కూటమికి చిరు మద్దతు.. జగన్ కు మైండ్ బ్లాక్!

కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు.  అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు. అంతకు ముందే తన సోదరుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు. ఇప్పుడు తాజాగా తన సోదరుడు పవన్ కల్యాణ్ కు ఓటు వేసి ఓ నిస్వార్థ సేవకుడిని గెలిపించాలని కోరుతూ పిఠాపురం ప్రజలను ఓ వీడియో ద్వారా కోరారు. ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చేశారు. మరో ఐదు రోజులలో రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కూటమికే రాష్ట్రంలో మొగ్గు కనిపిస్తోందంటూ పలు సర్వేలు తేల్చేశాయి. జగన్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి సభలకు జనం పోటెత్తుతుండటం, మరో వైపు వైసీపీ ప్రచారానికి స్పందన కనిపించకపోవడంతో వైసీపీ శిబిరం డీలా పడింది. ఈ తరుణంలో చిరంజీవి కూటమికి మద్దతు పలికడం కచ్చితంగా వైసీపీకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారుతుందనడంలో సందేహం లేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు రానున్న రెండు మూడు రోజులలో చిరంజీవి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అలా కలవడం  అంటే చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ప్రకటించినట్లేనని భావించాల్సి ఉంటుంది.  ఇక తాజాగా జనసేనానికి మద్దతుగా అన్నయ్య చిరంజీవి వీడియో సందేశం అందరినీ కదిలిస్తోంది. హృదయాలకు హత్తుకునేలా ఉంది. కుటుంబంలో చివరివాడిగా పుట్టిన పవన్ కల్యాణ్ సమాజానికి మేలు చేయడంలో మాత్రం ముందువాడిగా నిలిచాడని పేర్కొన్నారు.  చిరంజీవి పిలుపు పిఠాపురంలో ఏమూలో వైసీపీకి మిణుక్కు మిణుక్కు మంటున్న గెలుపు ఆశలను ఆవిరి చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చిరంజీవి చంద్రబాబుతో భేటీ అయితే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే జగన్ సహా ఆ పార్టీ నేతలంతా ఓటమి బెంగతో డీలా పడ్డారు.  చిరు ఎంట్రీతో  ఆ పార్టీ అధినేత మరింత దుర్బలంగా మారడం ఖాయమంటున్నారు. ఎందుకంటే చిరంజీవి చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజలలో ఆయనకు ఉన్న గుర్తింపు, గౌరవం మాత్రం చెక్కు చెదరలేదు. ఆయన మద్దతు నిస్సందేహంగా కాపు సామాజికవర్గ ఓటర్లను తెలుగుదేశం కూటమివైపు ఆకర్షిస్తుంది.  సరిగ్గా ఎన్నికల వేళ తెలుగుదేశం కూటమికి చిరు మద్దతుగా రావడం జగన్ కు మింగుడుపడని అంశమే. గతంలో సినిమా టికెట్ల తగ్గింపు చిరంజీవి జగన్ ను కలిసిన సందర్భంలో  ఎదురైన పరాభవానికి సరైన సమయంలో  ఎదురైన పరాభవానికి చిరంజీవి సరైన సమయంలో దీటైన బదులిచ్చినట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: May 7, 2024 2:06PM

