మార్పు కనిపించేస్తోందిగా? వైసీపీకి సీన్ అర్ధం అయిపోయిందా?

ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారుతోందన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఇంత కాలం వైసీపీ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు ఇప్పుడు తటస్థంగా ఉంటున్నారు. అంతే కాదు ఎన్నికల సంఘం పలువురు పోలీసు అధికారులపై వేటు వేసింది. అలా వేటు పడిన స్థానంలో వచ్చిన వారు.. మరింత మందిని కీలక విధులకు దూరం చేశారు. మరింత మందిపై నిఘా పెట్టారు. ఈ మార్పు ఒక్క సారిగా పోలీసు వ్యవస్థలో కింది నుంచి పై దాకా ఉలిక్కిపడేలా చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో, ఒక పార్టీతో అంటకాగితే జరిగే పరిణామాలేమిటో తేటతెల్లం చేసింది. దీంతో ఏపీ పోలీసుల తీరు ఒక్కసారిగా మారిపోయింది. గత ఐదేళ్లూ ఒక తీరు.. గత కొద్ది రోజులుగా మారో తీరుగా మారిపోయింది.   వైసీపీ హయాంలో అంటే గత ఐదేళ్లుగా పోలీసు అధికారులకు పదోన్నతులు, కీలక పోస్టింగులకు వారిపై ఉన్న అభియోగాలూ, అధికార పార్టీకి అనుకూలంగా పని చేయడానికి సై అనడమే అర్హతలుగా మారాయి. ఇప్పుడు అలా కీలక  పోస్టింగులలో వచ్చి తిష్ట వేసిన వారికి ఇప్పుడు స్థాన చలనం కలిగింది.  ఇక మిగిలిన వారిలో భయం మొదలైంది. దీంతో మొత్తం పరిస్థితి వైసీపీకి రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని చెప్పడానికి  వైసీపీ పెద్దల మాటలను కింది స్థాయి పోలీసులే ఖాతరు చేయకపోవడాన్ని ఉదాహరణగా పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ బాధితులపైనే కేసుల నమోదుకు పరిమితమైన పోలీసులు ఇప్పుడు వైసీపీ కేడర్, నాయకులపై కూడా యాక్షన్ తీసుకోవడానికి, కేసులు నమోదు చేయడానికి వెనుకాడటం లేదు.   రాష్ట్రంలో మారిన  ఈ పరిస్థితే జూన్ 4న ఫలితం ఎలా ఉండబోతోందో చెబుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ప్రజల నాడి ఎలా ఉందో, ప్రజల మొగ్గు ఎటువైపు ఉందో అందరి కంటే నిక్కచ్చిగా, కచ్చితంగా అంచనా వేయగలిగేది క్షేత్ర స్థాయిలో పోలింగ్ విధులు నిర్వహించిన పోలీసులే అని అంటున్నారు. 
Publish Date: May 27, 2024 10:42AM

నైట్ షిఫ్టులో పనిచేసేవారు ఆరోగ్యంగా, యాక్టీవ్ గా ఉండాలంటే ఇలా చేయండి.!

