కారు నేతల్లో చిన్న‌సారుకు సీన్ లేదా?!

రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద  ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు. రాజ‌కీయాల్లో ఈ విష‌యం సాధార‌ణంగా జ‌రిగేదే. ప్ర‌స్తుతం ఆ అనుభ‌వం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్ప‌ష్టంగా బోధప‌డుతోంది. కేటీఆర్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అపాయింట్ మెంట్ కోసం చాలా మంది నేత‌లు ఎదురు చూసేవారు. అవ‌కాశం దొరికితే కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు కూడా. ప‌రిస్థితులు తిర‌గబ‌డ‌టానికి ఎంతో కాలం ప‌ట్ట‌లేదు. గ‌తేడాది చివ‌రిలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌టంతో బీఆర్ఎస్ లోని ప‌లువురు కీల‌క నేత‌లు, ద్వితీయ స్థాయి నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. కేసీఆర్‌, కేటీఆర్ ల‌కు అత్యంత ద‌గ్గ‌ర వ్య‌క్తులు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ లో ఉన్న‌ నేత‌లు సైతం అవ‌కాశాన్నిబ‌ట్టి ఎప్పుడైనా గోడదూకేస్తారన్న సంకేతాలే కనబడుతున్నాయి. ఈ నెల‌లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు జూన్ 4న వెల్ల‌డి కానున్నాయి. ఈ ఫ‌లితాల్లో బీఆర్ఎస్ క‌నీసం 8 నుంచి తొమ్మిది స్థానాల్లో విజ‌యం సాధించ‌క‌పోతే ఆ పార్టీని వీడే నేత‌ల సంఖ్య భారీగానే ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా ఉన్న‌ప్ప‌టినుంచి ప్ర‌తిప‌క్ష పాత్ర  పోషించ‌లేదు. గ‌తంలో కేసీఆర్‌, హ‌రీశ్ రావులు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో పార్టీని ముందుండి న‌డిపించారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌రువాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే కేటీఆర్ పార్టీలో కీల‌క భూమిక పోషిస్తూ వ‌చ్చారు. మంత్రిగా ప్ర‌భుత్వ పాల‌న‌లో, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో పార్టీలో నెంబ‌ర్ 2గా కేటీఆర్ కొన‌సాగారు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కేటీఆర్ ను సీఎం స్థాయిలో చూస్తూ వ‌చ్చారు. పార్టీలోని ముఖ్య‌నేత‌లు సైతం ప‌ద‌వులకోసం కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు.  కేసీఆర్, కేటీఆర్ ఏం చెబితే అది పార్టీ నేత‌లు శాస‌నంగా భావిస్తూ వ‌చ్చారు. కానీ, ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారిపోయింది. అధికారం కాల్పోవ‌డంతో కేటీఆర్ హ‌వా కూడా పార్టీ నేత‌ల్లో క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నిర్వ‌హించిన అసెంబ్లీ స‌మావేశాల్లో పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో కేటీఆర్ రాణించ‌ లేక పోయారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ చేసిన‌ ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. అధికారంలోఉన్న స‌మ‌యంలో అసెంబ్లీ స‌మావేశాల్లో విప‌క్షాల‌పై విరుచుకుప‌డుతూ బెంబేలెత్తించిన కేటీఆర్‌.. ప్ర‌తిప‌క్ష హోదాలో పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ స‌భ్యుల దూకుడును ఎదుర్కోలేక పోయారు. దీంతో, హ‌రీశ్ రావు ఫ్రంట్ రోల్ లోకి వ‌చ్చి కాంగ్రెస్ స‌భ్యులకు దీటైన స‌మాధానం చెప్పారు.  బీఆర్ ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన త‌రువాత కేటీఆర్ హ‌వా పార్టీలో తగ్గుతూ వ‌స్తోందన్న విష‌యం తాజాగా మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.  ఖ‌మ్మం - వ‌రంగ‌ల్ - న‌ల్గొండ ఉమ్మ‌డి జిల్లాల నియోజ‌క‌వ‌ర్గ  గ్రాడ్యుయేష‌న్ ఎమ్మెల్సీ ఎన్నికకు  ఈనెల 27న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. జూన్ 5న ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి,  బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.  బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా రాకేశ్ రెడ్డి ఎంపిక‌పై మూడు ఉమ్మ‌డి జిల్లాల్లోని బీఆర్ఎస్ కీల‌క‌ నేత‌లు అసంతృప్తిగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండానే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మ‌నిషి అయిన రాకేశ్ రెడ్డికి ఏక‌ప‌క్ష నిర్ణ‌యంతో కేసీఆర్, కేటీఆర్ టికెట్ ఇచ్చార‌ని స‌ద‌రు నేత‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారం నిజ‌మేన‌ని  రెండు రోజుల క్రితం స్ప‌ష్ట‌మైంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాకేశ్ రెడ్డి విజ‌యానికి అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై స‌మీక్ష నిర్వ‌హించేందుకు రావాల‌ని మూడు ఉమ్మ‌డి జిల్లాల పార్టీ ముఖ్య‌ నేత‌ల‌కు  కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ  ఆ స‌మావేశానికి ప‌లువురు నేత‌లు గైర్హాజరయ్యారు. కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. దీంతో పార్టీలో ఈ విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేటీఆర్ పిలిచినా నేత‌లు స‌మావేశంకు హాజ‌రుకాక‌పోవ‌టం  పార్టీలో కేటీఆర్ హ‌వా త‌గ్గిపోయింద‌నడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆపార్టీ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. కేంద్రంలో మ‌రోసారి బీజేపీ అధికారంలోకి వ‌స్తే  బీఆర్ఎస్ లోని ముఖ్య‌నేత‌లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి క్యూక‌ట్ట‌డం ఖాయ‌ంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌లు మీడియా స‌మావేశాల్లో లోక్ స‌భ ఫ‌లితాల త‌రువాత బీఆర్ ఎస్ నుంచి పెద్ద సంఖ్య‌లో కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయని చెప్పారు. అదే జ‌రిగితే రానున్న కాలంలో బీఆర్ ఎస్ పార్టీకి మ‌రింత గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌వ‌డం ఖాయం. అలాంటి ప‌రిస్థితుల‌ను కేటీఆర్ స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటారని కానీ, ఎదుర్కోగలుగుతారని కానీ  పార్టీ శ్రేణులు బావించ‌డం లేదు. కేసీఆర్‌, హ‌రీశ్ రావులు యాక్టివ్ పాత్ర పోషిస్తేనే పార్టీ మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుంద‌నీ, కేటీఆర్ చేతిలోకి పార్టీ ప‌గ్గాలు వెడితే పార్టీ మనుగడే ప్రశ్నార్ధకమౌతుందనీ బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. 
Publish Date: May 19, 2024 10:41AM

