political-news-img

మళ్లీ కవ్వింపులకు దిగుతున్న పాక్.. భారత్ తో యుద్దానికైనా సై అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

దేశంలో అంతర్గత కలహాలు, ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరడంతో పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో పడింది. ఈ సమస్యల నుంచి, సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. దేశంలో సంక్షోభాలు తీవ్ర స్థాయికి చేరిన ప్రతి సారీ పాకిస్థాన్ కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి పబ్బం గడుపుకునేది. అయితే ఈ సారి ఆ పప్పులు కూడా ఉడకకపోవడంతో.. సింధు జలాల వివాదాన్ని శరణు జొచ్చింది. సింధు జలాల వివాదాన్ని రాజకీయం చేస్తూ యుద్ధ నాటకానికి తెరలేపింది. సింధు నదీ జలాల విషయంలో తమ దేశ ప్రయోజనాలకు, నీటి ప్రవాహానికి ఏమాత్రం ముప్పు వాటిల్లుతోందని భావించినా భారత్‌తో యుద్ధానికైనా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. నీటి హక్కులు తమ జాతీయ భద్రతలో ఒక భాగమని, అవసరమైతే సైనిక చర్యకు దిగే అవకాశాన్ని తాము కొట్టిపారేయలేమని చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పాకిస్థాన్‌ మీడియా సంస్థ ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగమే యుద్ధ వ్యాఖ్లు అంటూ అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే వరకు దాయాది దేశంతో ఎటువంటి చర్చలు ఉండవన్న ఇండియా వైఖరి స్పష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ రక్షణ మంత్రి నుంచి యుద్ధం మాట రావడం అంతిమంగా ఆదేశానికే నష్టం చేకూరుస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల భారత జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోనే ఉంటూ, భారత భూభాగంలో లభించే జల వనరులను మరియు దేశానికి చట్టబద్ధంగా దక్కాల్సిన నీటి హక్కులను పూర్తిగా వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తామని స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాక్ రక్షణ మంత్రి భారత్ తో యుద్ధానికైనా సరే అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదంపై వైఖరిని మార్చుకోకుండా.. ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగితే మరోసారి భంగపాటుకు గురికాక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Jun 22, 2026 10:07AM

political-news-img

ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో భారీ విస్ఫోటనం.. 18 మంది కార్మికులు గల్లంతు

ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన కేంద్రం అయిన ఖతార్‌ లోని గ్యాస్ ప్లాంట్ లో భారీ విస్ఫోటనం సంభవించింది. పారిశ్రామిక రంగానికి అత్యంత కీలకమైన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ’లో ఆదివారం రాత్రి (జూన్ 21) చోటుచేసుకున్న ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. అక్కడి బర్జాన్ గ్యాస్ సరఫరా ప్లాంట్‌లో ఆపరేషన్లను, అంతర్జాతీయ ఎగుమతులను తిరిగి ప్రారంభించడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 60 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ లోపల విధులు నిర్వహిస్తున్న మరో 18 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. గతంలో ప్రాంతీయంగా నెలకొన్న తీవ్ర రాజకీయ, సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ జరిపిన మిసైల్ దాడుల వల్ల ఈ ప్లాంట్ చాలా తీవ్రంగా దెబ్బతింది. ఆ దాడుల కారణంగా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయి, వారాల తరబడి ఈ ప్లాంట్‌ మూతపడింది. ఆ నష్టాన్ని ఎలాగైనా పూడ్చుకోవాలని, ఇంధన ఉత్పత్తిని మళ్లీ గరిష్ఠ స్థాయికి చేర్చాలని ఇంజనీర్లు రాత్రింబవళ్లు శ్రమించి, ప్లాంట్‌ను పునఃప్రారంభించేందుకు తుది ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం ఖతార్ అంతర్జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ గ్రూప్ గల్లంతైన ఆ 18 మంది కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు ప్లాంట్ శిథిలాల మధ్య అత్యంత ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోంది. గ్లోబల్ ఎల్‌ఎన్‌జీ ఎగుమతులకు కేంద్ర బిందువైన రాస్ లఫాన్ హబ్‌లో ఈ ప్రమాదం జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.

