political-news-img

విజ‌య్ కి చుక్క‌లు చూపిస్తున్న‌ఈ గ‌వ‌ర్న‌ర్ ఎవ‌రు?

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్ ఉన్నారు. ఈయ‌న గోవాలోని ప‌నాజీలో 1954 ఏప్రిల్ 23,న జన్మించారు. భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. గోవా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గోవా శాసనసభ స్పీకర్‌గా.. 2012-2015 మ‌ధ్య కాలంలో ప‌ని చేశారు. గోవా ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. భారతదేశంలోనే అసెంబ్లీని మొట్టమొదటిసారిగా పేపర్ లెస్ చేసిన ఘనత ఈయనకు దక్కుతుంది. ముందుగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, ఆ తర్వాత బీహార్ గవర్నర్‌గానూ పనిచేశారు. జనవరి 2025లో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2026 మార్చి 12 నుంచి ఆయన తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వివాదం విష‌యానికి వ‌స్తే.. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. అయితే ప్రభుత్వ‌ ఏర్పాటుకు కావాల్సిన 118 మ్యాజిక్ మార్కుకు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఆ మద్దతును స్పష్టంగా చూపించాలని గవర్నర్ చెబుతున్నారు. బయటి నుంచి మద్దతు ఇచ్చే పార్టీలైన కాంగ్రెస్ వంటి వాటి నుంచి రాతపూర్వక లేఖలు ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని ఆయన స్పష్టం చేయడంతో తమిళనాట రాజకీయ హీటెక్కింది. గోవా నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తుండటం వ‌ల్ల‌, గతంలో ఆయనకున్న బీజేపీ నేపథ్యం వల్ల.. స్థానిక నాయకులు, ఇత‌ర‌ సినీ ప్రముఖులు ఆయన తీరును విమర్శిస్తున్నారు. రజనీ, కమల్, ప్రకాష్ రాజ్ ఎందుకు గుర్రుగా ఉన్నారు? అని చూస్తే వీరందరూ గవర్నర్ తీరును విమర్శించడానికి ప్రధాన కారణం రాజ్యాంగ సంక్షోభం. కేంద్రం పంపిన గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజల తీర్పును గౌరవించడం లేద‌ని బాహాటంగానే విమర్శిస్తున్నారు ప్ర‌కాష్ రాజ్. రజనీ, కమల్.. నేరుగా గవర్నర్‌పై యుద్ధం ప్రకటించకపోయినా.. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గవర్నర్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతోందని వీరి ఆందోళన. గవర్నర్ అర్లేకర్ తీసుకునే నిర్ణయాలు కేంద్రంలోని బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనీ.. అందుకే ఆయన మెజారిటీ విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని స్థానిక పార్టీలు ఆరోపిస్తున్నాయి. విజయ్ కి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అనేదే ఇప్పుడు కీలకం. ఒకవేళ ఆయన మద్దతు లేఖలు సమర్పిస్తే, గవర్నర్ తప్పనిసరిగా ప్రమాణ స్వీకారానికి అనుమతించాల్సి ఉంటుంది. ఈ లోపు జరుగుతున్న ఈ తాత్కాలిక అడ్డంకులే ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి.

Publish Date: May 8, 2026 2:49PM

political-news-img

రాయల్ ఎన్ ఫీల్డ్.. అప్పుడు ఎక్కా.. ఇప్పుడు తెచ్చా.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిలో మరో ముందడుగు పడింది. రాష్ట్రానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్‌ కు వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. గురువారం (మే 7) కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు. ఇక రాయల్ ఎన్ ఫీల్డ్ కు ఉన్న క్రేజ్ గురించి చెబుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, అది మెజస్టిక్ వెహికల్. అప్పట్లో ఎక్కేవాళ్ళం, ఇప్పుడు అదే వాహనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురాగలిగాం అని అన్నారు. ఇన్నాళ్లూ తమిళనాడుకే పరిమితమైన ఈ ఐకానిక్ బ్రాండ్‌ను ఏపీకి తీసుకురావడం గొప్ప విజయమని చెప్పారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాతావరణం మళ్లీ పుంజుకుందన్నారు. పారిశ్రామిక వేత్తల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని ఈ పరిణామం స్పష్టం చేస్తోందన్న చంద్రబాబు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి గ్లోబల్ బ్రాండ్ ఏపీలో అడుగుపెట్టడం రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చివేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు ఏపీలో అడుగుపెట్టే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకతో ఆటోమొబైల్ రంగానికి ఏపీ కేంద్ర బిందువుగా మారుతుందనడంలో సందేహం లేదు. ఉపాధి కల్పనతో పాటు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కూడా ఇది దోహదపడనుంది.