ఆ ఎమ్మెల్యే మాకు వద్దే.. వద్దు..! కాకరేపుతున్న సూళ్లురుపేట రాజకీయం!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం సూళ్లురుపేట.  తమిళనాడు,  ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వుండే ఈ సెగ్మెంట్‌లో రెండు ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలు  వుంటాయి.  భారత అంతరిక్ష పరిశోధనా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్  ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో వున్న సూళ్లూరుపేట,  జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. సూళ్లూరుపేట నియోజకవర్గం మొదటిలో కాంగ్రెస్‌కు ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 5 సార్లు  మరియు వైసీపీ రెండు సార్లు గెలిచాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కిలివేటి సంజీవయ్య టీడీపీ అభ్యర్ధి పారాస వెంకట రత్నంపై 61,292 ఓట్ల భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే సూళ్లూరుపేట వైసీపీలో అంత‌ర్గ‌త విభేధాలు ఆ పార్టీకి త‌ల‌నొప్పిగా మారాయి. ప్ర‌స్తుత ఎమ్మెల్యే , వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య సమక్షంలోనే వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం గొడ‌వ ప‌డుతూనే వున్నారు. వర్గ విభేదాలు,  వీధి కొట్లాటలతో వైసీపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది.  స్థానిక ప్ర‌జ‌లు తాగునీటి సమస్యతో బాధ‌ప‌డుతున్నారు. జగన్ పరిపాలనలో మంచినీటి సమస్య తీరలేదని ప్రజలు వాపోతున్నారు.  పట్టణవాసులైతే డ్రైనేజీ సమస్యలతో అల్లాడుతున్నారు. డ్రైవర్ కాలనీ అంతా డ్రైనేజీ కాలనీగా మారిపోయింది. డ్రైనేజీ కోసం కాలువ తవ్వి ఐదేళ్లుగా అలా వదిలేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మురుగు కాల్వల నుంచి కాపాడమని ప్రజలు వేడుకుంటున్నారు.  ఐదేళ్ల క్రితం కాలువ కడతామని అక్కడ తవ్వి వదిలేశారు. అది అలాగే ఉండిపోయింది. ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. డంపింగ్ యార్డు ఒకటి ఊరికి దరిద్రంగా మారింది. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ జాతీయ రహదారి పక్కనే వేసేస్తున్నారు. 15 ఏళ్లుగా డంపింగ్ యార్డు దుర్గంధంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆ దుర్వాసన ఊరంతా వ్యాపిస్తూ ఉంటుంది. వర్షాకాలమైతే చెప్పలేం. దీని కారణంగా అంటు రోగాలు వ్యాపిస్తున్నాయని అంటున్నారు.  దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో,  ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  మ‌రో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీనిలో భాగంగా  విజయశ్రీకి సూళ్లూరుపేట టికెట్ ను కేటాయించారు. అభ్య‌ర్థి త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించ‌డానికి ప్ర‌త్యేకంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల ను టీడీపీ అధిష్టానం పంపింది. సూళ్లూరు పేట‌, ఎస్సీ రిజర్వ్‌డ్ సీటు కావ‌డంతో,  శ్రీల‌క్ష్మీ శ్యామ‌ల‌కు ప్ర‌త్యేకంగా ప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించారు. విజయశ్రీ గెలుపే ల‌క్ష్యంగా శ్యామ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.  టీడీపీ కూటమి  హామీల్ని ప్రజలలోకి తీసుకెళ్ళుందుకు ఆమె గట్టిగా ప్రయత్నిస్తున్నారు.  ఏపీలో వైసీపీ కథ ముగుస్తుందంటూ,  వైసీపీ ఐదేళ్ల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, మే 13న తమ తీర్పు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారని ఆమె చెబుతున్నారు.  కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.   చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరమన్నారు.  అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్ చంద్రబాబు అని  విజయశ్రీ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.  నియోజకవర్గంలో జగన్ పాలనపై వున్న తీవ్ర వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆమె చెబుతున్నారు.   అధికార వైసీపీ ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత ఐదేళ్లుగా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఒకవైపున శ్రీహరికోట, మరోవైపు పారిశ్రామిక వాడ శ్రీ సిటీ అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో అన్నచందంగానే సూళ్లూరు పేట మారింది. సూళ్లూరుపేటలో వరుసగా రెండు సార్లు  గెలిచిన కిలివేటి సంజీవయ్య పరిస్థితి కూడా నియోజకవర్గంలో అంత ఆశాజనకంగా లేదు. తనకి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య నలిగిపోతున్నారు.  నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 31 వేల 638 మంది ఉన్నారు. మహిళలు 1 లక్షా 17 వేల 850 మంది ఉంటే, పురుషులు 1 లక్షా 13 వేల 736 మంది ఉన్నారు.  నియోజకవర్గంలో ఎస్సీలు అధికంగా ఉంటారు, తర్వాత బీసీలు, ఆ తర్వాత ఓసీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికి రెడ్ల పెత్తనం ఎక్కువ. గెలిచిన ఎమ్మెల్యేలు వారి కనుసన్నల్లోనే ఉంటారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌ 
Publish Date: May 7, 2024 1:15PM

