Top Stories

political-news-img

సాయికృష్ణ మిస్సింగ్ కేసు: కుల రాజకీయాల కుంపటిగా మార్చడం దారుణం.. అడుసుమిల్లి

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసు చుట్టూ రోజుకో మలుపు తిరుగుతుండటంతో అసలు ఏం జరిగిందనే దానిపై సర్వత్రా మిస్టరీ నెలకొంది. అయితే, ఒక తల్లి కడుపుకోతగా మిగిలిన ఈ సున్నితమైన కేసును కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల కుంపటిగా మార్చడానికి ప్రయత్నించడం అత్యంత దారుణమని ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై మాట్లాడారు. ప్రస్తుతం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని కొట్టి చంపేశారా? లేక అతడు పరారీలో ఉన్నాడా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే బాధ్యుడిగా భావిస్తున్న కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేసింది. న్యాయస్థానం పర్యవేక్షణలో ఉన్న ఈ కేసుపై రాజకీయ నాయకులు తొందరపడి తీర్పులు ఇవ్వడం సరికాదన్నఅడుసుమిల్లి.. సాయికృష్ణ తల్లి ఆవేదనను ప్రతి ఒక్కరూ మానవీయ కోణంలో అర్థం చేసుకోవాలన్నారు. తన బిడ్డ బతికున్నాడో లేదో తెలియక, కనీసం చనిపోయాడని తెలిస్తే ఒక ఏడుపు ఏడ్చి ఊరుకునే పరిస్థితి కూడా ఆ తల్లికి లేకుండా పోయిందని, బూడిదైనా ఇవ్వాలంటూ ఆమె రోదించడం ఎంతో దారుణమన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఉంది కాబట్టే, ఒక తల్లి తన బిడ్డ కోసం పోలీసులను, వ్యవస్థలను నిలదీసే స్వేచ్ఛ లభించిందని కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. అయితే, ఈ కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, నోటి దురుసు, ఇతరులను కించపరిచేలా మాట్లాడటం వల్లే గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని గుర్తుచేశారు. అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఉన్న వ్యక్తిగత ద్వేషంతో ఈ కేసును రాజకీయ పావుగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. నేరం చేసినవాడు ఏ కులమైనా చట్టం ముందు నేరస్థుడేనని, దానికి కులాన్ని, మతాన్ని అంటగట్టడం వల్ల కేసు తీవ్రత పక్కదారి పడుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఒకవేళ కస్టడీ మృతి అని తేలితే సదరు పోలీస్ అధికారికి కఠిన శిక్ష పడటం ఖాయమని పేర్కొన్నారు. విపక్షాలు శవ రాజకీయాలు ఆపాలని, ఆ తల్లికి నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఆమెకు లీగల్ సపోర్ట్ అందించాలే తప్ప ఇలాంటి కుల రాజకీయాల చిచ్చు పెట్టవద్దని అడుసుమిల్లి శ్రీనివాసరావు హితవు పలికారు.

Publish Date: Jun 19, 2026 3:35PM

political-news-img

బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు

హైదరాబాద్ శివార్లలోని గండిపేట పరిధిలో వెలుగుచూసిన సంచలనాత్మక నకిలీ జీఓల భూ కబ్జా కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులు కోర్టు అనుమతితో బొల్లా బ్రహ్మనాయుడిని 3 రోజుల పాటు పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ గడువు ముగియడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈవోడబ్ల్యూ అధికారులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇరుపక్షాల లాయర్ల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి, చివరకు మాజీ ఎమ్మెల్యేకు ఉపశమనం కలిగిస్తూ బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించారు. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై కొన్ని కఠినమైన షరతులను విధించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్దేశిత పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారి ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అలాగే విచారణకు పూర్తిగా సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ బెయిల్ ప్రక్రియ కోసం 20 వేల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో గత కొన్ని రోజులుగా చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యేకు ఎట్టకేలకు ఊరట లభించినట్లయింది. ఆయన తరఫు అనుచరులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఈ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే, రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలో దాదాపు 1,000 కోట్ల రూపాయల విలువైన 9 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని నకిలీ జీఓలు, నకిలీ స్టాంపులు సృష్టించి అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సిసిఎల్‌ఏ మరియు హైడ్రా (HYDRA) కార్యాలయాల పేరిట తప్పుడు క్లియరెన్స్ పత్రాలు కూడా తయారు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ వివాదంలో ప్రధాన నిందితులతో దాదాపు 8 కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయని సెరిలింగంపల్లి డిసిపి శ్రీనివాస్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసు తీవ్రతను బట్టి ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, బొల్లా బ్రహ్మనాయుడి పాత్రపై పూర్తి ఆధారాలు లభించడంతో తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదైన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారైన బొల్లా బ్రహ్మనాయుడు.. బెంగళూరు, కేరళ రిసార్టులలో తలదాచుకుని, చివరకు తమిళనాడులోని కాంచీపురంలో పోలీసులకు పట్టుబడ్డారు. ట్రాన్సిట్ వారెంట్‌పై ఆయనను హైదరాబాద్ తీసుకువచ్చిన పోలీసులు, నిమ్మల దశరథ్ కుటుంబంతో జరిగిన కోట్లాది రూపాయల బదిలీలపై లోతుగా ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేకు బెయిల్ లభించినప్పటికీ, నకిలీ పత్రాల సృష్టి వెనుక ఉన్న అసలు సూత్రధారులు, నగదు చలామణిపై ఈవోడబ్ల్యూ మరియు సైబరాబాద్ పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేయనున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Publish Date: Jun 19, 2026 3:14PM