Publish Date: Jun 22, 2026 9:51AM

political-news-img

శాంతి చర్చల నుంచి ఇరాన్ వాకౌట్.. ట్రంప్ ట్వీట్ కారణం!

అమెరికా, ఇరాన్ శాంతి చర్చలలో మళ్లీ ప్రతిష్ఠంభన నెలకొంది. స్విట్జర్ ల్యాండ్ లోని లూసర్న్ సరస్సు సమీపంలో ఉన్న బర్గెన్‌స్టాక్ రిసార్ట్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఆదివారం (జూన్ 21) జరిగిన శాంతి చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. ఈ చర్చల మధ్యలో ఇరాన్ వాకౌట్ చేసింది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా శాంతి ఒప్పందంపై సంతకాలు లక్ష్యంగా జరుగుతున్న ఈ చర్చల సెషన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒకే ఒక్క పోస్ట్ భగ్నం చేసింది. చర్చల ప్రక్రియ సాగుతుండగానే ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి అత్యంత కఠినమైన సైనిక హెచ్చరికలు జారీ చేస్తూ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుకు నిరసనగా ఇరాన్ చర్చల నుంచి వాకౌట్ చేసింది. లెబనాన్‌లోని హిజ్బుల్లా వంటి తమ మిత్రపక్ష సాయుధ గ్రూపులను ఇరాన్ వెంటనే నియంత్రించకపోతే, ఆ దేశంపై మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన బాంబు దాడులు, సైనిక చర్యలు తప్పవంటూ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చర్చల హాల్‌లోకి చేరడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ట్రంప్ చేసిన తీవ్రమైన బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ అధికారిక ప్రతినిధి బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ నేతృత్వంలోని తమ బృందం ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. ఒకవైపు అత్యున్నత స్థాయి శాంతి చర్చలు జరుపుతూ.. మరోవైపు ఇలాంటి బెదిరింపులకు దిగడం అంతర్జాతీయ దౌత్య నీతికి పూర్తి విరుద్ధని పేర్కొంటూ.. ఇరాన్ ప్రతినిధులు చర్చల హాల్ నుంచి వాకౌట్ చేశారు. అయితే.. ఖతార్, పాకిస్థాన్ దేశాల దౌత్యవేత్తలు ముమ్మరంగా రాయబారాలు నడిపి ఎట్టకేలకు ఇరాన్ ప్రతినిధులు, తిరిగి చర్చల టేబుల్ ముందుకు వచ్చేలా చేశాయి. దీంతో ఆదివారం (జూన్ 21)రాత్రి తిరిగి చర్చలు ప్రారంభమై సోమవారం (జూన్ 22) తెల్లవారుజాము వరకు కొనసాగాయి. అమెరికా తరఫున ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడి ప్రత్యేక దూతలు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్‌లతో కూడిన అత్యున్నత స్థాయి బృందం ఈ చర్చల్లో పాల్గొంది.

Publish Date: Jun 22, 2026 9:39AM

political-news-img

భార్యా పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో ఓ కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఇది. చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దామోదర్ అనే వ్యక్తి భార్య నిర్మల కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆమె అనుభవిస్తున్న బాధను నిరంతరం గమనిస్తున్న దామోదర్ తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యాడు. భార్య అనారోగ్యంపై బెంగ పెట్టుకున్న ఆయన, తాము లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే ఆందోళనతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. భార్య నిర్మలకు, కన్నబిడ్డలైన 8వ తరగతి చదువుతున్న కుమారుడు దిలీప్, 6వ తరగతి చదువుతున్న కుమార్తె శ్రీవిద్యలకు ఆహారంలో విషం కలిపి ఇచ్చాడు. వారు ముగ్గురూ ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించుకున్న తర్వాత, తానూ కూడా ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు దామోదర్ రాసిన ఒక సూసైడ్ నోట్ లో తమ మరణానికి ఎవరూ బాధ్యులు కారనీ.. భార్య అనారోగ్య బాధలను భరించలేకే తాము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నామని పేర్కొన్నాడు. అంతేకాకుండా, తాము చనిపోయిన తర్వాత తమ అంత్యక్రియల నిర్వహణ ఖర్చుల కోసం తమ ఏటీఎం కార్డుల్లో తగినంత నగదు ఉందని, ఆ డబ్బులను డ్రా చేసుకుని అంతిమ సంస్కారాలు జరిపించాలని ఆ లేఖలో ప్రత్యేకంగా అభ్యర్థించాడు.