నేటి వేగవంతమైన ప్రపంచంలో ఉద్యోగ జీవితాలు కూడా అంతే వేగంగా ఉంటాయి. పోటీ దృష్ట్యా ప్రతి సంస్థ 24 గంటలు తమ కార్యకలాపాలు కొనసాగించాలని అనుకుంటుంది. ఈ కారణంగానే సాధారణ పనివేళలు మాత్రమే కాకుండా నైట్ షిఫ్టులు కూడా కొనసాగిస్తుంది.  వేతనం గురించో ఇతర కారణాల వల్లనో చాలామంది నైట్ షిప్టులో పనిచేస్తుంటారు.  అయితే సాధారణ పని వేళల్లో పనిచేసేవారి కంటే నైట్ షిప్టులో పనిచేసేవారిలో చురుకుదనం తక్కువగా ఉంటుంది. అంతేనా సాధారణంగా నిద్రపోవాల్సిన సమయంలో ఉద్యోగాలు చెయ్యడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నైట్ షిఫ్టు డ్యూటీ చేసేవారు  ఆరోగ్యంగా, యాక్టీవ్ గా ఉండటానికి  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. నిద్ర.. నైట్ షిఫ్టు లో పనిచేసేవారు నిద్ర షెడ్యూల్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. నిద్రా చక్రమైన సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి. సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగితే  నిద్ర ఆటంకాలు, అలసట కలుగుతాయి.  ఈ సిర్కాడియన్ రిథమ్ గడియారాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి సెలవు దినాలలో కూడా ఒకే సమయానికి పడుకోవాలి. ఆహారపు అలవాట్లు.. నైట్ షిఫ్టుల సమయంలో చాలామంది ఎనర్జీగా ఉండటం కోసం ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ తినడం మీద ఆసక్తి చూపిస్తారు. పైపెచ్చు సాధారణ భోజన సమయాలు కాకపోవడం వల్ల రాత్రి పూట ఆకలేసినప్పుడు ఇలాంటి ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. నైట్ షిఫ్ట్ అంతా చిన్న చిన్న మొత్తాలలో ఆహారం తీసుకోవాలి. నీరు బాగా త్రాగాలి. వ్యాయామం.. నైట్ షిప్టులలో పనిచేసేవారు ఉదయం సమయాల్లో పడుకుంటూ ఉంటారు. దీని వల్ల చాలామంది ఉదయం వేళ చెయ్యాల్సిన వ్యాయామాన్ని స్కిప్ చేస్తుంటారు. లేదా పగటి సమయాన్ని లేజీగా గడిపేస్తూ  ఉంటారు. కానీ వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. జాకింగ్, వాకింగ్, యోగా, సైక్లింగ్ వంటివి మంచి ఎంపిక. ఒత్తిడి.. పనిచేసే సమయవేళలు మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఇది ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి రాకుండా చూడటం కోసం  లోతైన శ్వాస, శ్వాస వ్యాయామాలు,  ధ్యానం,  తీరిక సమయాలలో స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటివి చేయాలి.  ఒకవేళ ఒత్తిడి సమస్య ఉంటే మానసిక నిపుణులను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవాలి. ప్లానింగ్.. నైట్ షిఫ్టులలో పనిచేసేవారు తమ పనిని చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. పని చేసేటప్పుడు అలసిపోకుండా పనిని ఏకధాటిగా కాకుండా చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని ఫినిష్ చేయాలి. ఇది పక్కాగా అమలుకావడం కోసం కోలీగ్స్,  అధికారులతో సంప్రదించి వారి మద్దతు తీసుకోవాలి.                                     *నిశ్శబ్ద.  
Publish Date: May 27, 2024 10:41AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో  తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. గత వారంతో పోలిస్తే సోమవారం భక్తుల తాకిడి ఒకింత తగ్గినప్పటికీ రద్దీ కొనసాగుతోంది. సోమవారం (మే27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం ( మే 26) శ్రీవారిని మొత్తం 89 వేల 161 మంది దర్శించుకున్నారు.  వారిలో 36వేల450 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 77లక్షల రూపాయలు వచ్చింది. 
Publish Date: May 27, 2024 10:28AM

స్వోత్కర్ష.. పరనింద.. పేర్నినానికి ఇదే పనా?