చంద్రబాబు పని మొదలెట్టేశారు!

ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు. రాష్ట్రంలో పల్నాడు ప్రాంతం సహా కొన్ని ప్రాంతాలు ఎన్నికల అనంతరం కూడా హింసాకాండతో అట్టుడుకుతుంటే, తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఉంటే వాటి గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోర్టు అనుమతి తీసుకుని మరీ విదేశాలకు చెక్కేశారు. అలా చెక్కేసే ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తాను చేయకూడని పని కూడా చేశారు. అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిందిగా సీఎస్ ను ఆదేశించేశారు. సీఎస్ పరమ వీర విధేయత ప్రదర్శించి ఆ పని చేయడానికి రెడీ అయిపోయారు. ఆ ఆదేశాల అమలు కోసం డీబీటీ నిధులను మళ్లించేయడానికీ సిద్ధమైపోయారు.  అయితే ఆపద్ధర్మ  ముఖ్యమంత్రిగా జగన్ తన బాధ్యతను విస్మరించారు. కానీ విపక్ష నేత అయిన చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో నెలకొన్నఉద్రిక్త పరిస్థితులు, పల్నాడులో దాడులపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ  రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. చంద్రబాబు డిమాండ్ మేరకు  ఈసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు వారాలపాటు కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులను  కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ  చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖతో  అదే విధంగా  ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌  కూడా చంద్రబాబు ఫిర్యాదుతోనే ఆగింది. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవోలను మాయం చేసేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీప డరనడానికి వీటిని ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు.    ఇక  అమిత్ షా చెప్పిన జోస్యం నిజమై చంద్రబాబు జూన్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన తాను చేస్తానన్న తొలి సంతకం, రెండో సంతకం విషయాలను పక్కన పెడితే.. గత ఐదేళ్ల పాలనలో అస్తవ్యవస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి మహాయజ్ణం లాంటిదే చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడు రాష్ట్రం పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి అంతకంటే అధ్వానంగా ఉంది.  నాడు రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం జీరో నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఐదేళ్ల జగన్ పాలన తరువాత జీరోకన్నా దిగువ నుంచి అంటే మైనస్ నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ప్రభుత్వ ఖజానా ఖాళీ, రాష్ట్రానికి రాజధాని లేదు. ఇప్పుడూ అదే పరిస్థితి.  అప్పట్లో ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిన పెట్టారు. రెవెన్యూలోటుతో  ఆరంభమైన విభజిత రాష్ట్రాన్ని తన విజనరీతో సర్ ప్లస్ స్టేట్ గా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్టేట్ గా మార్చారు చంద్రబాబు. అంతేనా ఐదేళ్లలో ఒక్క సారి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశారు. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలు కావడంతో రాష్ట్ర ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. జగన్ హయంలో అమరావతి నిర్వీర్యమైంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు.  ఇప్పుడు రాష్ట్రం కరెంటు కొరతతో దాదాపు అంధకారబంధురంగా మారింది. ఎప్పుడు వస్తుందో తెలియని విద్యుత్ సరఫరా చేస్తూ జగన్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచింది.  పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం కుదేలయ్యాయి. నిర్మాణ రంగం పడకేసింది. విద్యా వ్యవస్థ కుప్పకూలింది.   అమిత్ షా జోస్యం నిజమై చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9న ప్రమాణస్వీకారం చేపడితే ఆయన ముందున్న సమస్యలివి. మళ్లీ తొలి అడుగు నుంచీ రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. జన సంక్షేమ శ్రామికుడిగా, సంపద సృష్టికర్తగా చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆశతోనే, ఆ నమ్మకంతోనే జనం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారని భావించాల్సి ఉంటుంది. 
Publish Date: May 18, 2024 5:47PM

