Top Stories

political-news-img

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం ఇచ్చే 5 హెచ్చరికలు.. ఇవి కనిపిస్తే వెంటనే జాగ్రత్త!

బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) అనేది అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం మాత్రమే కాకుండా శాశ్వత వైకల్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు: బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ ఎన్ని రకాలుగా ఉంటుంది? స్ట్రోక్ వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే హెచ్చరిక లక్షణాలు (TIA) ఏమిటి? చేతులు, కాళ్లు బలహీనపడటం, ముఖం వంకర కావడం, మాట తడబడటం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి? "గోల్డెన్ పీరియడ్" అంటే ఏమిటి? ఆ సమయంలో చికిత్స ఎందుకు చాలా కీలకం? ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి? స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడడమే కాకుండా మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ గురించి పూర్తి అవగాహన పొందాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ ను ఫాలో అవుతూ ఉండండి.

Publish Date: Jul 7, 2026 6:47PM

political-news-img

అయోధ్య రామ్ మందిరం విరాళాల అపహరణ.. నిజానిజాలేంటి?

అయోధ్య రాముడు దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల ఆరాధ్యదైవం. హిందూ ధర్మం, ఆధ్యాత్మికత, విశ్వాసానికి ప్రతీకగా అయోథ్య రామమందిరం మారింది. అయితే.. అటువంటి పవిత్ర క్షేత్రంలో భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన విరాళాల విషయంలో అపహరణ ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక నేరానికి సంబంధించిన ఘటన మాత్రమే కాదు, కోట్లాది మంది విశ్వాసంతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం. ఆలయ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, బాధ్యత, వ్యవస్థాగత క్రమశిక్షణపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తింది. రామశంకర్ యాదవ్ అలియాస్ తిన్ను పాత్ర.. అతని చుట్టూ అల్లుకున్న వివాదం, తదనంతర దర్యాప్తు పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రామ జన్మభూమి.. విరాళాల సేకరణ, వ్యవస్థాత్మక నిర్మాణం 2024 జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత నుంచీ, అయోధ్య రామమందిరానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా విరాళాలు సమర్పిస్తూ వస్తున్నారు. నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ రూపంలో వస్తున్న ఈ కానుకలను పర్యవేక్షించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీ రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తీసుకుంది. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని పారదర్శకంగా లెక్కించి, భద్రపరిచేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులతో కూడిన ఒక పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా 2025లో ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) రూపొందించింది. హుండీల నిర్వహణ, నగదు లెక్కింపు, సీసీటీవీల పర్యవేక్షణ వంటి అంశాల్లో కఠినమైన నిబంధనలు విధించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఈ నిబంధనల అమలులో జరిగిన నిర్లక్ష్యం ఇప్పుడు ఈ వివాదానికి మూలకారణమైంది. రాజకీయ ప్రకంపనలు.. ఆరోపణల నుంచి దర్యాప్తు వరకు ఈ వివాదం తెరపైకి రావడానికి ప్రధాన కారణం రాజకీయ ప్రకటనలే. సమాజవాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా, రామ్ మందిర విరాళాల్లో భారీ ఎత్తున నగదు అపహరణ జరిగిందని ఆరోపణలు