృష్ణ’ కేసు వ్యవహారంలో జరిగిన రాజకీయాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ అంశంపై తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఒక పక్క అధికార పక్షం, మరోపక్క ప్రధాన ప్రతిపక్షం నేరస్థుడి నేపథ్యాన్ని పక్కనబెట్టి, వారిని ఒక కుల ప్రతినిధిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన రాజకీయ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. శాంతిభద్రతల కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసే ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారుతోంది. రాజకీయ వ్యూహాలు మరియు పరిణామాలు ఈ వివాదం వెనుక ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు కులాన్ని దూరం చేయాలనే ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాయి కృష్ణ అనే ఒక రౌడీ షీటర్‌పై అనేక కేసులు ఉన్నప్పటికీ, అతని మరణాన్ని కుల కోణంలో చూపిస్తూ వైసీపీ, టీడీపీ లబ్ధి పొందాలని చూశాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా బాధితుల ఇంటికి వెళ్లడం ఒక వ్యూహాత్మక చర్య అయితే, తదుపరి రోజే చంద్రబాబు నాయుడు ఆ నేరస్థుడి తల్లిని పిలిపించుకుని భూములు, డబ్బులు ఇస్తామని హామీలు ఇవ్వడం వారి బలహీనతను చూపిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణ కంటే, ఓట్లు మరియు కుల ప్రయోజనాలే ముఖ్యమనే ధోరణిలో ఈ రెండు పార్టీలు వ్యవహరించాయి. కేవలం రాజకీయ లాభం కోసం ఒక ప్రొఫెషనల్ క్రిమినల్‌ను వెనకేసుకురావడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుంది. మరోవైపు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవను కూడా రాజకీయ నాయకులు కులాల మధ్య వివాదంగా మార్చేందుకు ప్రయత్నించడం దారుణం. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకునే శైలిపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనకు ‘ఆలోచన తప్ప సమాలోచన లేదని’, పార్టీలోని మేధావుల సలహాలను పక్కనబెట్టి ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు తీసుకుంటారని అమరావతి రాజధాని విషయంలో ఆయన మార్చుకున్న వైఖరిని బట్టి స్పష్టమవుతోంది. రాజకీయ సలహాదారుల మాటలను కేవలం ఓట్ల లెక్కింపు కోసమే వాడుకుంటూ, ప్రజా హితాన్ని విస్మరించడం పరిణామాలను మరింత జటిలం చేస్తోంది. ఇలాంటి ఏకపక్ష పరిణామాలు కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యూహాలు కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగపడతాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాత్రం "నేరస్థుడికి కులం లేదు" అనే తన సిద్ధాంతానికి కట్టుబడి, నిలబడటం గమనార్హం. భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావంఇలాంటి కుల నేరపూరిత రాజకీయాలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించడం కంటే, కేవలం పదవుల కోసం, మళ్లీ అధికారంలోకి రావడం కోసమే పార్టీలు ప్రాకులాడుతున్నాయనే భావన ప్రజల్లో బలపడుతోంది. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షాల వ్యూహాలకు భయపడి సర్కస్ గారడీలు చేయడం మానేసి, చట్టాన్ని చట్టంలా అమలు చేయాల్సిన అవసరం ఉంది. నేరస్థులను ఏ కులం వారైనా సరే సమర్థించబోమని గట్టిగా చెప్పగలిగే నైతిక స్థైర్యం నాయకులకు ఉండాలి. భవిష్యత్తులో ప్రజలు ఈ తరహా కుల రాజకీయాలను తిరస్కరించి, నైతికత నిజాయితీతో కూడిన రాజకీయాలకు పట్టం గట్టే రోజు వస్తుందని ఆశించవచ్చు. రాజకీయ పార్టీలు తమ పద్ధతులను సంస్కరించుకోకపోతే, ప్రజల్లో వారి విశ్వసనీయత కోల్పోవడం ఖాయం.ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి. Andhra Pradesh, Political Analysis, Deputy cm Pawan Kalyan, YS Jagan Mohan Reddy, CM Chandrababu Naidu, Caste Politics, Sai krishna murder

Publish Date: Jul 17, 2026 5:48PM

political-news-img

లార్డ్స్ లో రోహిత్ రిటైర్మెంట్ ప్రకటన?

