తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు ...నాలుగు రోజుల పాటు వర్షాలు!

 తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.  తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎండలు దంచికొడుతున్నాయి. అధిక వేడి ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఏదైనా పని ఉండి బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లతో రిలీఫ్ పొందుతున్నారు. ఇక మండుటెండల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ద్రోణి ప్రభావంతో రేపు అనగా మంగళవారం నాడు ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, అల్లూరి, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తక్కిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడిమి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనం కలుగనున్నది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.మంగళవారం సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల భారీ, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల రాకతో ప్రజలకు మండే ఎండల నుంచి రిలీఫ్ కలుగనున్నది.
Publish Date: May 7, 2024 5:20PM

తప్పులు చేయడం.. చంద్రబాబుపై నెపం వేయడం.. జనం నమ్మేస్తారా జగన్?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎస్పీలపై బదిలీ వేటు వేసిన ఈసీ తాజాగా డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిపై కూడా   బదిలీ వేటు వేసింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై సైతం బదిలీ వేటు పడింది. వీరి స్థానంలో కొత్తవారికి ఈసీ బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల సమయంలో తమకు మేలు చేస్తారని భావించిన అధికారులు ఒక్కొక్కరిపై బదిలీ వేటు పడుతుండటంతో జగన్ తో పాటు ఆయన శిబిరంలో భయం మొదలైంది. దీంతో జగన్ మోహన్ రెడ్డి విపక్షాలపై ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదని తనలోని ఓటమి భయాన్ని జగన్ బయట పెట్టారు. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీకి కార్యకర్తల్లా పనిచేసే అధికారులతో విపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ మోహన్ రెడ్డికి ఈసీ నిర్ణయాలు మింగుడు పడటం లేదు. దీంతో తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ప్రజల ముందు ఏడుపు మోహం పెట్టి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలను జగన్ షురూ చేశారు. ఎన్నికల నియమావళిలో భాగంగా ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు జగన్ మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాల అమలుపై ఈసీ ఆంక్షలు విధించడం సర్వసాధారణం. కోడ్ అమల్లోకి వచ్చేలోపే అధికార పార్టీలు ప్రభుత్వ పథకాల ఫలాలను లబ్ధిదారులకు చేరవేస్తుంటాయి. కానీ జగన్ మోహన్ ప్రభుత్వం కావాలనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఆన్ గోయింగ్ స్కీంలు అంటూ పలు పథకాల డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసేందుకు ప్రయత్నాలు చేసింది. వీటికి ఈసీ అడ్డుకట్ట వేసింది. ప్రభుత్వ పథకాల  నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బు జమ చేయొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు నాయుడుపై ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తూ తమ బేల తనాన్ని బయటపెట్టుకుంటున్నారు. పథకాల డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయడం ఆపాలని ఈసీకి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది.  ఆన్ గోయింగ్ పథకాలకు బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లో వెళ్లలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి బటన్ ఎప్పుడు నొక్కాడు.. ఎప్పుడు డబ్బులు వెళ్లలేదనేది ప్రజలకు మాత్రం వైసీపీ నేతలు చెప్పడం లేదు. దీనిలో ఓ మతలబు కూడా ఉంది. అదేమిటంటే ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మార్చి 1వ తేదీన రూ.610 కోట్లకు వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మార్చి 16 వ తేదీన. మార్చి 1వ తేదీన బటన్ నొక్కితే ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు   లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉంది. ఇక్కడ రెండు విధానాలుగా వైసీపీ డ్రామాలను అర్ధం చేసుకోవచ్చు. డబ్బులు లేకపోయినా వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కి లబ్ధిదారులను మోసం చేసింది. అలాకాకుంటే.. డబ్బులు ఉంటే ఉద్దేశపూర్వకంగా అవి లబ్ధిదారుల ఖాతాలలో వేయకుండా  పోలింగ్ కు వారం రోజులు ముందు ఆ  డబ్బులు వేసి  ఓటర్లను ప్రలోభ పెట్టి లబ్ధి పొందాలని చూసింది.  ఇవన్నీ ప్రజలకు తెలియకుండా వైసీపీ అధినేత జగన్, వైసీపీ నేతలు వాళ్లు చేసిన తప్పును చంద్రబాబుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము డబ్బులు వేశాం.. కావాలనే ఈసీకి ఫిర్యాదు చేసి మీకు రావాల్సిన డబ్బులు రాకుండా చంద్రబాబు ఆపించారని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదారిపట్టించి ఓట్లు వేయించుకోవటం జగన్ మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది. గత ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య ఘటనలతో ప్రజల్లో సానుభూతి పొంది, ఆ నెపాలను చంద్రబాబు, ఆయన అనుచరులపైకి నెట్టేసి జగన్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తరువాత జగన్ చెప్పినవన్నీ అబద్ధాలని ప్రజలకు స్పష్టత వచ్చింది. మళ్లీ తాను చేసిన తప్పులన్నీ చంద్రబాబుపైకి నెట్టేసి ప్రజల్లో చంద్రబాబును విలన్ గా చిత్రీకరించాలన్నది వైసీపీ కుట్రగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ అనుకూల అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాలకు కూడా విలువ నివ్వకుండా పింఛన్ల పంపిణీని క్లిష్టతరం చేశారు. తద్వారా పలువురు  వృద్ధులు ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యారు. పెన్షన్లు పంపిణీ చేయడంలో అధికారులు వైఫల్యాన్ని సైతం  చంద్రబాబుపైకి నెట్టే ప్రయత్నం జగన్ చేశారు. తాజాగా వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను గుర్తించి ఈసీ బదిలీ వేటు వేస్తుంటే వారి బదిలీ చంద్రబాబు కుట్రలో భాగమని జగన్ చెబుతుండటం గమనార్హం. తాజాగా ఇన్ ఫుట్ సబ్సిడీ, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల పంపిణీ నిలిపివేతలోనూ ఈసీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని జగన్ అండ్ వైసీపీ నేతలు, ఆ నెపాన్ని సైతం చంద్రబాబుపై నెట్టి ఎన్నికల్లో పబ్బంగడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పులు చేసేది జగన్.. ఆ నెపాన్ని చంద్రబాబుపైకి నెట్టడం జగన్ మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది. అయితే, గత  ఎన్నికల్లో జగన్ కుట్రలను తెలుసుకోలేక మోసపోయిన ప్రజలు.. ఈసారి జగన్ కుట్రలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఓటు ద్వారా బుద్ది చెప్పేందుకు సిద్ధమయ్యారు.
Publish Date: May 7, 2024 4:56PM