పేర్ని నాని.. వైసీపీలో అందరూ మాటలు ఆపేసిన వేళ పేర్ని నాని మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ  సొంత నియోజకవర్గ ప్రజలకు మాంఛి వినోదం అందిస్తున్నారు. ఓటమి భయం కప్పిపుచ్చుకోవడానికి మాటలను కోటలు దాటిస్తున్నారు. బందరులో తన కుమారుడు విజయం సాధిస్తారో లేదో చెప్పడానికి ఆయన దగ్గర సరైన గణాంకాలు లేవు కానీ మాచర్లలో మాత్రం పిన్నెల్లి విజయం ఖాయమని ఢంకా బజాయిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి కంచుకోట అని చెబుతూ అందుకు ఉదాహరణలు చెబుతున్నారు. ఒక వైపు పిన్నెల్లి సోదరుల దౌర్జన్యం, దుర్మార్గాలను ప్రపంచం అంతా వీక్షిస్తున్న సమయంలో పేర్ని నాని పిన్నెల్లికి వత్తాసు పలుకుతూ, అసలు సినిమా జూన్ 4 తరువాత చూస్తారని బెదరిస్తున్నారు.  ఇప్పుడు కాదు.. 2019లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే వైసీపీలో మేధో శూన్యత ఉందనీ, స్వోత్కర్ష, పర నిందే ఆ పార్టీ సిద్ధాంతమనీ అందరికీ అర్ధమైపోయింది. నిస్సిగ్గుగా తమ తప్పులను సమర్ధించుకోవడమే కాకుండా.. తమ వైఫల్యాలను కూడా విపక్షంపై నెట్టివేసి చప్పట్లు కొట్టే విద్యలో  వైసీపీ ఆరితేరిపోయింది. ఇప్పుడు అదే ఆరితేరిన విద్యను కొత్తగా పేర్ని నాని మరోసారి మొదలెట్టేశారు.  ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నేల్లినే బాధితుడిగా అభివర్ణించడానికి పేర్ని నాని ఎక్కడా సంకోచించడం లేదు. మీడియా ముందుకు వచ్చి పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం కుట్రపన్నిందంటూ ఆరోపణలు గుప్పించారు. ఆ కుట్రకు ఎన్నికల సంఘంన, పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ గగ్గోలు పెట్టేశారు.   ఇంత కాలం ఎవరి అండ చూసుకునైతే వైసీపీ నేతలూ, మూకలూ రెచ్చిపోయాయో అదే పోలీసులు పాపం వైసీపీ నేతలకు వ్యతిరేకంగా మారిపోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఓటమికి సాకులు వెతుక్కునే వారే ఇటువంటి బేల మాటలు మాట్లాడతారు. ఇంత బేలగా, ఇంత దిగజారి ఆరోపణలు గుప్పిస్తున్న పేర్ని నాని అదే నోటితో పిన్నెల్లి విజయం ఖాయమంటూ జోస్యం చెబుతున్నారు. విజయం ఖాయం అయితే ఈవీఎం ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, దాడులకు, దౌర్జన్యాలకు దిగి, ఓటర్లను ఎందుకు భయభ్రాంతులకు గురి చేయాల్సి వచ్చింది అన్న దానికి మాత్రం పేర్ని సమాధానం చెప్పరు. అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమిటి? మేం చెబుతాం మీరు వినండి అన్నట్లుగా సాగింది పేర్ని ధోరణి.   ఇంతకీ పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం కుట్ర అంటూ ఆరోపణలు చేసిన పేర్ని మాటల సారాంశం.. జూన్ 4 వరకూ ఎదురు చూడటం ఎందుకు.. మేం ఓడిపోయాం.. మా ప్రాణాలకు భద్రత కల్పిస్తే చాలు అని వేడుకోవడంలాగే  ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వాస్తవానికి  ముందస్తు బెయిల్ తెచ్చుకున్న పిన్నెల్లి కోర్టు షరతులను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నరసరావు పేటలోనే ఉండాలి. కానీ ఆయన నరసరావు పేటలో ఉండటం లేదు. కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి అజ్ణాతంలోనే ఉన్నారు.  ఈ విషయాన్ని దాచిపెట్టి ఎదురు ఆయన హత్యకు తెలుగుదేశం కుట్ర పన్నిందనీ, ఆ కుట్రకు పోలీసులు సహకరిస్తున్నారనీ ఆరోపణలు మొదలెట్టేసింది. అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా వైసీపీ తీరు ఉందన్న మాట. పేర్ని నాని ఎంతగా గొంతు చించుకున్నా పిన్నెల్లి విధ్వంస, దౌర్జన్య కాండ గురించి తెలిసిన ఏ ఒక్కరూ పిన్నెల్లిని కానీ, ఆయనకు వత్తాసుగా గొంతుచించుకు గగ్గోలు పెడుతున్న పేర్ని నానిని కానీ ఇసుమంతైనా నమ్మడం లేదు. అజ్ణాతంలో ఉన్న పిన్నెల్లి కౌంటింగ్ రోజున మరింత విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఆదివారం పల్నాడులో జరిగిన దాడే నిదర్శనంగా నిలుస్తుంది. 
Publish Date: May 27, 2024 9:58AM

గ్లాసు అలోవెరా జ్యూస్...ఈ మొండి వ్యాధులను నయం చేస్తుంది..!