చేయడంతో కలకలం మొదలైంది. ఆయన ఆరోపణలకు తోడు, అయోధ్య మాజీ ఎమ్మెల్యే తేజ్ నారాయణ పవన్ పాండే స్పందిస్తూ.. సుమారు 5 కోట్ల నుంచి ఏడున్నర కోట్ల రూపాయల వరకూ విరాళాలు దుర్వినియోగం అయ్యాయని పేర్కొనడంతో ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చింది. రాజకీయ స్థాయి నుంచి ఈ అంశం తీవ్రతను గ్రహించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, వెంటనే అప్రమత్తమైంది. జూన్ 13న ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ బృందంలో ఐజీ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్‌రతన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. అయోధ్యలో దాదాపు 40 మందికి పైగా సిబ్బందిని విచారించిన సిట్.. విరాళాల లెక్కింపు విధానాల్లో ఉన్న లోపాలను గుర్తించింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా, ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, జూన్ 25న కేసు నమోదైంది. దీనితో పాటు ఎనిమిది మంది వ్యక్తులను నిందితులుగా పేర్కొంటూ అరెస్టు ప్రక్రియ మొదలైంది. న్యాయపరమైన కోణం బీఎన్ఎస్ పరిధిలో కేసులు ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కఠినమైన సెక్షన్లను ఈ ఎనిమిది మందిపై నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఇలా ఉన్నాయి... సెక్షన్ 305.. దేవాలయాలు, మతపరమైన ప్రదేశాల్లో జరిగే దొంగతనాలకు సంబంధించి. సెక్షన్ 306.. ఉద్యోగి లేదా సేవకుడు చేసే దొంగతనాలకు సంబంధించిన నిబంధనలు. సెక్షన్ 316(5.. క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే నమ్మక ద్రోహం. సెక్షన్ 317(4), 317(5).. చోరీ ఆస్తిని కలిగి ఉండటం, దాచడం, లేదా విక్రయించేందుకు సహకరించడం. సెక్షన్ 61.. క్రిమినల్ కుట్రలో పాల్గొనడం. సెక్షన్ 3(5).. పలువురు కలిసి ఒకే నేరంలో భాగస్వామ్యం వహించినప్పుడు వర్తించే సెక్షన్. ఇవి కాకుండా అదనంగా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13(1)(a) కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఈ సెక్షన్లు ఈ కేసు కేవలం ఒక చిన్నపాటి చోరీ కాదని, పకడ్బందీగా జరిగిన కుట్ర అని తేలుస్తున్నాయి. అవినాష్ శుక్ల, అనుకల్ప మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ యాదవ్ (తిన్ను)లను పోలీసులు అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దర్యాప్తులో బయటపడిన వ్యవస్థాగత లోపాలు సిట్ దర్యాప్తులో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఎస్ఓపీల ఉల్లంఘన. విరాళాల లెక్కింపు, భద్రత విషయంలో నిర్దేశించిన ప్రమాణాలు కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనల ప్రకారం, సీసీటీవీ ఫుటేజీని 180 రోజుల పాటు భద్రపరచాల్సి ఉండగా.. కేవలం 45 రోజులకు మాత్రమే పరిమితం చేశారు. దీనివల్ల గతంలో జరిగిన అపహరణల ఆధారాలు కనుమరుగయ్యే అవకాశం ఏర్పడింది. ఈ కేసులో రామశంకర్ యాదవ్ అలియాస్ తిన్ను పాత్ర ప్రధానమైనదిగా కనిపిస్తోంది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కి సన్నిహితుడిగా, డ్రైవర్‌గా వ్యవహరిస్తున్న తిన్ను, విరాళాల హుండీల తాళాలను తన వద్ద ఉంచుకోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. బయటి ఏజెన్సీలకు లెక్కింపు బాధ్యతలు అప్పగించినప్పటికీ, తిన్ను, సుభాష్ శ్రీవాస్తవ వంటి వ్యక్తులు నేరుగా విరాళాల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనడం, హుండీల నుంచి నగదు తీసుకుంటున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అవ్వడం వ్యవస్థలో ఉన్న లొసుగులను బయటపెట్టాయి. ఆ సమయంలోనే ఎలాంటి నిఘా చర్యలు చేపట్టకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక వాస్తవాలు.. 