వాస్తుతో పాటు జగన్ ఈ పనులు కూడా చేయాలి...

ఐదేళ్ళపాటు చేయకూడని అరాచకాలు అన్నీ చేసిన జగన్, ఇప్పుడు అధికారం చేజారిపోతోందని అర్థం చేసుకుని ఆందోళన పడిపోతున్నారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అమల్లో పెట్టేశారు. ఇనుప కాంపౌండ్ వాల్‌కి సంబంధించిన రిపేర్లు చేశారు. గోడ ఎత్తు తగ్గించడం యుద్ధ ప్రాతిపదిక మీద జరిగిపోయింది. వాస్తు దోషాలను సరిచేశారు సరే... మరి మిగతా దోషాల సంగతేంటి? -- అద్బుతమైన రాజధానిగా రూపొందే అమరావతిని పాడుబెట్టేసి ఘోస్ట్ సిటీగా మార్చేశారు. మరి ఈ దోషానికి పరిహారం ఏమిటి? -- ఈ ఐదేళ్ళలో జగన్ అండ్ కో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచేసి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. మరి ఆ తప్పుకు దండన ఏమిటి? -- కల్తీ మద్య ప్రవాహంతో వేలాది ప్రాణాలు గాల్లో కలసిపోయేలా చేశారు.. ఆ నేరానికి శిక్ష ఏమిటి? -- హత్యారాజకీయాలు చేసి ఎంతోమంది టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీశారు.. ఆ ఘోరాలకు శిక్ష ఏమిటి? -- రాష్ట్ర విభజన తర్వాత ముందడుగులో వున్న రాష్ట్రాన్ని పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు.. ఆ నేరానికి శిక్ష ఏమిటి? -- పరిశ్రమలను తరిమేసి, ఉపాధి అవకాశాలను పాతాళంలోకి పడేసి లక్షలాది మంది యువకుల జీవితంలో ఐదేళ్ళ కాలాన్ని వృధా చేశారు. ఏం చేస్తే ఈ పొరపాటు సరిదిద్దడానికి వీలవుతుంది? -- ఈ ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఆశీస్సులతో జరిగిన నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, ఆర్థిక నేరాలు... వీటన్నిటి సంగతేమిటి? .... ఇవి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాల్లో కొన్ని... మరి ఇలాంటివన్నిటినీ మరచిపోయి, ఒక్క వాస్తు దోషం సరిచేస్తే అధికారం వచ్చేస్తుందని ఆశించడం అజ్ఞానం కాక మరేమవుతుంది?
Publish Date: May 6, 2024 6:22PM

తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదుః కేసీఆర్‌

గోదావరి న‌దీ జ‌లాల్ని తీసుకెళ్లి కర్నాటక, తమిళనాడుకు ఇస్తాన‌ని మోడీ చెబుతున్నా,   సి.ఎం. రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించ‌డం లేద‌ని మాజీ సి.ఎం. కేసీఆర్ ప్ర‌శ్నిస్తున్నారు. తాను సిఎంగా ఉన్నప్పుడే మోడీ గోదావరిపై ప్రతిపాదన పంపారట‌.  అయితే ముందు తెలంగాణ వాటా తేల్చండి. ఆ త‌రువాతే  మీటింగ్ కు వస్తానని మోడీకి తేల్చిచెప్పానని కేసీఆర్ చెబుతున్నారు. ఇంకా తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.  తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్‌.  ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్‌ బ్యాక్‌ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి.  గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ త‌న క్యాడ‌ర్‌కు హిత‌బోధ చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు.  తెలంగాణ ఉద్యమ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటల్ని కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో గుర్తు చేస్తున్నారు.  ఉద్యమ చివరి దశలో తాను ఢిల్లీ వెళ్తుండగా ఆంధ్రా పత్రికల వాళ్లు తనకు ఒక ప్రశ్న వేశారని, ఢిల్లీ వెళ్తున్న మీరు అక్కడ ఏం జరుగుతుందని... అడిగారని గుర్తు చేశారు. దానికి తాను ఒకటే మాట చెప్పానని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి నేను ఢిల్లీ వెళ్తున్నానని, తిరిగి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పానని, ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం, ఎంత నమ్మకం ఉండాలని అన్నారు. ఆ రోజు ప్రజల దీవెన, బలంతో అన్న ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెట్టినట్లు చెప్పారు.  పదేళ్లలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం.  కానీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో అంతా గాడి తప్పింది. రాష్ట్రం ఇంత తొందరగా ట్రాక్‌ ఎలా తప్పిందని, ఇప్పుడున్న పాలకులకు ఒక పద్ధతీ పాడు లేదని కేసీఆర్ విమర్శించారు.  తెలంగాణాను తిరిగి బాగు చేయాల్సిన బాధ్యత మనదేనని, మళ్లీ మనం వచ్చేవరకు దీటుగా పనిచేసి రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీని ముందుకు తీసుకొని పోవాలని, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలకు ప్రజలు మోసపోయారని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్రంలో రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ చెన్నైకి వెళ్లిపోయిందని స్పష్టం చేశారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని యోచిస్తున్నాయన్నారు. అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని చూస్తున్నాయని కెసిఆర్ చెబుతున్నారు.   కాంగ్రెస్ పాలనలో ప్రతి రంగం  విఫలం కావడంతో ప్రజల్లో మార్పు మొదలైందని, తద్వారా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్‌ ఎన్నిక‌లు కేసీఆర్‌కు  ఇజ్జ‌త్‌కే స‌వాల్‌గా మారాయా?  తెలంగాణ సాధ‌న‌ను 2014లో ఆయుధంగా మార్చుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన కేసీఆర్‌, 2018లో “ఆంధ్రోళ్ల పాల‌న మ‌న‌కు అవ‌స‌ర‌మా?!”-అంటూ.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొన్నారు.  ఇప్పుడేమో తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదంటున్నారు. మ‌రి తెలంగాణా ప్ర‌జ‌లు లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనైనా కేసీఆర్‌ను ప‌ట్టించుకుంటారా అనేది ఉత్కంఠ‌గా మారింది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: May 6, 2024 5:50PM