కలబంద.. చర్మం, జుట్టు, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.దీనిని రోజూ తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. కలబందలో ఉండే విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని, జీవక్రియను మెరుగుపరుస్తుంది.మలబద్ధకం, రక్తహీనత వంటి తీవ్రమైన వ్యాధులకు చెక్ పెడుతుంది. అనేక తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో అలోవెరాను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ సీజన్‌లో కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. చల్లటి వాతావరణంలో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. ఏయే వ్యాధులను దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం నుండి ఉపశమనం: ఆంత్రాక్వినోన్ అనే సమ్మేళనం కలబందలో ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కాకుండా, కలబంద వినియోగం కడుపు తిమ్మిరిని నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో, మీరు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి  అలోవెరా జ్యూస్ తాగవచ్చు. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది: ఈ సీజన్‌లో, చాలా మందిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా, అటువంటి వ్యక్తులు అనేక సీజనల్ వ్యాధులకు గురవుతారు. అందువల్ల, ఈ సీజన్‌లో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, మీరు కలబంద జ్యూస్ తాగాలి. శరీరం నిర్విషీకరణ : అలోవెరా జ్యూస్ శరీరంలోని టాక్సిక్ ఎలిమెంట్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. వాస్తవానికి, శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను ఆహ్వానించే అనేక విష పదార్థాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, కలబంద రసం తీసుకోవడం ఈ తొలగింపు ప్రక్రియలో సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగుతే ఆరోగ్యంతోపాటు అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. రక్తహీనత సమస్యకు చెక్: నేటికాలంలో చాలా మంది రక్తహీనతకు లోనవుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఒక గ్లాసు కలబంద రసం ఈ సమస్యను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది. నిజానికి కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది. పొడి చర్మం నుండి ఉపశమనం: చలికాలంలో తరచుగా చర్మం పొడిబారుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో కూడా మీ ముఖం పోషణతో ఉండాలంటే, కలబంద రసాన్ని మీ ముఖానికి అప్లై చేయడమే కాకుండా, దాని జ్యూస్ తాగండి. నిత్యం ఈ జ్యూస్ తాగడం వల్ల మీ ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. ఎప్పుడు తాగాలి? మీరు కలబంద జ్యూస్‌ని సాయంత్రం పూట కూడా తాగవచ్చు. అయితే ఉదయం పూట కలబంద జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.  
Publish Date: May 27, 2024 9:30AM

జీవించడమంటే ఇదే..!