50 కోట్లు వాదన వర్సెస్ వాస్తవ స్వాధీనం ఈ కేసు విచారణలో మరొక ఆసక్తికరమైన అంశం, అపహరణకు గురైన నగదు మొత్తం ఎంత అనేది. బహిరంగ చర్చల్లో, రాజకీయ ఆరోపణల్లో 50 కోట్ల రూపాయలు అనే సంఖ్య తరచుగా వినిపిస్తోంది. తిన్ను యాదవ్ భార్య పూనమ్ యాదవ్ కూడా మీడియా ముందు భావోద్వేగంగా స్పందిస్తూ, మాకు అంత నగదు ఉంటే మేము ఎందుకు ఇలా ఉంటాం? మాకు 50 కోట్లు ఉంటే 45 కోట్లు దేవుడికే ఇచ్చేసేవాళ్ళం అని వ్యాఖ్యానించారు. అయితే, అధికారిక దర్యాప్తులో ఈ సంఖ్యకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పోలీసుల నివేదిక ప్రకారం, నిందితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న నగదు రూ. 79.85 లక్షలుగా ఉంది. ఇందులో అవినాష్ శుక్ల వద్ద రూ. 20.40 లక్షలు, కరుణేశ్ పాండే వద్ద రూ. 18.07 లక్షలు, అనుకల్ప మిశ్రా వద్ద రూ. 16.82 లక్షలు, లవకుశ్ మిశ్రా వద్ద రూ. 14.25 లక్షలు, రామశంకర్ మిశ్రా వద్ద రూ. 7.32 లక్షలు, మనీష్ యాదవ్ వద్ద రూ. 2 లక్షలు, మరియు తిన్ను యాదవ్ వద్ద రూ. 1 లక్ష చొప్పున నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆరోపణలు ఉన్నట్లు రూ. 5 నుంచి ఏడున్నర కోట్ల రూపాయల అపహరణ జరిగిందా లేదా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. సామాజిక, రాజకీయ ప్రభావం.. నైతికతపై ప్రశ్నలు ఈ సంఘటన కేవలం నేరస్తుల అరెస్టుతో ముగిసిపోలేదు. ఇది ట్రస్ట్ సభ్యులపై కూడా నైతిక ఒత్తిడిని పెంచింది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా వంటి వారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేయడం, ఈ వ్యవహారం ఎంత తీవ్రమైనదో తెలియజేస్తుంది. ఆలయ నిర్వహణలో పారదర్శకత, బాధ్యతారాహిత్యం, మరియు బంధుప్రీతి అంటే నెపోటిజం వంటి అంశాలపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. హిందూ ధర్మ సంస్థలు, ముఖ్యంగా రామ్ మందిరం వంటి అత్యంత పవిత్రమైన ప్రాజెక్టులు, పూర్తి పారదర్శకతతో నడపాల్సిన అవసరం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నప్పటికీ, జరిగిన తప్పులను ఖండించాల్సిన అవసరం, దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ట్రస్ట్ మీద, ప్రభుత్వ యంత్రాంగంపైనా ఉంది. విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత రామ్ మందిర విరాళాల అపహరణ కేసు, భవిష్యత్తులో దేవాలయ నిర్వహణలో అనుసరించాల్సిన పద్ధతులకు ఒక పాఠం కావాలి. ఎస్ఓపీలు కేవలం ఫైళ్లలో ఉండటం సరిపోదు, అవి క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు జరగాలి. సీసీటీవీ పర్యవేక్షణ, కీలకమైన తాళాల బాధ్యత, విరాళాల లెక్కింపు ప్రక్రియలో నిబద్ధత కలిగిన అధికారులను నియమించడం వంటివి తక్షణ అవసరం. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన అరెస్టులు, స్వాధీనం చేసుకున్న నగదు, నమోదైన కేసులు కేవలం ప్రారంభం మాత్రమే. దర్యాప్తు పూర్తి స్థాయి నివేదిక అందాల్సి ఉంది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఉన్న అయోధ్య రామ మందిరంలో, విరాళాల నిర్వహణలో జరిగిన లోపాలను సరిదిద్ది, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే భక్తుల నమ్మకాన్ని తిరిగి పొందడం సాధ్యమవుతుంది. దేవాలయాలు పవిత్రతకు నిలయాలు, అక్కడ అవినీతికి, అక్రమాలకు చోటు ఉండకూడదు. ఈ ఘటన రామ్ మందిర ట్రస్ట్ నిర్వహణ వ్యవస్థను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చేందుకు ప్రేరణగా నిలవాలి. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. Tinnu Yadav Ayodhya, Ram Janmabhoomi trust controversy, Ayodhya SIT probe, Champat Rai resignation, Ram Mandir donation embezzlement