Publish Date: May 8, 2026 12:14PM

political-news-img

పిఠాపురం వర్మకు ఉద్వాసన.. హైకమాండ్ ఆలోచన ఏంటి?

పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జిగా వర్మ తొలగింపు నిజంగా ఒక అనూహ్య పరిణామమే. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పీఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి నుండి తొలగిస్తూ తెలుగుదేశం హైకమాండ్ తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాలలో పెను సంచలనం రేపింది. పిఠాపురం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో.. ఇక్కడ జరిగే ప్రతి చిన్న మార్పు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ నేపథ్యంలోనే వర్మను బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ సాధించడంలో వర్మదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. పవన్ కల్యాణ్ కోసం తన సీటును వర్మ త్యాగం చేశారు. వ్యక్తిగత ఆకాంక్షలను పక్కన పెట్టి మరీ అధిష్టానం ఆదేశాల మేరకు జనసేన అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. అటువంటి నాయకుడిని ఇప్పుడు ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం స్థానిక టీడీపీ శ్రేణులలో కూడా అసంతృప్తికి కారణమైంది. గత కొద్దిరోజులుగా పిఠాపురంలో జనసేన, టీడీపీ స్థానిక నాయకుల మధ్య ప్రోటోకాల్ విషయంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకులతో వాగ్వాదాలకు దిగారు. ఇప్పుడు అవే తెలుగుదేశం అధిష్ఠానం వర్మపై వేటు వేయడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విషయంలో వర్మ తనను ఇన్ చార్జిగా తొలగించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ బలోపేతానికి తన రక్తాన్ని ధారపోశాననీ.. ఏనాడు క్రమశిక్షణ తప్పలేదని చెబుతూ.. అర్ధంతరంగా మీడియా సమావేశాన్ని ముగించి కన్నీటిని ఆపుకుంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి. తెలుగుదేశం శ్రేణుల్లో వర్మ పట్ల సానుభూతి వ్యక్తం అవుతోంది. అయితే వర్మను నియోజకవర్గ బాధ్యతల నుంచే తప్పించి ముందు ముందు కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చే ఉద్దేశంతో తెలుగుదేశం హైకమాండ్ ఉందని పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో.. ఆ కూటమిలోని ఇద్దరు ప్రధాన భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య కుదర్చడానికే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. రాబోయే రోజుల్లో పిఠాపురం టీడీపీలో ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. వర్మ వంటి బలమైన నేతను పక్కన పెట్టడం వల్ల కేడర్‌లో అసమ్మతి రాకుండా చూసుకోవడం ఇప్పుడు టీడీపీ అధిష్టానం ముందు ఉన్న టాస్క్ గా చెబుతున్నారు.