భారత క్రికెట్ జట్టు డాషింగ్ ఓపెనర్‌ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌కు లార్డ్స్ వేదికగా గుడ్ బై చెప్పనున్నాడా? త్వరలో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన 2027 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు సంబంధించి బీసీసీఐ ఇప్పటి నుంచే భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, అందులో రోహిత్ శర్మకు చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో రోహిత్ శర్మ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి, క్రికెట్ రంగానికి ఘనంగా గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్ధమవుతోందనే వార్తలు జోరందుకున్నాయి. క్రీడా వర్గాల సమాచారం మేరకు రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో ఆడే అవకాశం ఇసుమంతైనా లేదు. వయసు రీత్యానే కాకుండా ఫామ్ విషయంలో కూడా రోహిత్ ను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఇసుమంతైనా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లండన్ వేదికగా రోహిత్ శర్మకు ఒక ప్రత్యేకమైన, ప్రతిష్టాత్మకమైన వీడ్కోలు ఇచ్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా రోహిత్ శర్మ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్‌కు చేరుకున్నారు. ఒక క్రీడాకారుడి కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అనేది భావోద్వేగంతో కూడుకున్న విషయం కాబట్టి, ఆ భావోద్వేగ భరిత క్షణాలలో రోహిత్ కుటుంబం, తల్లిదండ్రులు లండన్ చేరుకున్నారని అంటున్నారు. క్రికెట్ మక్కాగా గుర్తింపు పొందిన లార్డ్స్ మైదానంలో మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని క్రీడా పండితులు అంటున్నారు. అయితే ఈ విషయంపై అటు బీసీసీఐ నుంచి కానీ, ఇటు రోహిత్ శర్మ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా ఇంత వరకూ రాలేదు. అది పక్కన పెడితే ఇండియన్ క్రికెట్ లో రోహిత్ శర్మ పలు చిరస్మరణీయమనదగ్గ రికార్డులు సృష్టించాడు. వన్డే క్రికెట్ లో మూడు డబుల్ సెంరీలు సాధించిన ఏకైక బ్యాటర్ గా రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సాధించారు. BCCI Rohit Sharma Decision, Lords Cricket Ground, 2027 ODI World Cup Team India

Publish Date: Jul 17, 2026 5:35PM

political-news-img

బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న *యువ సంగ్రామ సభ' కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 18న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. విచారణ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, కార్యక్రమం నిర్వహించేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వెంటనే అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించాయి. అన్ని అంశాలను పరిశీలించిన హైకోర్టు సభ నిర్వహణకు అనుమతి ఇస్తూనే పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సభ కారణంగా జాతీయ రహదారి లేదా ఇతర ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హైవేలను దిగ్బంధించరాదని స్పష్టం చేసింది. అలాగే సభ నిర్వహణ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కార్యక్రమాన్ని నిర్వహిం చాలని, సభ నిర్వాహకులు పోలీసులు సూచించే అన్ని నిబంధనలు, షరతులను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, జనస మ్మర్ద నియంత్రణ వంటి అంశాల్లో పోలీసులకు పూర్తిగా సహకరించాలని కూడా సూచించింది. హైకోర్టు అనుమతితో శనివారం (జూలై 18) సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ సభకు పార్టీ అగ్రనేతలు, యువ నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సభ నిర్వహణకు పోలీసులు కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టే అవకాశముంది. BRS Youth Sangram Sabha, Telangana High Court, Saroornagar Indoor Stadium, BRS Party, KCR, KTR, CM Revanth reddy

Publish Date: Jul 17, 2026 5:08PM

MOVIE NEWS