Publish Date: Jul 7, 2026 5:13PM

political-news-img

అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో కొత్త మలుపు..భారత్ వైపు మొగ్గు చూపిన ఇజ్రాయెల్.!

అంతర్జాతీయ రాజకీయ వేదికపై వ్యూహాత్మక భాగస్వామ్యాల పరిధి వేగంగా మారుతోంది. ప్రపంచంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మినహా మరే ఇతర బలమైన మిత్రదేశం లేదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా నాయకత్వానికి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఒక ప్రముఖ అంతర్జాతీయ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భారతదేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం కేవలం ఒక సాధారణ ప్రకటన ఎంత మాత్రం కాదు. ఇది గత మూడు దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య బలపడుతూ వస్తున్న వ్యూహాత్మక బంధానికి, దౌత్యపరమైన గుర్తింపుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సుమారు 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం నుండి తమకు అపారమైన మద్దతు లభిస్తోందని నెతన్యాహు పేర్కొనడం.. ప్రపంచ రాజకీయాల్లో భారతదేశ స్థానాన్ని ఇజ్రాయెల్ ఎంతగా గౌరవిస్తుందో తెలియజేస్తోంది. అమెరికా అంతర్గత రాజకీయాల ఒత్తిడిని అధిగమించేందుకు ఇజ్రాయెల్ తన సొంత విదేశాంగ విధానాన్ని ప్రదర్శించే క్రమంలో ఈ దౌత్య సంకేతాన్ని పంపింది. ఇరాన్ ఒప్పందం మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన విభేదాలు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ పట్ల నిజమైన సానుభూతి చూపిస్తున్న ఏకైక ప్రపంచ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమేననీ.. అమెరికాను మించిన శక్తివంతమైన మిత్రుడు ఇజ్రాయెల్‌కు లేడని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ మంత్రివర్గం తమ ఏకైక మిత్రదేశమైన అమెరికా విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఈ వివాదానికి ప్రధాన కారణం అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందమే. ఈ ఒప్పందం ప్రకారం హెర్ముజ్ జలసంధిపై ఉన్న నౌకాదళ ఆంక్షలను తొలగించడం, చమురు ఎగుమతులపై ఉన్న నియంత్రణలను సడలించడం, రాబోయే అరవై రోజుల్లో పూర్తి స్థాయి అణు ఒప్పందాన్ని ఖరారు చేయడం, సుమారు 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ నిధిని ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే.. ఇరాన్‌కు ఇలాంటి రాయితీలు ఇవ్వడం తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని ఇజ్రాయెల్ కేబినెట్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు స్పందిస్తూ, అమెరికాతో తమకు అత్యంత పటిష్టమైన బంధం ఉందని అంగీకరిస్తూనే.. ఇజ్రాయెల్‌కు భారతదేశం వంటి ఇతర సమర్థవంతమైన మిత్రదేశాల అండ కూడా ఉందని స్పష్టం చేశారు. తాను అధికారంలో ఉన్నంత కాలం ఇరాన్ అణు ఆయుధాలను సాధించకుండా అడ్డుకుంటానని విస్పష్టంగా చెప్పారు. మూడు దశాబ్దాల భారత-ఇజ్రాయెల్ దౌత్య పరిణామాల చరిత్ర భారతదేశం, ఇజ్రాయెల్ మధ్య అధికారికంగా పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు 1992లో ప్రారంభమైనప్పటికీ, వీటి వెనుక సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉంది. కోల్డ్ వార్ సమయంలో భారతదేశం పాలస్తీనా సమస్యకు మద్దతు ఇవ్వడం వల్ల ఇజ్రాయెల్‌తో బహిరంగంగా సంబంధాలు పెట్టుకోవడానికి వెనుకడుగు వేసింది. అయితే.. 