political-news-img

స్వార్థ రాజకీయం కోసం.. ఏపీలో మళ్లీ కులాల కుంపటి.. జనం నమ్మరు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం అనేది ఎప్పుడూ ఒక కీలకమైన అంశమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రాజకీయ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల మధ్య మళ్లీ చిచ్చు పెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నాయి. సమాజంలో ఒక శాతం కూడా లేని కుల వివక్షను రాజకీయం కోసం పెద్దదిగా చూపించి, ప్రజల మధ్య వైషమ్యాలు రగల్చాలని చూస్తున్న నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఏపీని ఏ దిశగా తీసుకెళ్తున్నాయనే చర్చకు దారితీస్తున్నాయి. దీనిపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున తెలుగున్ కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు. ఈ తరహా కుల విభజన రాజకీయాల వల్లే గతంలో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయిందని గుర్తు చేశారు. గతంలో రాజీవ్ గాంధీ మరణం సమయంలో గానీ, వంగవీటి మోహన రంగా హత్య జరిగినప్పుడు గానీ జరిగిన హింసాత్మక ఘటనలకు సామాజిక వర్గాలతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.. ఆయా సందర్భాలను వాడుకుని కొన్ని ముఠాలు ఆస్తులను ధ్వంసం చేసి కుల ముద్ర వేశాయన్న కిలారు.. ఇప్పుడు కూడా నేరం చేసినప్పుడు వ్యక్తిగత విషయంగా చూసే నాయకులు.. చట్టం తమపై చర్యలు తీసుకునేటప్పుడు మాత్రం కులం కార్డు బయటకు తీస్తున్నారని ఆక్షేపించారు. దళితులు, బీసీలు, ఇతర వర్గాల పేరుతో సానుభూతి పొందేందుకు ప్రయత్నించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో వైసీపీ తాను నిర్వహించే ఏ నిరసన కార్యక్రమానికీ, ప్రజల నుంచి ఆదరణ లేకపోవడంతో మళ్లీ కుల సమీకరణల అస్త్రాన్ని నమ్ముకుందన్నారు. కాపు సామాజిక వర్గాన్ని కూటమికి దూరం చేసేలా కొందరు నాయకులకు ప్రత్యేక టాస్క్‌లు అప్పగించారనే ప్రచారం కూడా సాగుతోందన్నారు. వీరికి తోడు తెలంగాణకు చెందిన కొందరు మేధావులు, ప్రొఫెసర్లు న్యూట్రల్స్ ముసుగులో ఏపీలో కుల రాజకీయాలను మరింత ప్రోత్సహిస్తూ ఒక వైపునకే వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే.. ఏపీ ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతంగా ఉన్నారని, 2019 నాటి కులాల ట్రాప్‌లో పడే పరిస్థితి ఇప్పుడు లేదని స్పష్టం చేశారు. నేటి సమాజంలో కులాంతర వివాహాలు పెరుగుతూ, ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తున్న తరుణంలో రాజకీయాల కోసం కుంపట్లు పెడితే ఎవరూ నమ్మరని తేల్చిచెప్పారు. ప్రజలకు ఇప్పుడు కావాల్సింది అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, ఉద్యోగ అవకాశాలు మాత్రమేనని.. కాబట్టి రాజకీయ పార్టీల కుయుక్తులను విచక్షణతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Publish Date: Jun 19, 2026 2:54PM