Publish Date: May 8, 2026 11:49AM

political-news-img

ఎన్టీఆర్ వ్యక్తిత్వ ఔన్నత్యం శిఖరాయమానం

తెలుగు ప్రజల గుండెల్లో అన్నగా సుస్థిర స్థానం సంపాదించుకున్న నందమూరి తారక రామారావు జీవితం ఒక తెరిచిన పుస్తకం. వెండితెరపై దైవ స్వరూపంగా కనిపించిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చాక కూడా తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఆయన సిద్ధాంతాలు, విలువలు కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఆచరణలోనూ కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా శాంతికి, సేవకు మారుపేరుగా నిలిచిన మదర్ థెరీసా స్వయంగా ఒక ప్రతిపాదనను ఆయన ముందుంచినప్పుడు, ఎన్టీఆర్ ఎంతో గౌరవంగా దానిని తిరస్కరించడం ఆనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన ఎన్టీఆర్ వ్యక్తిత్వంలోని ధైర్యాన్ని, ధర్మనిష్ఠను చాటిచెబుతుంది. 1980వ దశకం ఆరంభంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్.. జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే ఒక సందర్భంలో మదర్ థెరీసాతో ఆయనకు భేటీ జరిగింది. అప్పటికే కోల్ కతా కేంద్రంగా మిషనరీస్ ఆఫ్ చారిటీ ద్వారా మదర్ థెరీసా చేస్తున్న సేవలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఆమె తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసే క్రమంలో.. ప్రజాకర్షణ కలిగిన ఎన్టీఆర్ వంటి నాయకుడి సహకారాన్ని కోరారు. తన మిషన్ ప్రచార బాధ్యతల్లో లేదా సేవా విభాగాల్లో భాగస్వామి కావాలని ఆమె కోరారు. ఈ ప్రతిపాదనకు ఎన్టీఆర్ ఏమాత్రం తడబడకుండా, అత్యంత మర్యాదపూర్వకమైన రీతిలో నో చెప్పారు. తాను భారత పౌరుడిననీ, తనకంటూ ఒక ధర్మం, జీవన విధానం ఉన్నాయనీ చెప్పిన ఆయన.. మదర్ థెరిస్సా సేవ పట్ల ఎనలేని గౌరవం ఉందని చెబుతూనే.. ఆ మిషన్ ప్రచారాల్లో భాగస్వామిని కాలేనంటూ సున్నితంగానే అయినా నిష్కర్షగా చెప్పారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అంతర్జాతీయ స్థాయి వ్యక్తి విజ్ణప్తిని కాదనడం సామాన్యమైన విషయం కాదు. అయితే, తన హిందూ సాంస్కృతిక మూలాలను గౌరవిస్తూనే.. ఇతర మతాల పట్ల విద్వేషం లేకుండా తన పంథాను ఆయన చాటుకున్నారు. ఇది ఆయనలోని ఎన్టీఆర్ లోని స్వాభిమాన లౌకికవాదానికి నిలువెత్తు నిదర్శనం. ఎన్టీఆర్ సినిమాల్లో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి పాత్రల ద్వారా కోట్లాది మందిలో భక్తి భావాన్ని నింపారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన లౌకికవాదాన్ని పాటించారు. అయినా.. సొంత ధర్మాన్ని ఎక్కడా వదులుకోలేదు. మదర్ థెరీసా ప్రతిపాదనను తిరస్కరించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం మత ప్రచారానికి, రాజకీయాలకు మధ్య ఒక స్పష్టమైన గీత గీయడమే. ప్రజా ప్రతినిధిగా అన్ని మతాల వారినీ సమానంగా చూడాలి తప్ప, ఒక నిర్దిష్ట మత సంస్థ ప్రచారకర్తగా మారడం సరికాదని ఆయన భావించారు. ఈ నిర్ణయం ద్వారా ఆయన తన వ్యక్తిగత విశ్వాసాలకు, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలకు మధ్య అద్భుతమైన సమతుల్యతను పాటించారు. నేటి రాజకీయాల్లో చాలామంది నాయకులు ఓట్ల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం మతపరమైన వేదికలను వాడుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఎన్టీఆర్ ఆనాడే విలువల కోసం నిలబడ్డారు. ఒక వ్యక్తిగా మదర్ థెరీసాను గౌరవిస్తూనే.. సిద్ధాంతపరంగా విభేదించడం అనేది ఒక గొప్ప నాయకత్వ లక్షణం. ఈ సంఘటన కేవలం ఒక తిరస్కరణ మాత్రమే కాదు, తన సంస్కృతిని ప్రేమిస్తూనే ఇతరులను గౌరవించే ఒక సంస్కారవంతమైన దృక్పథం. అందుకే దటీజ్ ఎన్టీఆర్ అని ఆయన అభిమానులు నాడూ, నేడూ, ఎప్పుడూ కూడా గర్వంగా చెప్పుకుంటారు. ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం నేటి తరానికి ఒక పాఠం. అస్తిత్వాన్ని కోల్పోకుండా, పరుల పట్ల మర్యాదగా ఉంటూనే బాధ్యతలను ఎలా నిర్వహించాలో, ఎలా నిర్వర్తించాలో ఎన్టీఆర్ ఆచరించి చూపారు. చరిత్రలో కొన్ని ఘట్టాలకు లిఖితపూర్వక ఆధారాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అప్పటి రాజకీయ నాయకులు, ప్రత్యక్ష సాక్షుల మౌఖిక వర్ణనలు ఈ ఆసక్తికర విషయాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచాయి. నందమూరి తారకరామారావు జీవితంలోని ఇటువంటి అరుదైన కోణాలు ఆయనను సామాన్య నాయకుడి నుండి ఒక యుగపురుషుడిగా, శకపురుషుడిగా మార్చాయి. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com ను ఫాలో అవ్వండి. , మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.