1990లలో ఇండియా ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి బహుముఖ విదేశాంగ విధానాన్ని అవలంబించడం ప్రారంభించిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు వేగంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా రక్షణ, వ్యవసాయం, నీటి యాజమాన్యం, సాంకేతిక రంగాలలో పరస్పర సహకారం విస్తరించింది. అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో రక్షణ రంగ కొనుగోళ్లు, ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగస్వామ్యం మరింత బలపడింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలో ఈ బంధం ప్రచారానికి దూరంగా, అంతర్గతంగా అత్యంత పటిష్టంగా కొనసాగింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాయి. 2017లో ఇజ్రాయెల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. 2018లో నెతన్యాహు భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఇరుదేశాలు సంయుక్తంగా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. ఇటీవలి కాలంలో క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ సాంకేతికత, సైబర్ భద్రత , స్టార్టప్ ఇన్నోవేషన్స్ వంటి రంగాలలో ఈ భాగస్వామ్యం మరింత లోతుగా విస్తరించింది. వ్యూహాత్మక భాగస్వామ్యం.. విదేశాంగ విధాన స్వాతంత్య్రం అంతర్జాతీయ చట్టాల ప్రకారం అధికారిక మిత్రదేశం అనే పదానికి సైనిక కూటములు లేదా పరస్పర రక్షణ ఒప్పందాల వంటి చట్టపరమైన బాధ్యతలు ఉంటాయి. అమెరికా ఇజ్రాయెల్‌కు భారీగా సైనిక సాయం, ఆయుధ సరఫరా, ఐక్యరాజ్యసమితిలో రాజకీయ మద్దతు అందిస్తుండటం వల్ల అది ఒక ప్రధాన సైనిక కూటమిగా కొనసాగుతోంది. భారతదేశంతో ఇజ్రాయెల్‌కు ఎలాంటి అధికారిక సైనిక ఒప్పందాలు లేనప్పటికీ, ఇది ఒక ఉన్నత వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందింది. సంయుక్త పరిశోధనలు, సాంకేతిక బదిలీల ద్వారా ఈ బంధం బలోపేతమైంది. అమెరికా ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా నెతన్యాహు భారతదేశాన్ని ప్రస్తావించడం ద్వారా ఇజ్రాయెల్ తన విదేశాంగ విధాన స్వాతంత్య్రాన్ని చాటుకుంది. అమెరికా ప్రయోజనాల కోసం ట్రంప్ పనిచేస్తే.. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం తాను పనిచేస్తానని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య అత్యధిక శాతం అంశాలలో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, కొన్ని వ్యూహాత్మక విషయాలలో భేదాభిప్రాయాలు సహజమని ఆయన పేర్కొనడం అంతర్జాతీయ దౌత్యంలో స్వతంత్ర నిర్ణయాధికారానికి నిదర్శనం. సామాజిక మాధ్యమాలు, ప్రజాభిప్రాయం, అంతర్జాతీయ మీడియా విశ్లేషణలు జె.