జనసేనానికి నేచురల్ స్టార్ నాని మద్దతు

నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే నటుడు, రచయత అయిన పోసాని కృష్ణ మురళి వైసీపీ తరఫున మీడియా సమావేశాలలో మాట్లాడుతున్నారు. వైసీపీలోనే ఉన్న కమేడియన్ అలీ మాత్రం అసలు ప్రచారం వైపు చూసిన దాఖలాలు లేవు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగా హీరోలతో పాటు బుల్లి తెర నటులు ఆది, సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ వంటి వారు ప్రచారం చేస్తున్నారు. అంతకు మించి సినీ పరిశ్రమ  నుంచి పెద్దగా ఎవరూ బయటకు వచ్చినట్లు కనిపించదు. అయితే ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చిన తరుణంలో ఒక్కరొక్కరుగా సినీ ప్రముఖులు బయటకు వచ్చి తమ మొగ్గు ఎవరివైపో చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి తన సోదరుడికి ఓటేయాలంటూ పిఠాపురం ప్రజలకు వీడియో ద్వారా పిలుపునిచ్చారు. అలాగే అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు ఓటేయాలంటూ కోరారు. తాజాగా  పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతుగా నేజురల్ స్టార్  నాని  రంగంలోకి దిగాడు. సోషల్ మీడియా వేదికగా జనసేనానికి మద్దతు ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఎదుర్కోబోయే పెద్ద రాజకీయ యుద్ధంలో విజయం సాధించాలని కోరుతూ ట్వీట్ చేశారు. మీరు కోరుకున్నది సాధించి, మీ వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు. సినిమా కుటుంబ  సభ్యుడిగా పవన్ కల్యాణ్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ ట్వీట్ లో నాని పేర్కొన్నారు.   గతంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను బాగా తగ్గించిన జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా నాని  తన స్వరం వినిపించాడు. రాజకీయాల్లో లేనప్పటికీ ధైర్యంగా టికెట్ ధరల అంశంపై స్పందించిన నానికి.. అప్పట్లో పవన్ అండగా నిలిచాడు. ఇప్పుడు ఎన్నికల వేళ జనసేనాని కి నాని మద్దతు పలకడం పట్ల  పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Publish Date: May 7, 2024 1:04PM

ఖర్మకాలి జగనొస్తే... సాంగ్ వైరల్...

మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో అనే ఆలోచనలో వుండే ప్రమాదం వుంది. అలాంటి వారిలో చైతన్యం కలిగించే ఉద్దేశంతో తెలుగువన్ రూపొందించిన ‘ఖర్మకాలి జగనొస్తే’ సాంగ్ వైరల్ అవుతోంది. అంధుడైనప్పటికీ మాధవ్ ఈ పాటను అద్భుతంగా పాడారు.. ఆంధ్రప్రదేశ్‌లో వున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా లిరిక్స్ వున్నాయి. ఆ లిరిక్స్.లో వున్న అర్థాన్ని ట్యూన్ బాగా ఎలివేట్ చేస్తే, మాధవ్ గొంతులో వున్న మాధుర్యం పాటను శిఖరాగ్రాలకు తీసుకెళ్ళింది. రాజకీయ విశ్లేషకుడు సువేరా కాన్సెప్ట్, లిరిక్, ట్యూన్ అందించిన ఈ పాటను తెలుగువన్ అధినేత రవిశంకర్ కంటంనేని తెలుగు ప్రజలకు అందించారు. ఖర్మకాలి జగనొస్తే ఏటైతది... ఏటైతది... అనేది మీరూ చూసి తెలుసుకోండి.  
Publish Date: May 7, 2024 12:59PM

డాన్స్ మోడీ డాన్స్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్  చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డాన్స్ చేస్తున్నట్టుగా చాలా వీడియోలు తయారయ్యాయి. ఎన్నికల సందర్భంగా వాటి సంఖ్య మరింత పెరిగింది. వీటిలో కొన్ని వీడియోలు మోడీని కించపరుస్తున్నట్టు వుంటాయిగానీ, చాలావరకు సరదాగా తీసుకునే విధంగానే వుంటాయి. ఈమధ్యకాలంలో మోడీ డాన్స్ ఏఐ వీడియో ఒకటి వైరల్ అయింది. తెలుపు, కాషాయ కాంబినేషన్‌లో డ్రస్ చేసుకుని వున్న మోడీ లక్షలాది మంది జనం ముందు డాన్స్ చేస్తున్నట్టు వుంటుంది. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన మోడీ తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. ఈ వీడియో తాను కూడా చూశానని,  ఎంజాయ్ చేశానని రిప్లయ్ ఇచ్చారు.
Publish Date: May 7, 2024 12:20PM

జగన్ నోట ఓటమి మాట.. భవిష్యత్ దర్శనమేనా?

