Top Stories

political-news-img

ప్రకాష్ రాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి..బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్..!

సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి, హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అలాంటి వ్యాఖ్యల ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రకాష్ రాజ్‌కు సంబంధించిన ఒక ఆడియో బయటపడటం ఈ వ్యవహారానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా దేశ ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలను ప్రభుత్వం, పోలీసులు ఏమాత్రం ఉపేక్షించరాదని, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొందరు కూడా సహకరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో సమగ్ర విచారణ జరిపించి, కుట్రలో పాల్గొన్న వారందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Publish Date: Jul 5, 2026 2:51PM

political-news-img

ప్రేమ, వేధింపులు, మోసం..డ్యాన్సర్ రేణుక జీవిత విషాద గాథ..!

తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..! నమ్మిన వారి మోసం..ఓ పబ్ డ్యాన్సర్ కన్నీటి గాథ..! హైదరాబాద్‌లో ఓ యువతి జీవితం విషాదాంతమైంది. చిన్న వయసులో ప్రేమ పేరుతో మొదలైన బంధం.. పెళ్లి తర్వాత భర్త వేధింపులు.. ఒంటరితనం.. నమ్మిన వారి మోసం.. ఇలా వరుసగా ఎదురైన కష్టాలు ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయి. చివరకు ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రాండ్ లాడ్జిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. అల్వాల్‌కు చెందిన రేణుక (26) చిన్నతనంలోనే చదువు మానేసి ఉపాధి కోసం ఓ హోటల్‌లో పనిచేయడం ప్రారంభించింది. ఆ సమయంలో పాతబస్తీకి చెందిన శివ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారడంతో పదేళ్ల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత రేణుక గర్భం దాల్చగా.. పిల్లలు వద్దని, అబార్షన్ చేయించుకోవాలని భర్త ఒత్తిడి చేశాడు. అయితే కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవాలని నిర్ణయించుకున్న రేణుక భర్తకు దూరంగా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో విడిపోయిన తర్వాత తల్లిదండ్రులు కూడా దూరం పెట్టడంతో.. కొడుకును పోషించేందుకు గత నాలుగేళ్లుగా కూకట్‌పల్లి లోని ఓ పబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో గోల్కొండకు చెందిన ఫారూఖ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు అండగా ఉంటానని నమ్మించిన ఫారూఖ్‌తో ఆమె సన్నిహితంగా మెలిగింది. అయితే తనను పలువురు కేవలం ఉపయోగించుకుని మోసం చేస్తున్నారనే భావనతో రేణుక తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. తన మానసిక బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని స్నేహితులతో తరచూ చెప్పేదని విచారణలో వెల్లడైంది. జులై 2న రేణుక, ఫారూఖ్ కలిసి లంగర్‌హౌస్‌లోని గ్రాండ్ లాడ్జిలో గది తీసుకుని మద్యం సేవించారు. రాత్రి ఫారూఖ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న రేణుక అర్ధరాత్రి తన స్నేహితురాలు సత్యవాణికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. మొదట ఆమె మాటలను సీరియస్‌గా తీసుకోని సత్యవాణి.. అనంతరం వీడియో కాల్‌లో ఫ్యాన్‌ను చూపిస్తూ "నేను చనిపోతు న్నాను" అని చెప్పడంతో వెంటనే ఫారూఖ్‌కు సమాచారం ఇచ్చింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫారూఖ్.. రేణుక ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించాడు. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా రేణుక మరో ఏడుగురు వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమెను ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేశారా.. లేక మానసికంగా వేధించారా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. స్నేహితురాలు సత్యవాణి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తున్నారు. రేణుక జీవితం విషాదాంతం కావడంతో ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు తల్లిని కోల్పోయి అనాథగా మిగిలాడు.

Publish Date: Jul 5, 2026 1:37PM

political-news-img

కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో విషాదం..!

పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది. కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ అనారోగ్యంతో కన్నుమూశారు. పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణ వార్తను తెలియజేస్తూ కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. ‘మిస్ యూ డాడ్’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న 22 ఏళ్ల యువకుడు, నవంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు, లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి నెట్టివేయబడి దారుణ హత్యకు గురయ్యాడు. నిశ్చితార్థం చేసుకున్న కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి పక్కా స్కెచ్‌తో ఘోరానికి ఒడిగట్టారు. జూన్ 18న జరిగిన ఈ ఘోర కలి మనవడిని ఎంతగానో ప్రేమించే ఆ తాతయ్య గుండెను పిండేసింది. మనవడు ఇక లేడనే నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. కేతన్ అగర్వాల్ మరణించిన నాటి నుంచి ఆయన తాత, సక్సెస్ గ్రూప్ వ్యవస్థాపకుడు దేవీచంద్ అగర్వాల్ (71) తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. శనివారం రాత్రి 9:45 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో ఆయన కన్నుమూశారు. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన మనవడు హత్యకు గురికావడం, ఆ నింద కాబోయే కోడలిపైనే పడటంతో ఆ వృద్ధుడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మనవడి మరణం మిగిల్చిన తీరని శోకమే చివరకు ఆయన ప్రాణాలను బలితీసుకుంది. అగర్వాల్ కుటుంబంలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఈ సంచలన కేసులో పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సియా గోయల్, కుటుంబ సభ్యుల ఒత్తిడి తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. కేతన్‌కు ఉన్న నత్తి, బట్టతల కారణంగా తలపాగా (విగ్) ధరించడం ఆమెకు నచ్చలేదని, అందుకే అతడిని వదిలించుకోవాలని చూసినట్లు పేర్కొంది. ఇందుకోసం జూన్ 14నే ఓసారి లోహగఢ్ కోటపై నుంచి నెట్టేయడానికి ప్రయత్నించగా, కేతన్ పొదలను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు పాము వచ్చిందని అబద్ధం చెప్పి తప్పించుకున్న సియా, జూన్ 18న 400 అడుగుల లోతున్న ఘోస్ట్ పాయింట్ లోయలోకి ప్రియుడితో కలిసి నెట్టేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ హత్యకోసం నిందితుడు చేతన్ టోల్ ప్లాజాల వద్ద దొరికిపోకుండా ఉండేందుకు ఏకంగా 90 కిలోమీటర్లు స్కూటర్ పై ప్రయాణించి కోట వద్దకు చేరుకున్నాడు. క్రైమ్ సీన్ రీక్రియేషన్ కోసం పోలీసులు డమ్మీని ఉపయోగించి దర్యాప్తు చేయగా, సియా ఈ దారుణానికి ముందే స్నాప్‌చాట్ లో తన స్నేహితురాలికి 'అసలు జరగని పెళ్లి కోసం ఆధార్ కార్డు పంపమంటూ' గుప్త సందేశాలు పంపినట్లు ఆధారాలు లభించాయి. కేతన్ మరణించాక కూడా అతడి మొబైల్ ఫోన్‌ను కొంతసేపు సియా తన వద్దే ఉంచుకుని ఆధారాలు నష్టం చేసేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ 14 రోజుల జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించిన మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను నియమించింది. ఒకవైపు న్యాయ పోరాటం సాగుతుండగానే, తాతయ్య దేవీచంద్ గుండె పగిలి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా అందరినీ కలచివేస్తోంది.

Publish Date: Jul 5, 2026 12:30PM

political-news-img

డీఎస్పీ భీమ్ రెడ్డి డైరీలో విస్తుపోయే బినామీ ఆస్తుల చిట్టా..!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి. చార్ ధామ్ యాత్రకు వెళ్లే ముందు భీమ్ రెడ్డి తన ప్రత్యక్ష, బినామీ ఆస్తులు, వాటికి సంబంధించిన లావాదేవీలు, అప్పులు, అలాగే ఆ వ్యవహారాల గురించి తెలిసిన వ్యక్తులు, మధ్యవర్తుల వివరాలను ఒక డైరీలో నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. డైరీలో తెల్లాపూర్‌లో వాచ్‌మన్ పేరు మీద ఉన్నట్లు ఆరోపణలు ఉన్న రెండు ఫ్లాట్లు, మణికొండలోని లాన్‌కో హిల్స్ రోడ్డులో G+5 వాణిజ్య భవనంలో తన వాటా, గచ్చిబౌలిలోని టెలికాం నగర్‌లో ఉన్న G+2 భవనం వివరాలు నమోదు చేసినట్లు గుర్తించారు. అలాగే కర్ణాటకలోని జహీరాబాద్ పరిసరాల్లో 45 ఎకరాల భూమి, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో రెండు ఎకరాల వ్యవసాయ భూమి, ముచింతల్‌లో 4.2 ఎకరాల భూమి వంటి బినామీ ఆస్తుల వివరాలు కూడా డైరీలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా 'కమ్ బ్యాక్' అనే గమనికతో ఒక వ్యాపారంలో రూ.2 కోట్ల పెట్టుబడి, విల్లా కొనుగోలుకు రూ.60 లక్షలు కేటాయించినట్లు కూడా నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ డైరీ పేజీలను స్కాన్ చేసి తన కుమారులకు వాట్సాప్ ద్వారా పంపించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే భీమ్ రెడ్డికి చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, డైరీలో ప్రస్తావించిన బినామీలు, మధ్యవర్తులను త్వరలో విచారణకు పిలిపించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు వెస్సెల్లా మెడోస్‌లోని భీమ్ రెడ్డి విల్లాతో పాటు మణికొండలోని అతని వ్యాపార భాగస్వామి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి ఆధారంగా దర్యాప్తును మరింత విస్తరించి, కేసులో మరిన్ని అంశాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది.