డి. వాన్స్ చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో ఇజ్రాయెల్‌పై తమకున్న ఆధిక్యతను ప్రదర్శించే ప్రయత్నంగా కనిపించాయి. దీనికి ప్రతిగా నెతన్యాహు అంతర్జాతీయ వేదికలపై తమకున్న తెరవెనుక దౌత్య సంబంధాలను, సాంకేతిక-రక్షణ రంగ భాగస్వామ్యాలను ఎత్తిచూపారు. ముఖ్యంగా భారతదేశంలోని సోషల్ మీడియా వినియోగదారుల నుండి తమకు వస్తున్న అపారమైన మద్దతును ఆయన ప్రస్తావించారు. తన ఫేస్‌బుక్ పేజీకి భారతీయుల నుండి వస్తున్న మద్దతు సందేశాలు ఒక గొప్ప ఆస్తిగా నెతన్యాహు అభివర్ణించారు. భారతదేశంలో ఇజ్రాయెల్ విధానాలపై భిన్నమైన ప్రజాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం బలమైన నాయకత్వం, జాతీయ భద్రత ప్రాతిపదికన ఇజ్రాయెల్‌ను సమర్థిస్తుంటే.. మరికొందరు పాలస్తీనా సంక్షోభం, గాజా యుద్ధం, మానవతా కోణాల్లో ఇజ్రాయెల్ చర్యలను విమర్శిస్తున్నారు. అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఉదంతాన్ని తమ దేశీయ ప్రయోజనాలకు అనుగుణంగా విశ్లేషిస్తోంది. ఇండియన్ మీడియా దేశ గ్లోబల్ ఇమేజ్‌ను హైలైట్ చేస్తుంటే, అమెరికా, యూదు మీడియా ఇరాన్ విధానాలపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న అంతర్గత విభేదాలపై దృష్టి కేంద్రీకరించింది. భారత విదేశాంగ విధానంపై ప్రభావం.. భావి సవాళ్లు నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా గుర్తించడాన్ని ప్రతిబింబిస్తున్నప్పటికీ, ఇది భారత విదేశాంగ శాఖకు ఒక సంక్లిష్టమైన సవాలును కూడా విసురుతోంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో భారతదేశం తన సాంప్రదాయ విదేశాంగ విధానమైన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే, ఇరుపక్షాల మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉంది. ప్రాంతీయ శాంతి భద్రతలు, ఇంధన భద్రత, అరబ్ దేశాలతో ఉన్న ఆర్థిక సంబంధాలు, విదేశాలలో ఉన్న భారతీయుల ప్రయోజనాలను రక్షించుకోవడం భారతదేశానికి అత్యంత కీలకం. ఇజ్రాయెల్‌తో రక్షణ బంధాన్ని కొనసాగిస్తూనే, పాలస్తీనా ప్రజల హక్కుల పట్ల తన నిబద్ధతను అంతర్జాతీయ వేదికలపై స్థిరంగా ఉంచడం భారతదేశం ముందున్న ప్రధాన విధి. భవిష్యత్తు పరిణామాలు అమెరికా అంతర్గత రాజకీయ సమీకరణాలు, ఇరాన్ అణు ఒప్పంద వ్యూహాలు, ఇజ్రాయెల్, భారత్ మధ్య ఉన్న బలమైన దౌత్య బంధం అన్నీ కలిసి అంతర్జాతీయ రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పాయి. జె.డి. వాన్స్ వ్యాఖ్యలకు బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన సమాధానం, గ్లోబల్ పవర్ పాలిటిక్స్‌లో భారతదేశం ఎంతటి కీలకమైన పాత్ర పోషిస్తోందో మరోసారి నిరూపించింది. రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియలో, ప్రపంచ దేశాల వ్యూహాత్మక కూటములలో ఈ పరిణామాలు ఎలాంటి మార్పులు తీసుకువస్తాయో వేచి చూడాలి. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. India Israel strategic relations, Benjamin Netanyahu JD Vance, US Iran MoU 2026, Modi Netanyahu friendship