Publish Date: May 8, 2026 11:23AM

political-news-img

అషురెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

పెళ్లి పేరుతో ఎన్నారై వ్యాపారవేత్తను మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సినీ నటి అషురెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది. ఈ కేసులో విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున, పోలీసులు తమ దర్యాప్తును చట్టప్రకారం కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే.. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర అనే ప్రవాస భారతీయుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అషురెడ్డి సుమారు రూ. 9.35 కోట్లు కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అషురెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2018 నుంచి వీరి మధ్య ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని.. అమెరికాలో ఎడ్యుకేషన్ లోన్ తీర్చడానికి, కారు, విల్లా వంటి ఆస్తులు కొనడానికి ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. తనపై వచ్చిన ఆరోపణలను అషురెడ్డి ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని వాదిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఆర్ఐ తనంతట తానుగా, ఇష్టపూర్వకంగానే ఖర్చు చేశారని, ఇందులో ఎటువంటి బలవంతం లేదని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. పోలీసులు కనీసం తన వెర్షన్ తీసుకోకుండానే కేసు నమోదు చేశారని, కాబట్టి ఈ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ ( చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. విచారణ సజావుగా సాగాలని ఆదేశిస్తూ.. అషురెడ్డి కోరిన స్టే విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అలాగే పోలీసుల కఠిన చర్యల నుండి మినహాయింపు ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో ఈ కేసులో పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది.

Publish Date: May 8, 2026 11:08AM

political-news-img

అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెచ్చరిల్లాయి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న అమెరికా యుద్ధనౌకకు ముప్పుగా పరిణమించిన ఇరాన్ డ్రోన్‌ను అమెరికా రక్షణ దళాలు విజయవంతంగా కూల్చివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ముందుకు రావడంతో, ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా అమెరికా సైన్యం ఆ డ్రోన్‌ను పేల్చివేసింది. ఈ పరిణామంపై శ్వేతసౌధం నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం.. ఇరాన్ ఉద్దేశపూర్వకగానే అమెరికా నౌకలపై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ట్రంప్ విమర్శించారు. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ, శాంతి భద్రతలను విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. తమ సిబ్బందిని, ఆస్తులను రక్షించుకోవడానికి అమెరికాకు పూర్తి హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. గత కొద్దికాలంగా గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు సరఫరాకు అత్యంత ప్రధానమైన హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు అమెరికాకు కంటగింపుగా మారాయి. గతంలో కూడా ఇరాన్ ఇలాంటి డ్రోన్లను అమెరికా నిఘా ప్రాంతాల్లోకి పంపడం, ప్రతిగా అమెరికా ఆంక్షలు విధించడం వంటి పరిణామాలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఇరాన్ అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది. అమెరికాయే కాల్పుల విరమణను ఉల్లంఘించి తమ నూనె ట్యాంకర్ సహా రెండు నౌకలపై దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది. దానికి ప్రతిస్పందనగానే తాము అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్, బందర్ అబ్బాస్ వంటి నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న తాత్కాలిక ప్రశాంతతకు తెరపడి, యుద్ధ వాతావరణం నెలకొంది.

Publish Date: May 8, 2026 10:57AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img