జీవించడమూ ఒక కళ అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ప్రస్తుత సమాజంలో మనిషి రెండు విధాలుగా బ్రతుకుతున్నాడు. ఒకటి, తనకు తోచిన విధంగా, రెండు ఓ పద్ధతి ప్రకారం. కానీ మూడవ పద్ధతి ఒకటి ఉంది. ఈ పద్ధతిలో అమితమైన స్వేచ్ఛ ఉంటుంది. ఈ పద్ధతిలో బ్రతకడమే జీవించడం అంటే, ఈ పద్ధతినే జీవించే కళ అంటారు. ఇప్పుడు విదేశాలలో క్రొత్తరకం జీవనోపాధి ఒకటి స్వైరవిహారం చేస్తోంది. అదేమిటంటే మంచి వాక్చాతుర్యం కలిగి, జీవితంలో గొప్పగా సాధించిన ఒక వ్యక్తి ఇతరులకు ఎలా జీవించాలో, ఏ విధంగా జీవన పద్ధతి పాటిస్తే నిండైన విలువైన జీవితం దొరుకుతుందో వివరిస్తూ, అందులో శిక్షణా తరగతులూ, ప్రసంగాలూ ఇస్తూ ఎంతో మంచి పాతవైన, భారమైన జీవితాలని అందమైన తీరాలవైపు మళ్ళిస్తున్నారు. ఈ విధంగా జీవించేకళలో శిక్షణ ఇచ్చే మనిషిని లైఫ్ కోచ్ అని అంటున్నారు.  ఇప్పుడు ఈ లైఫ్ కోచ్ ల ఆవశ్యకత మన భారతదేశానికె అవసరం అంటున్నారు. ఎందుకంటే ప్రపంచానికే వెలుగు చూపింది మన భారతదేశం. ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రజలకు తలమానికంగా నిలచింది మన దేశమే. ఇప్పుడు కూడా ఏ దేశానికీ వెళ్ళనంత ఎక్కువ జనాభా, భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మిక జీవనం నేర్చుకొని వెళ్తున్నారు. ఇక్కడ నేర్చుకొన్న గొప్ప విద్యను, జ్ఞానాన్ని వారి దేశాల్లో వినియోగిస్తూ, లైఫ్ కోచ్ లుగా, పబ్లిక్ స్పీకర్లుగా, ప్రేరణా రచయితలుగా మారి కోట్లకు కోట్లు సంపాదిస్తూ పదిమంది జీవితాలను ఉన్నతదిశగా మారుస్తూ తృప్తిగా హాయిగా జీవిస్తున్నారు. మన దేశంలో పూస్తున్న మల్లెల సువాసనను మన తుమ్మెదలు గ్రహించలేని స్థితిలో ఉంటే... విదేశాలనుండి వచ్చిన తుమ్మెదలు ఆ అద్భుత సౌరభాలను హాయిగా ఆస్వాదించి... తిరిగి మన తుమ్మెదలకే మల్లెల సువాసనలు గురించి పరిచయం చేస్తున్నాయి. ఈ విషయం ఎంత విచిత్రమో కదా అనిపించడం లేదూ... ఇక్కడ తప్పు మన తుమ్మెదలదా, విదేశీ తుమ్మెదలదా. ఆలోచిస్తే ముమ్మాటికీ మన తుమ్మెదలదే. మన దేశంలో దొరికిన కాసింత జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించి దాంతోటే వాళ్ళ దేశంలో అద్భుతాలు సృష్టిస్తుంటే, ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి మన భారతీయ విజ్ఞానంపై సర్వహక్కులూ కలిగి ఉండి,  నేర్చుకోగల అవకాశాలు ఉండికూడా భారతీయులు విఫలమవుతున్నారు.  ఈ అపాయకరమైన పరిస్థితిని గమనించి ఎందరో భారతీయ గురువులూ, తత్వవేత్తలూ, ఆధ్యాత్మిక ప్రవచకులూ గొంతు అరిగేలా అరిచి అరిచి చెప్తున్నా... కనీసం కొంచెమైనా పట్టించుకోలేని భయానకమైన స్థితిలో దేశప్రజలు దిగజారిపోతున్నారు. ఎందుకంటే... ప్రజలు తమకు తోచిన విధంగానే బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా జీవించడం గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయం ఒకటే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు అందుకే ఇలా చెబుతారు అని.  ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు  జీవించే పద్ధతిలో జీవితం వారిని కాలసర్పంలా కాటేస్తున్నా ఆ విషవలయాల మధ్య రొప్పుతూ బ్రతికేస్తున్నారు. విద్యార్థి దశనుండీ... పరీక్షల్లో ర్యాంకులైతే తెచ్చుకోగలరు కానీ జీవితంలో నిరంతరం పరాజయం పొందుతూనే ఉన్నారు. ఎందుకంటే జీవితం గురించిన పాఠాలు ఏ పాఠశాలలోనూ బోధించడం లేదు.  నేర్చుకుంటున్న విద్య  కడుపునిండా తిండి పెట్టగల్గుతోంది. కానీ ప్రశాంతమైన నిద్రను ఇవ్వడం లేదు. కలకాలం హాయిగా జీవించడానికి పనికిరాని విద్య... అసవరమే లేదు. ఆ విషయాన్ని ఎవరూ గ్రహించడం లేదు. అటువంటి విద్యతో బ్రతకగలరేమోగానీ జీవించలేరు. ఎలాగైనా బ్రతికేయడం...  జీవితమవుతుందా?? జీవించడమంటే.... వెయ్యేళ్ళు ప్రజల గుండెల్లో వర్ధిల్లాలి. జీవితమే భావితరాలకు జీవితకళను నేర్పే పాఠం కావాలి. గొప్పగా జీవించలేకపోయినా కనీసం తన కుటుంబంలోని సభ్యులతో ఏ చీకూచింతా లేకుండా, నిండు ఆరోగ్యంతో, నీతిగా, ధర్మబద్దంగా ప్రతిరోజూ ఆనంద పరవశులౌతూ మనసారా తృప్తిగా జీవించగల్గితే చాలు. తమ బిడ్డలకు నైతిక విలువలు నేర్పిస్తూ, దయా, కరుణ, ప్రేమతత్వాన్ని వారికి అమృతంలా అందిస్తూ... వారు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తయారయ్యేలా చేస్తూ... కనీసం వెయ్యి మందిలో ఒక్కరైనా నిజంగా జీవించగలుగుతున్నారా?... ఇవన్నీ ప్రశ్నించుకుంటే జీవించడం గురించి ఓ అవగాహన వస్తుంది.                                      ◆నిశ్శబ్ద.
Publish Date: May 27, 2024 9:30AM