బుజ్జగింపులు.. బెదిరింపులు.. ఇదీ మోడీ స్టైల్!

వయసు దగ్గర దగ్గర 75 సంవత్సరాలకు చేరువ అవుతోంది. అంతేకాకుండా ప్రధానమంత్రి హోదాలో కూడా వున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని మిగతా రాజకీయ నాయకులను విమర్శించినట్టు ఘాటుగా విమర్శించాలంటే కొంత ఇబ్బందిగానే వుంటుంది. అందుకే పెద్దమనిషి వయసుకి, హోదాకి గౌరవం ఇస్తూ చాలా వినయంగా అసలు విషయాన్ని తెలియజేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికలలో 4 వందల పార్లమెంటు స్థానాలు గెలిచి ప్రధానమంత్రి పీఠం మీద మూడోసారి కూర్చోవాలని ఆశిస్తున్నారు. ఆయన అలా ఆశించడంలో తప్పులేదు.. జనం ఆశీస్సులతో అనుకున్నట్టు జరిగినా బాధ లేదు. కానీ, ఆయన ఎన్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి.  నరేంద్ర మోడీ నాయకత్వంలో వున్న బీజేపీ నాయకులు ముస్లింల విషయంలో ఎలా వ్యవహరిస్తారో మళ్ళీ ఇక్కడ ఉదహరించాల్సిన అవసరం లేదు. ముస్లిం ఓట్లు బీజేపీకి ఎంతమాత్రం పడవన్న విషయం కూడా ఎవరూ విస్మరించలేనిది. కొన్ని రాష్ట్రాల్లో పేద ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. దాని విషయంలో మోడీ గారి సహచరుడు అమిత్ షా తన పార్టీ వైఖరిని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఈసారి అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని చెబుతున్నారు. సరే, అధికారం మళ్ళీ వస్తే వీళ్ళకు ఎలా చేయాలని అనిపిస్తే అలా చేస్తారు. దేశం ఆ నిర్ణయాన్ని ఇష్టం లేకపోయినా భరించక తప్పదు. ముస్లింల విషయంలో అలా వ్యవహరిస్తూనే ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం నాడు మోడీ గారు అద్భుతమైన కొన్ని మాటలు జనం మీదకి వదిలారు. ‘‘హిందు, ముస్లిం అని నేను విడదీయను. చిన్నప్పుడు ఈద్ కూడా జరుపుకునేవాడిని. పక్కింటి ముస్లింలు మాకు ఆహారం పెట్టేవారు’’ అని ప్రేమతో కూడిన మాటలు చెబుతున్నారు. గోధ్రా దుర్ఘటన సందర్భంగా గానీ, కేంద్రంలో అధికారంలోకి రావడానికి గానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గానీ, ఆయన పార్టీ వారుగానీ ముస్లింల విషయంలో చేసిన వ్యాఖ్యానాలు వారికి గుర్తుండక పోవచ్చుగానీ ముస్లింలు మరచిపోరు కదా. సరే, ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం చేస్తూ మోడీ గారు ఒక దారుణమైన మాట అన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరాన్ని వాళ్ళు కూల్చేస్తారట. ఇంతకంటే దారుణమైన స్టేట్‌మెంట్ మరొకటి వుంటుందా? ఇది మతం పేరుతో రాజకీయాలు చేయడం కాదా? ‘మోడీ’ అనే పేరును తిట్టినందుకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్నే రద్దు చేయించారు. మరి మతం పేరుతో రాజకీయ విమర్శలు చేసినందుకు ఏం చేయాలి? 
Publish Date: May 18, 2024 5:42PM