Publish Date: Jul 5, 2026 12:18PM

political-news-img

కన్నెపల్లి వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు..!

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌజ్ పర్యటనకు పిలుపునివ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నెపల్లి పంప్‌హౌజ్ వైపు వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అడుగడుగునా బారికేడ్లు, ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పర్యటనను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష శ్రేణులు మండిపడుతున్నాయి. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు సాగిన కేటీఆర్ కాన్వాయ్‌ను జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య నిలిపివేశారు. హైవేపై భారీగా బారికేడ్లు ఉంచి కేటీఆర్ వాహనాలను అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజాప్రతినిధుల పర్యటనను ఎలా అడ్డుకుంటారని గులాబీ నేతలు అధికారులను నిలదీశారు. పెంబర్తి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు, బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో జాతీయ రహదారి ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. ఈ పర్యటనను నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్‌లు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, చివరకు కన్నెపల్లి పంప్‌హౌజ్ వైపు వెళ్తున్న రైతుల వాహనాలను సైతం పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లలో వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై బీఆర్ఎస్ అధికారికంగా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పర్యటనలు చేసే హక్కును కూడా కాలరాస్తున్నారని, కన్నెపల్లి పంప్‌హౌస్ వాస్తవాలను ప్రజలకు తెలియకుండా దాచడానికే ప్రభుత్వం ఈ స్థాయి ఆంక్షలు విధిస్తోందని ఆరోపించింది. హైదరాబాద్-వరంగల్ హైవే పొడవునా పోలీసులు పహారా కాస్తుండటంతో ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ పర్యటన ముగిసేవరకు ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది.

Publish Date: Jul 5, 2026 11:42AM

political-news-img

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల గాలింపు ముమ్మరం..!

కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..! విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో మత్య్సకారుల గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే ఆయన కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోటును గాలించేందుకు కోస్టుగార్డు నౌక ప్రయత్నిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి INDAP-VS-MM-83 అనే బోటు 7గురు మత్స్యకారులతో జూన్ 1 తేదీ సాయంత్రం 4 గంటలకు సముద్రంలోకి చేపల వేటకు బయల్దేరి వెళ్లిందని సీఎంకు అధికారులు తెలిపారు. 4 తేదీ మధ్యాహ్నానికి ఆ బోటు ఫిషింగ్ హార్బర్ కు తిరిగి రావాల్సి ఉందని అయితే సాంకేతిక కారణాల వల్ల ఆ బోటు ఇప్పటికీ తిరిగి రాలేదని వివరించారు. గంగవరం సముద్ర తీరం సమీపంలో వారి బోటుకు సాంకేతిక సమస్య ఉత్పన్నమైనట్టుగా గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా కూడా గాలింపు చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుతం కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు వివరించారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఎం సముద్రంలో చేపడుతున్న గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాల్సిందిగా మెరైన్ ఐజీ, విశాఖ సీపీలను ఆదేశించారు. గాలింపు చర్యలకు సంబంధించిన అంశాలను తనకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని సీఎం సూచించారు. మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక విశాఖ ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలిచ్చారు.

Publish Date: Jul 5, 2026 11:08AM

MOVIE NEWS