Publish Date: Jul 7, 2026 4:22PM

political-news-img

సుప్రీంకోర్టులో డీఎంకేకు చుక్కెదురు.. సీఎం విజయ్ కరూర్ పర్యటనకు తొలగిన అడ్డంకులు.!

తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కరూర్ జిల్లాలో పర్యటించకుండా నిరోధించాలని కోరుతూ ప్రతిపక్ష డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలను తాము ఏ విధంగా నియంత్రించగలమని న్యాయస్థానం ప్రశ్నించింది. గతంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్ ప్రాంతంలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలనూ, అలాగే గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 10న కరూర్ సందర్శనకు సీఎం విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. బాధితులను కలిసి ప్రభుత్వ పరంగా ఉద్యోగ నియామక పత్రాలు, ఇతర ఆర్థిక సాయం అందించేందుకు సీఎం వెళ్తున్నారని, దీనివల్ల సీబీఐ దర్యాప్తు పారదర్శకత దెబ్బతింటుందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ.. బాధిత కుటుంబాలను పరామర్శించడం సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే కొట్టివేస్తామని స్పష్టం చేయడంతో.. డీఎంకే న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో కోర్టు ఆ వ్యాజ్యాన్ని ముగించింది. దీంతో ఈ నెల 10న సీఎం విజయ్ కరూర్ పర్యటనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. DMK Petition Dismissed, Tamil Nadu CM Joseph Vijay, Karur Stampede Case, Tamil Nadu Politics, TeluguOne

Publish Date: Jul 7, 2026 3:55PM

political-news-img

మొబైల్ వ్యసనం మీ బ్రెయిన్‌ను ఎలా దెబ్బతీస్తుంది? ప్రతి పేరెంట్ తప్పక చూడాల్సిన వీడియో

ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అవసరానికి మించి మొబైల్ వాడటం క్రమంగా వ్యసనంగా మారి మన ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వీడియోలో Dr. వేణుగోపాల్ మొబైల్ వ్యసనం వల్ల మెదడులో జరిగే మార్పులు, ఏకాగ్రత తగ్గిపోవడం, జ్ఞాపకశక్తిపై పడే ప్రభావం, నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటి అంశాలను చాలా సులభంగా వివరించారు. అలాగే మొబైల్‌కు బానిస కాకుండా ఉండేందుకు పాటించాల్సిన అలవాట్లు, స్క్రీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలి, పిల్లలు మరియు యువతలో మొబైల్ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందించారు. మొబైల్‌ను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. కానీ దానిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. మొబైల్ వ్యసనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

Publish Date: Jul 7, 2026 3:45PM

political-news-img

టీఆర్ఎస్ కోసం హస్తిన హైకోర్టుకు కల్వకుంట్ల కవిత.!

కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పేరు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. తన నూతన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పేరు ఖరారు చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరు ఖరారు విషయంలో పంపిన లేఖను సవాల్ చేస్తూ ఆమె న్యాయపోరాటానికి దిగారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా తమ పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం తనకు ఒక అధికారిక లేఖను పంపిందని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, పార్టీ పేరు ఆమోదం పొందేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామం చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. గతంలో కవిత తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)గా మార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చేలా.. తన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ పేరుపై, ముఖ్యంగా టీఆర్ఎస్ అనే సంక్షిప్త అక్షరాల వాడకంపై అభ్యంతరం తెలుపుతూ ఈసీకి పలు పిటిషన్లు వచ్చాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న.. లేదా ప్రజల్లో గుర్తింపు పొందిన ఇతర పార్టీల పేర్లను పోలి ఉండేలా కొత్త పేర్లు ఉంటే ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుంది. కనుక కవిత ప్రతిపాదించిన పేరు పాత టీఆర్ఎస్ పార్టీని పోలి ఉండటంతో, దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన కవిత చట్టప్రకారం తాము పెట్టుకున్న పేరు చెల్లుబాటు అవుతుందని వాదిస్తున్నారు. ఈ పేరు మార్పు లేదా అభ్యంతరాలపై ఎన్నికల సంఘం అడిగిన వివరాలకు కవిత ఇప్పటికే బదులిచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పిటిషన్‌పై రానున్న రోజుల్లో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. Telangana Rakshana Sena, TRS Party Name Row, Delhi High Court, Election Commission of India

Publish Date: Jul 7, 2026 3:33PM

MOVIE NEWS