పల్నాడు కలెక్టర్ గా శ్రీ బాలాజీ లట్కర్ 

పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో, పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్ ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాకు శ్రీకేశ్ బాలాజీ లట్కర్ ను కలెక్టర్ గా నియమిస్తున్నట్టు పేర్కొంది. ఈసీ ఈ సాయంత్రం లోగా తిరుపతి, పల్నాడు, అనంతరం జిల్లాలకు కొత్త ఎస్పీలను కూడా ప్రకటించనుంది. సీఎస్ పంపిన పేర్లను పరిశీలిస్తున్న ఈసీ కాసేపట్లో ఉత్తర్వులు వెలువరించనుంది.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం పల్నాడులో జరిగిన హింసపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎస్‌, డీజీపీలకు కమీషన్‌ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు భవిష్యత్తులో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీలందరినీ ఆదేశించింది. ఈ క్రమంలోనే కమిషన్ వారి స్థాయిలో కేసులను సమీక్షించింది. చట్ట ప్రకారం, మోడల్ ప్రవర్తనా నియమావళి వ్యవధిలో, దోషులపై ఛార్జిషీట్‌ను సకాలంలో దాఖలు చేయడంపై తగిన నిర్ణయం తీసుకునేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతోపాటు ఆ ఘటనల నేపథ్యంలో ఇటివల పల్నాడు జిల్లా కలెక్టర్ సహా పలువురిపై చర్యలు తీసుకుంది.
Publish Date: May 18, 2024 4:35PM

జూన్ 9న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం.. అమిత్ షా

సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది. కూటమి 145 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధిస్తుంది. అలాగే 23 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగుర వేస్తుంది. ఈ మేరకు ఆయన శనివారం చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. వచ్చే నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితరిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారంటూ ఆయన పేర్కొన్నారు. పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం విజయం ఖాయమని పరిశీలకుల విశ్లేషణలూ,  షెడ్యూల్ విడుదలకు ముందు వెలువడిన దాదాపు డజనుకు పైగా సర్వేలూ ఇదే విషయాన్ని చెప్పినా.. అమిత్ షా ఇప్పుడు స్వయంగా ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించబోతున్నదంటూ చేసిన ప్రకటన ఎక్కడో ఏ మూలో మిణుక్కుమిణుక్కు మంటూ ఉన్న వైసీపీ గెలుపు ఆశలను ఆవిరి చేసేసిందనే చెప్పాలి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికలలో అక్రమాలు జరిగాయనీ, ఎన్నికల సంఘం తెలుగుదేశం ఆదేశాల మేరకు పని చేసిందన్న ప్రకటనల ద్వారా పరోక్షంగానైనా వైసీపీ పరాజయాన్ని అంగీకరించేశారు. ఇప్పుడిక ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో తెలుగుదేశం కూటమి విజయంపై ఎవరికీ ఎటువంటి అనుమానాలూ మిగలలేదని చెప్పవచ్చు. కేంద్రానికి అందునా కేంద్ర హోంమంత్రికి ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రంలో రాజకీయ గాలి ఎటువైపు ఉంది, ఆయా రాష్ట్రాలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా అందుతూ ఉంటుంది. అందుకే  అమిత్ షా ప్రకటనతో ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టడం ఖాయమన్న భావన అందరిలోనూ వ్యక్తం అవుతోంది. 
Publish Date: May 18, 2024 4:29PM