వెండి తెరపై ఝాన్సీరాణి.. రాజకీయ రణంలో విదూషకమణి!

కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా  ఆమె నటనకు ప్రతి సందర్భంలోనూ నూటికి నూరు మార్కులు పడ్డాయి. సినీ రంగం నుంచి ఆమె రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అయితే సినిమాలలో బ్రహ్మాండమైన గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ కు రాజకీయ రంగంలోనూ గుర్తింపు వచ్చింది. సినిమా రంగంలో ఆమె ఝాన్సీ లక్ష్మీబాయ్ లా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్ర వేస్తే రాజకీయ రంగంలో అందుకు భిన్నంగా ఒక విదూషక మణిగా జనం దృష్టిలో నవ్వుల పాలయ్యారు. అవగాహనా రాహిత్యం, తెలియని విషయాలపై కూడా సమగ్ర పరిజ్ణానం ఉన్నదన్నట్లు చేస్తున్న ప్రసంగాలూ ఆమెను ప్రజల దృష్టిలో నవ్వుల పాలు చేస్తున్నాయి.  ఏదో సినిమాలో లాయర్ తన వాగ్ధాటి నంతా ప్రయోగించి సొంత క్లయింట్ కు శిక్ష పడేలా చేసిన విధంగా కంగనా రనౌత్ తన ప్రసంగాలలో సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించేస్తున్నారు.  తెలుగు రాష్ట్రాలలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రసంగాలకు ఎలాగైతే అభిమానులు ఉన్నారో.. ఉత్తరాదిలో అలాగే కంగనా రనౌత్ ప్రసంగాలంటే చెవి కోసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభిమానులూ తయారయ్యారు. అయితే ఆమె ప్రసంగాలు విని ఆమె రాజకీయ పరిజ్ణానానికి ముగ్ధలై వారు ఆమెకు అభిమానులుగా మారలేదు. ఆమె అజ్ణానంతో చేస్తున్న తప్పుల తడకల ప్రసంగం విని పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుని ఆమె కు అభిమానులుగా మారిపోయారు. తెలుగు రాష్ట్రాలలో పాల్ ను కూడా జనం ఆయన వినోదం పంచే తీరుతోనే అభిమానులుగా మారిపోయారన్నమాట. సర్కస్ లో జోకర్ ను చూసి ఎంతలా నవ్వు వస్తుందో రాజకీయాలలో కంగనా రనౌత్ ప్రసంగాలు విన్న వారికి అంతకు మించి నవ్వు వస్తుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యకు మద్దతుగా ప్రచారం చేసిన ఆమె పొరపాటున బీజేపీ అభ్యర్థిపైనే విమర్శల వర్షం కురిపించేశారు. సొంత పార్టీ అభ్యర్థి పేరు తేజస్వి సూర్య అయితే.. ఆమె పొరపాటుగా ఆర్జేడీ నేత తేజస్వి ప్రసాద్ గా భావించి విమర్శల వర్షం కురిపించేశారు. స్వయంగా తాను నవ్వుల పాలు కావడమే కాకుండా సొంత పార్టీ బీజేపీనీ, ఆ పార్టీ అభ్యర్థి తేజస్వి సూర్యనూ నవ్వుల పాలు చేసేశారు.  బీజేపీ కంగనా రనౌత్ ను పార్టీలో చేర్చుకుని పార్టీ టికెట్ ఇచ్చిన నాటి నుంచి ఆమె కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. తప్పుల తడకలతో సాగే ఆమె ప్రసంగాలు జనాలను నవ్విస్తూనే ఉన్నాయి. ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేసే నియోజకవర్గం ఎన్నిక చివరి దశలో అంటే ఏడవ దశలో జూన్ 1న జరగనుంది.  
Publish Date: May 7, 2024 3:14PM