వృద్ధుల ఉసురు తగిలి తీరుతుంది

ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు.. కానీ ‘కర్మఫలం’ అనేది ఒకటి వుంటుంది. అది ఎంతటి వారైనా అనుభవించి తీరాల్సిందే. చేసిన కర్మనిబట్టి కర్మఫలం కూడా అంతే స్థాయిలో వుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి రెడీ అవుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. ఆ కర్మఫలంలో తన వాటా తాను తీసుకోవడానికి రెడీ కావల్సిన వ్యక్తి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. వృద్ధులకు పెన్షన్ ఇవ్వడంలో ఉదారంగా వ్యవహరించాలని, వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం కాకుండా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ఆలోచన వేరు. చంద్రబాబు పెన్షన్ ఆపే ప్రయత్నం చేశారని ప్రచారం చేయడం ప్లాన్ నంబర్ వన్. పెన్షన్ వృద్ధులకు వాళ్ళ ఇళ్ళ దగ్గర కాకుండా బ్యాంకులకు వెళ్ళి తీసుకునే పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమని ప్రచారం చేయడం నంబర్ టు. ఈ రెండు ప్లాన్స్ విజయవంతంగా అమలు చేయడానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తనవంతు సహకారం అందించారు. వృద్ధులకు ఇళ్ళకు వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం వున్నప్పటికీ అలా చేయలేదు. ఆ నిర్ణయం వల్ల, భయంకరమైన ఎండల కారణంగా ఇప్పటి వరకు 33 మంది వృద్ధులు మరణించారు.  తమ రాజకీయ ప్రయోజనాల కోసం పండుటాకుల్లాంటి వృద్ధుల జీవితాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. అవకాశం వున్నప్పటికీ, జగన్  అడుగులకు మడుగులు ఒత్తుతూ సీఎస్ జవహర్ రెడ్డి వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం దారుణం. వృద్ధుల విషయంలో వీరిద్దరూ చేసిన దానికి ‘కర్మఫలం’ అతి త్వరలో లభిస్తుంది. వీరిద్దరికీ వృద్ధుల ఉసురు తగిలి తీరుతుంది.
Publish Date: May 6, 2024 5:42PM