political-news-img

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ సోమవారం విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను A-11 నిందితుడిగా చేర్చిన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. A1 నుంచి A10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్న పోలీసులు, మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. వీరిలో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులందరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరైన అనంతరం కేసు ట్రయల్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఏడాది డిసెంబర్ 4న 'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కూడా శ్రీతేజ్ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈ ఘటనపై నమోదైన కేసులో దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. నిందితుల వ్యక్తిగత హాజరు అనంతరం అభియోగాల నమోదు ప్రక్రియ పూర్తి చేసి కేసు ట్రయల్‌ను ప్రారంభించే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. పుష్ప-2 వివాదం: ఊహాజనిత వార్తలు, డిబేట్లపై కోర్టు మధ్యంతర ఆదేశాలు సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో హైదరాబాద్ నగర సివిల్ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో వాస్తవ నిర్ధారణకు ముందే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఊహాజనిత వార్తలు, అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, డిబేట్లు, వార్తా కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు ప్రచురించరాదని కోర్టు స్పష్టం చేసింది. సంధ్య థియేటర్‌కు సంబంధించిన O.S. No.216 of 2026లో I.A. No.369 of 2026 పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ నగర సివిల్ కోర్టు గౌరవ వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి జూన్ 4, 2026న Ad-Interim Ex Parte Injunction ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం కేసుకు సంబంధించిన అంశాలపై తుది విచారణ పూర్తయ్యే వరకు నిర్ధారణ కాని ఆరోపణలు, ఊహాగానాలు లేదా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేయరాదని స్పష్టం చేసింది. అలాగే మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా వేదికలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కోర్టు ఆదేశాలను గౌరవించాలని సూచించింది. ఈ ఉత్తర్వులు కేసులో తుది తీర్పు వెలువడే వరకు అమల్లో ఉంటాయని, కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని న్యాయస్థానం పేర్కొంది.

Publish Date: Jun 19, 2026 2:53PM

political-news-img

రిలేషన్ లో ఉన్న అమ్మాయిలు చేసే  అతిపెద్ద తప్పులు.. వీటి వల్లే చాలా బాధపడతారు!

ప్రేమ, సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది. రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని, తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం, పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు. అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం, పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి. ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు. తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు. ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు. సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును, తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు. ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా భాగస్వామిపై ఆధారపడటం తప్పు. ఈ అలవాటు భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎవరి కోసమూ అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం, చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది. *రూపశ్రీ.

Publish Date: Jun 19, 2026 2:42PM

political-news-img

ఎప్పుడూ ఏదో ఒక స్నాక్స్ తినాలని అనిపిస్తుందా? ఈ హెల్తీ స్నాక్స్ ట్రై చేయండి!

ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా ఖాళీ సమయంలో.. చాలామంది చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు , అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఎంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఆకలిని తీర్చడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎనర్జీగా ఉండటానికి , అతిగా తినడాన్ని నివారించడానికి సహాయపడతాయి. ఎలాంటి చింత లేకుండా ఆహారంలో చేర్చుకోగల కొన్ని ఆరోగ్యకరమైన చిరుతిళ్ల గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు.. వేయించిన శనగలు ఆరోగ్యకరమైన చిరుతిళ్లలో మొదటి స్థానంలో ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు చాలా సేపటి వరకు నిండుగా ఉంటుంది, దీని కారణంగా పదేపదే ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి వేయించిన శనగలు స్నాక్స్ కోసం మంచి ఆప్షన్. అంతేకాకుండా, ఇవి శరీరానికి శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి. మఖానా.. మఖానా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన చిరుతిండి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మఖానాలో కాల్షియం, మెగ్నీషియం , యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు లభిస్తాయి. లేతగా వేయించిన మఖానా తినడం వల్ల ఆకలిని నియంత్రించుకోవచ్చు , అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి , బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా చాలా మంచిది. తాజా పండ్లు.. పండ్లు సహజంగానే పోషకాల నిధి. ఆపిల్, అరటిపండు, జామ, బొప్పాయి , నారింజ వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతాయి. పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది , శరీరం చాలా సేపటి వరకు తాజాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్.. బాదం, వాల్‌నట్స్, పిస్తా , జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ , అనేక విటమిన్లు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం శరీరానికి శక్తిని అందించి, ఆకలిని కూడా నియంత్రిస్తుంది. వాల్‌నట్‌లు , బాదం పప్పులు ముఖ్యంగా మెదడు , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని చిరుతిండిగా తినడం ద్వారా జంక్ ఫుడ్ తినే అలవాటును తగ్గించుకోవచ్చు. మొలకలు.. మొలకెత్తిన పెసలు, శనగలు , ఇతర పప్పుధాన్యాలలో ప్రోటీన్, పీచుపదార్థం , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత వాటిలోని పోషకాల పరిమాణం పెరగడం వల్ల అవి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. మొలకలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది , కండరాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. శరీరం ఫిట్ గా ఉండాలని అనుకునే వారికి మొలకలు చాలా మంచివి. వేరుశనగలు.. వేరుశెనగలను పేదల బాదం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేరుశెనగలను పరిమితంగా తినడం వల్ల ఆకలి తగ్గి, శరీరానికి ఎక్కువసేపు శక్తి లభిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి , శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. *రూపశ్రీ.

Publish Date: Jun 19, 2026 2:39PM

MOVIE NEWS