జగన్ నోట ఓటమి  మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు. మచిలీపట్నంలో ఎన్నికల ర్యాలీలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఓటమి భయానికి నిదర్శనంగా రాజకీయ పండితులు చెబుతున్నారు. సాధారణంగా అన్ని విధాలుగా ఓటమి తథ్యం అన్న నిర్ధారణకు వచ్చిన తరువాతే రాజకీయ నాయకుల నుంచి ఇటువంటి బలహీనమైన వ్యాఖ్యలు చేస్తారని వివరిస్తున్నారు. జగన్ కూడా ఓటమి భయంతో, బెంగతో, బాధతోనే ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటనలను వారు గుర్తు చేస్తున్నారు. అప్పటి ఎన్నికలలో చంద్రబాబు అప్పటి ఎన్నికల సంఘం అధికారి గోపాలకృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్లి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.  ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది.  ఇప్పుడు ఐదేళ్ల తరువాత జగన్ వ్యాఖ్యలు, ప్రకటనలూ చూస్తుంటే జగన్ తన ఓటమిని పోలింగ్ కు ముందే అంగీకరించేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు.  2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తరువాత జగన్ ఇంత బేలగా మాట్లాడటం ఇదే మొదటి సారి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలైన తరువాత కూడా ఆ పరాజయంపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జలే మాట్లాడారు. తమ ఓటర్లు వేరు ఉన్నారని చెప్పారు.   అయితే ఇప్పుడు మాత్రం ఓ ఎన్నికల ర్యాలీలో ఓటమి భయంతో జగన్ మాట్లాడటం చూస్తుంటే ప్రజా వ్యతిరేకతతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని స్పష్టంగా అర్ధమైతోందని పరిశీలకులు అంటున్నారు.  విపక్ష తెలుగుదేశం మేనిఫెస్టోకు ప్రజల నుంచి అద్భుత స్పందన రావడం, అదే సమయంలో తాను విడుదల చేసిన మేనిఫెస్టోను జనం అసలు పట్టించుకోకపోవడం, అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో విపక్షాలు సహేతుకంగా చేస్తున్న విమర్శలు జగన్ లో ఓటమి భయాన్ని కలిగించాయని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం విపక్షాల విమర్శలపై నిర్హేతుకంగా స్పందించి చర్యలు తీసుకోవడం లేదు. పించన్ల పంపిణీ విషయంలో  ఘోరంగా విఫలమైనా సీఎస్ జవహర్ రెడ్డిని ఇప్పటికీ మార్చలేదు. ఆయన జగన్ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి విపక్ష కూటమి నేతలు ఫిర్యాదులు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదు. నాడు అంటే 2019 ఎన్నికల సమయంలో విపక్షంలో ఉన్న వైసీపీ ఇలా ఫిర్యాదు చేయగానే అలా అప్పటి సీఎస్ పునేఠాను తప్పించేసింది. అదే ఎన్నికల సంఘం ఇప్పుడు  ప్రధాని చిలకలూరి పేట సభలో భద్రతా లోపాలు తలెత్తినా డీజపీని వెంటనే మార్చేయలేదు.  ఎన్నికలు వారం రోజులలోకి వచ్చిన తరువాత మాత్రమే తాపీగా డీజీని మార్చి కొత్త డీజీపీని నియమించింది.  అంతే కాదు జగన్ అప్పాయింట్ చేసిన ఇంటెలిజెన్స్ చీఫ్, సీఐడీ చీఫ్ లను ఇప్పటికీ మార్చ లేదు. అయితే 2019 ఎన్నికలకు ముందు మాత్రం అప్పటి విపక్ష నేత జగన్ ఇలా కోరడం తరువాయి అలా అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో కీలక అధికారులందరినీ మార్చేసిన ఎన్నికల సంఘం అన్ని విధాలుగా చంద్రబాబును ఇబ్బందులకు గురి చేసింది.  నాటి పరిస్థితితో పోల్చుకుంటే జగన్ కు ఎన్నికల సంఘం ఇప్పటికీ సానుకూలంగా వ్యవహరిస్తోందనే చెప్పాలి. కానీ ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేయడం, కొందరు అధికారులను మార్చడంతోనే జగన్ వణికిపోతున్నారు. ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్ కు గురౌతున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగే అవకాశం లేదని భయమేస్తోందంటున్నారు. పోలింగ్ కు ముందే ఓటమి ఖరారైపోయిందన్నట్లగా మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్ కు భవిష్యత్ దర్శనం అయిపోయిందా? అన్న అనుమానం కలుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఏది ఏమైనా పార్టీ అధినేతే ఎన్నికల విజయం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో వైసీపీ శ్రేణులు మరింత డీలా పడటం ఖాయమని అంటున్నారు. 
Publish Date: May 7, 2024 11:51AM