పోస్టల్ బ్యాలెట్ కు ఈ నెల 9 వరకు గడువు 

 సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు  రోజులు  మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం  ఉంది. దీన్ని   ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు ఆపేయాలని ఎన్నికల సంఘం చెప్పలేదని అన్నారు. కొంతకాలం తర్వాత ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసిందని వివరించారు.  ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. మొత్తం 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్లలో 3.30 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లు వినియోగించారని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. కొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందని, సెక్యూరిటీ విధులకు వెళ్లిన వారికి ఈ నెల 9 వరకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సొంత సెగ్మెంట్లలోని ఫెసిలిటేషన్ సెంటర్లలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చని స్పష్టత నిచ్చారు.  ఒంగోలులో కొందరు ఉద్యోగులు ప్రలోభాలకు గురైనట్టు గుర్తించామని, కొందరు తమకు ఆఫర్ చేసిన మొత్తాన్ని తిప్పి పంపారన్న విషయం కూడా వెల్లడైందని వివరించారు. ఒంగోలులో ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపుతున్న వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు.  పోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబుల్  ను సస్పెండ్ చేశామని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. పల్నాడులో హోలోగ్రామ్ ద్వారా కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, పల్నాడు ఘటనపైనా విచారణ చేపడుతున్నామని చెప్పారు. చిన్న మొత్తం కోసం ఆశపడితే ఉద్యోగానికే ప్రమాదం అని హెచ్చరించారు. డబ్బులు తీసుకున్న ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.
Publish Date: May 7, 2024 2:48PM

తెల్లోడి పెత్తనంపై తెలుగు తేజం తిరుగుబావుటా అల్లూరి సీతారామరాజు

భారత స్వాతంత్ర్య  సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి  భరతమాత దాస్యశృంఖలాల  విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు.  సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం  వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు. పరిమిత వనరులతో   సూర్యుడస్తమించని బ్రిటీషు సామ్రాజ్య పునాదులనే కదిలించేసిన మహావీరుడు.  తాను మరణించినా వేలాది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారన్న నమ్మికతో ప్రాణాలు అర్పించి చరిత్రలో అమరుడిగా మిగిలాడు. అటువంటి అల్లూరి సీతారామరాజు వర్ధంతి నేడు.  తూర్పు గోదావరి జిల్లాలోపాండ్రంగి జన్మించిన అల్లూరి సీతారామరాజు  ఆరేళ్ల వయస్సు నుంచేే చుట్టుపక్కల  కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవీ పేట మొదలైన ప్రాంతాల్లో తిరుగుతూ జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. సాహిత్యం బాగా చదివేవాడు. చిన్నప్పటినుండి సీతారామరాజులో ఉన్న నాయకత్వ లక్షణాలు, సామాజిక అంశాలపై అవగాహన అనేక ప్రాంతాలు తిరిగేలా చేసింది. 1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద కొంతకాలం ఉన్నాడు.  లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్ మొదలైన ప్రదేశాలు చూసి తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. దేశంలో మారుతున్న పరిస్థితులు ఆయనను స్థిరంగా ఉండనియ్యలేదు. 1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి బస్తర్, నాసిక్, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి ఇంటికి చేరాడు. ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని ప్రోది చేసి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు అల్లూరి సీతారామరాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేశాడు.  పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. ఆయుధ సంపత్తి పెంచుకోవడం కోసం అనేక పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామమునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు. మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ వచ్చాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని ప్రకటించాడు. రాజు ఆచూకీ కోసం మన్యం ప్రజలను నానా హింసలకు గురచేశాడు. ప్రజలు పడుతున్న బాధలను చూసి చలించిపోయిన సీతారామరాజు లొంగిపోవాలని నిశ్చయించుకుని తన ప్రాణాలనుభారతమాత విముక్తి కోసం తృణప్రాయంగా అర్పించాడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.  1924 మే 7న  అల్లూరి సీతారామరాజు మరణించాడు.  సీతారామరాజు మరణం దేశవ్యాప్తంగా  సంచలనం సృష్టించింది. ఆ తర్వాత స్వాతంత్య్ర పోరాటం తీవ్ర రూపం దాల్చి తెల్లవారిని తరిమికొట్టింది. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న స్వతంత్య్రభారతావని చరిత్రపుటల్లో  సీతారామరాజు పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది.   అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా...
Publish Date: May 7, 2024 2:32PM