Publish Date: Jun 22, 2026 9:08AM

political-news-img

మీర్ పేట్ లో పేలుడు.. ఒకరి మృతి

హైదరాబాద్‌ భారీ పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేట్‌లోని ఓ గోడౌన్ లో ఆదివారం (జూన్ 21) జరిగింది. మృతుడిని పశ్చిమ బెంగాల్ కు చెందన అనూప్ ప్రధాన్ గా గుర్తించారు. కొద్ది రోజుల కిందట కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బతుకు తెరువు కోసం వలస వచ్చినట్లు తెలుస్తోంది. గోడౌన్‌లో నిల్వ ఉంచిన పెయింట్లు, రసాయనాల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి అనూప్ ప్రధాన్ శరీనం ఛిత్రమై శరీర భాగాలు పది మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి. ఈ ఘటనలో గోడౌన్ యజమాని నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించాయి. నిపుణుల నివేదిక అందిన తర్వాతే పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం సంభవించలేదని, ఇతర వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.

Publish Date: Jun 22, 2026 8:49AM

political-news-img

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు : సీఎం చంద్రబాబు

ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ‘ప్రోగెస్ రిపోర్ట్ 2024-26’ పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులను ఆదేశించారు. 2024లో అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేత పత్రాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులా ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలన్నారు. 7 శ్వేత పత్రాలతో పాటు... మరో 3 ముఖ్యమైన అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రొగ్రెస్ రిపోర్టుల విడుదలపై మంత్రులు, అధికారులతో క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సమీక్షించారు. రెండేళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి శ్వేత పత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని రెండేళ్లలో వికాసం వైపు ఎలా తీసుకెళ్లింది... రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించింది... వంటి అంశాలను తాజా ప్రోగ్రెస్ రిపోర్టులో పొందుపరచాలని ముఖ్యమంత్రి చెప్పారు. రెండేళ్లలో చాలా శాఖల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గవర్నెన్స్‌లో తెచ్చిన సంస్కరణలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టామో చెప్పడంతో పాటు ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టడమే ప్రోగ్రెస్ రిపోర్టుల ఉద్దేశమన్నారు. నాటి 7 శ్వేత అంశాలతో సహా ఈసారి కొత్తగా డెవలప్మెంట్, గవర్నెన్స్, వెల్ఫేర్‌ అంశాలపైనా రిపోర్టులు విడుదల చేయాలని సీఎం స్పష్టం చేశారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం అంశాలతో ‘డెవలప్మెంట్’ ప్రోగ్రెస్ రిపోర్ట్... ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణలతో ‘గుడ్ గవర్నెన్స్’ ప్రోగెస్ రిపోర్ట్... సంక్షేమం, పీ4 వంటి వాటితో ‘వెల్ఫేర్ – ఎంపవర్మెంట్’ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈసారి విడుదల చేయనున్నారు. వీటిలో ఫైనాన్స్, డెవలప్మెంట్, వెల్ఫేర్, గవర్నెన్స్... ఈ 4 అంశాలకు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టును ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. 6 పేపర్లు మంత్రులు రిలీజ్ చేసిన తర్వాత... మిగిలిన 4 పేపర్లు ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూలై 18కల్లా మొత్తం అన్ని రిపోర్టులు విడుదల చేసేలా ప్రణాళికను సిద్దం చేయాలని సీఎం సూచించారు. ఇవన్నీ విడుదల చేసిన తర్వాత... అన్నీ కలిపి పుస్తక రూపంలో తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రతీ ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టులు తప్పనిసరిగా ఇవ్వాలని ఈ సందర్భంగా చెప్పారు. ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో ముందుగా సోమవారం విద్యుత్ రంగంపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సీఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

Publish Date: Jun 21, 2026 5:23PM

MOVIE NEWS