నెక్ట్స్ వికెట్ సీఎస్ జవహర్ రెడ్డేనా? ఈసీ వేటుకు వేళాయెనా?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్  వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్క‌రి పై బదిలీ వేటు వేస్తూ వ‌స్తున్న. ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6)  రాష్ట్ర డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న స్థానంలో ర‌వికుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా   నియ‌మించింది. రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై గ‌త కొంత‌కాలంగా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల నుంచి ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రాజేంద్ర‌నాథ్ రెడ్డి అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఎన్నిక‌ల్లో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాల‌ను సైతం  స‌మ‌ర్పించారు. దీంతో రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ర‌వికుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియ‌మించింది. రాజేంద్ర‌నాథ్  రెడ్డిపై బ‌దిలీ వేటు తో నెక్ట్స్ వికెట్ ఎవ‌రిద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ‌, అధికార వ‌ర్గాల్లో జోరందుకుంది.  ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పై ఈసీ బ‌దిలీ వేటు వేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.  ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి అధికార వైసీపీ కార్య‌క‌ర్త‌లా ప‌నిచేస్తున్నార‌ని, సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌నే ఇప్ప‌టికీ ఆయ‌న పాటిస్తున్నార‌న్న విమర్శలు కూటమి నేతల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఈసీకి కూడా పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా వాలంటీర్లు, పెన్ష‌న్ల పంపిణీ విష‌యంలో సీఎస్ వ్య‌వ‌హ‌రించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ప్ర‌తీనెలా ప్ర‌భుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్నది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌డంతో వారు ఎలాంటి విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. పెన్ష‌న్ దారుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా పెన్ష‌న్లు అందించాల‌ని సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కానీ, జ‌వ‌హ‌ర్ రెడ్డి ఈసీ ఆదేశాల‌ను పెడ‌చెవిన పెట్ట‌డంతో ఏప్రిల్ నెల పెన్ష‌న్లు తీసుకొనే స‌మ‌యంలో పెన్ష‌న్ దారులు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. ప‌లువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. దీంతో వైసీపీ నేత‌లు ఈ వ్య‌వ‌హారాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందు ప్ర‌య‌త్నాలు చేశారు. మే నెల పెన్ష‌న్ల పంపిణీ విష‌యంలోనూ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి  స‌మ‌ర్థ‌వంతంగా ఈసీ ఆదేశాల‌ను పాటించ‌క పోవ‌టంతో పెన్ష‌న్ దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   సీఎస్ తీరుపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెన్షనర్లు ఏమైపోయినా పరవాలేదు.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మేలు జ‌ర‌గాల‌ని సీఎస్ వ్య‌వ‌హ‌రించార‌ని టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశారు. పెన్ష‌న్ పంపిణీ విష‌యంలోనూ, వాలంటీర్ల విష‌యంలోనూ, ఇత‌ర అంశాల్లోనూ సీఎస్ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆధారాల‌తో స‌హా ఈసీకి విప‌క్ష నేత‌లు ఫిర్యాదు చేశారు. అయితే, విప‌క్షాల ఫిర్యాదుల‌పై ఈసీ విచార‌ణ చేయ‌గా సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మైన‌ట్లు తెలుస్తోంది. దీంతో నేడో, రేపో జ‌వ‌హ‌ర్ రెడ్డిపై ఈసీ బ‌దిలీ వేటు వేయ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ ఏపీ అధికార వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ఒక‌వేళ ఈసీ జ‌వ‌హ‌ర్ రెడ్డిపై వేటు వేయ‌కుంటే ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగే ప‌రిస్థితి ఉండ‌ద‌ని విప‌క్ష నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా ఉండగా ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహణపై పట్టుదలగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా పలు సందర్భాలలో  చెప్పారు. ఇప్పుడు ఎన్నికల సంఘం వరుసగా అధికారులపై బదిలీ వేటు వేయడాన్ని చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. తాజాగా సోమవారం అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయనను వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. అలాగే ఆయనకు ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించవద్దని సీఎస్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  
Publish Date: May 6, 2024 5:19PM

అనంతపురం రేంజ్ డిఐజిపై వేటు 

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.  ఎన్నికల నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో పలువురు అధికారులపై బదిలీ వేటు వేసింది. అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎస్ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కింది స్థాయి అధికారికి వెంటనే బాధ్యతలను అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆయనకు ఎన్నికలకు సంబంధించిన విధులను అప్పగించవద్దని ఆదేశించింది. ఈ రాత్రి 8 గంటల లోపు ముగ్గురు అధికారుల పేర్లతో ప్యానల్ పంపాలని ఆదేశాలు జారీ చేసింది.  డీఐజీ అమ్మిరెడ్డిపై పలు ఆరోపణలు ఉన్నాయి. అధికార వైసీపీకి ఆయన సహకరిస్తున్నారని విపక్ష కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా చూపారు. ఈ నేపథ్యంలో ఈసీ చర్యలు తీసుకుంది. ఇప్పటికే అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో అమిత్ బర్దర్ ను నియమించింది. మరోవైపు, అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవీ ప్రతాప్ కుమార్ ను, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.   
Publish Date: May 6, 2024 5:14PM

జగన్ ఆ ఇంటర్వ్యూ ఇవ్వకుండా వుండాల్సింది...

‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అనవసరంగా నోరు జారి తన పదవిని, పరువుని పోగొట్టుకుంటాడు. క్లైమాక్స్.లో రఘువరన్ బాల్చీ తన్నేస్తూ హీరోతో ‘‘అది చాలా గొప్ప ఇంటర్వ్యూ’’ అంటాడు. అంటే, ఒక్క ఇంటర్వ్యూ ముఖ్యమంత్రి అంత స్థాయి వున్న వ్యక్తిని పూర్తిగా పతనం అయ్యేలా చేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మొన్నీమధ్య నేషనల్ మీడియాకి.. ముఖ్యంగా టైమ్స్ నౌ ఎడిటర్ నవికా కుమార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా సేమ్ టు సేమ్ ‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఇంటర్వ్యూ  లాంటిదే. ఆ సినిమాలో ముఖ్యమంత్రి పదవి పోయింది.. ఈ రియాల్టీలో ముఖ్యమంత్రి పరువు పోయింది. జగన్ గెలవబోతున్నాడా.. ఓడుతున్నాడా అని అప్పటి వరకు జాతీయ స్థాయిలో గానీ, స్థానికంగా గానీ వున్న డోలాయమాన పరిస్థితికి ఆ ఇంటర్వ్యూ ఫుల్‌స్టాప్ పెట్టింది. నవికా కుమార్ అడిగిన ప్రశ్నలకు జగన్ ఇచ్చిన సమాధానాలు, హావభావాలు జగన్ ఓటమిని ఫిక్స్ చేశాయి. ఇక జగన్ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమన్న క్లారిటీ జాతీయ స్థాయిలో కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ ఆ ఇంటర్వ్యూ ఇవ్వకుండా వుండాల్సిందనే అభిప్రాయాలు వైసీపీలో వ్యక్తమవుతున్నాయి. గతజలసేతు బంధనం మాదిరిగా, జరిగిపోయిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ వర్గాలు తీరిగ్గా బాధపడుతున్నాయి. ఇకమీదట జగన్ ఏ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వకూడదని వైసీపీ వర్గాలు ఫిక్సయ్యాయి. అసలే ఓటమి భయం నిలువెల్లా ఆవరించి వున్న జగన్ ఢిల్లీ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తడబడిపోతున్న పరిస్థితి. జాతీయ రాజకీయాల మీద మీ వ్యూ ఏమిటని అడిగితే, నాకు జాతీయ రాజకీయాల గురించి అంతగా తెలియదు అని సమాధానం చెప్పడం... అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా అనడం చాలా మైనస్ అయింది. అందుకే, ఎందుకొచ్చిన గొడవ.. నేషనల్ మీడియాకి దూరంగా వుంటే సరిపోతుంది కదా అని వైసీపీ వర్గాలు ఫిక్సయ్యాయి. ఏపీలో మీడియాకి జగన్ అంతట జగనే చెప్పడం తప్ప, జర్నలిస్టులు అడిగిన దానికి సమాధానం చెప్పే అలవాటు జగన్‌కి లేదు. గత ఐదు సంవత్సరాలుగా ఇదే వ్యవహారం. మరి నేషనల్ మీడియా జర్నలిస్టులు అలా కాదు.. కోడి ఈకలు పీకినట్టు ప్రశ్నలు సంధిస్తారు. ఆ పీకుడుని తట్టుకునే పరిస్థితిలో జగన్ లేరు. మరీ ముఖ్యంగా... బాబాయ్ హత్య గురించి, చెల్లెమ్మ షర్మిల తిరుగుబాటు గురించి ప్రశ్నలు అడిగితే మాత్రం జగన్ తడబడిపోతున్నారు. ఆయా ప్రశ్నలకు ఏ సమాధానం చెబుతున్నారో జగన్‌కే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. అందువల్ల ప్రభుత్వం పోతే పోయింది.. ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చి జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకోవడం ఎందుకన్న అభిప్రాయంలో వైసీపీ వర్గాలు వున్నట్టు సమాచారం.
Publish Date: May 6, 2024 4:40PM