కూటమికి చిరు మద్దతు.. జగన్ కు మైండ్ బ్లాక్!

కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు.  అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు. అంతకు ముందే తన సోదరుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు. ఇప్పుడు తాజాగా తన సోదరుడు పవన్ కల్యాణ్ కు ఓటు వేసి ఓ నిస్వార్థ సేవకుడిని గెలిపించాలని కోరుతూ పిఠాపురం ప్రజలను ఓ వీడియో ద్వారా కోరారు. ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చేశారు. మరో ఐదు రోజులలో రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కూటమికే రాష్ట్రంలో మొగ్గు కనిపిస్తోందంటూ పలు సర్వేలు తేల్చేశాయి. జగన్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి సభలకు జనం పోటెత్తుతుండటం, మరో వైపు వైసీపీ ప్రచారానికి స్పందన కనిపించకపోవడంతో వైసీపీ శిబిరం డీలా పడింది. ఈ తరుణంలో చిరంజీవి కూటమికి మద్దతు పలికడం కచ్చితంగా వైసీపీకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారుతుందనడంలో సందేహం లేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు రానున్న రెండు మూడు రోజులలో చిరంజీవి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అలా కలవడం  అంటే చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ప్రకటించినట్లేనని భావించాల్సి ఉంటుంది.  ఇక తాజాగా జనసేనానికి మద్దతుగా అన్నయ్య చిరంజీవి వీడియో సందేశం అందరినీ కదిలిస్తోంది. హృదయాలకు హత్తుకునేలా ఉంది. కుటుంబంలో చివరివాడిగా పుట్టిన పవన్ కల్యాణ్ సమాజానికి మేలు చేయడంలో మాత్రం ముందువాడిగా నిలిచాడని పేర్కొన్నారు.  చిరంజీవి పిలుపు పిఠాపురంలో ఏమూలో వైసీపీకి మిణుక్కు మిణుక్కు మంటున్న గెలుపు ఆశలను ఆవిరి చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చిరంజీవి చంద్రబాబుతో భేటీ అయితే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే జగన్ సహా ఆ పార్టీ నేతలంతా ఓటమి బెంగతో డీలా పడ్డారు.  చిరు ఎంట్రీతో  ఆ పార్టీ అధినేత మరింత దుర్బలంగా మారడం ఖాయమంటున్నారు. ఎందుకంటే చిరంజీవి చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజలలో ఆయనకు ఉన్న గుర్తింపు, గౌరవం మాత్రం చెక్కు చెదరలేదు. ఆయన మద్దతు నిస్సందేహంగా కాపు సామాజికవర్గ ఓటర్లను తెలుగుదేశం కూటమివైపు ఆకర్షిస్తుంది.  సరిగ్గా ఎన్నికల వేళ తెలుగుదేశం కూటమికి చిరు మద్దతుగా రావడం జగన్ కు మింగుడుపడని అంశమే. గతంలో సినిమా టికెట్ల తగ్గింపు చిరంజీవి జగన్ ను కలిసిన సందర్భంలో  ఎదురైన పరాభవానికి సరైన సమయంలో  ఎదురైన పరాభవానికి చిరంజీవి సరైన సమయంలో దీటైన బదులిచ్చినట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: May 7, 2024 2:06PM