విత్తనాల నుంచి పంట కొనుగోళ్ల వరకు ప్రత్యేక ప్రణాళిక : సీఎం రేవంత్ రెడ్డి
రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంటల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట సాగు ప్రారంభమైనప్పటి నుంచే రైతుల వివరాల నమోదు, పంటల రికార్డుల నిర్వహణ, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశపై వ్యవసాయ శాఖకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటివరకు ఎదురైన అనుభవాలు, రైతులు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యలు, రైతు కమిషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నిపుణులు ఇచ్చిన సూచనలను సమావేశంలో చర్చించారు. వచ్చే సీజన్ నుంచే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఉన్నతాధికారుల కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, సివిల్ సప్లయిస్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రణాళిక శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. విత్తనాల పంపిణీ నుంచి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన చర్యలు, జాగ్రత్తలను ఈ కమిటీ నిరంతరం పరిశీలిస్తుంది. ప్రతి గ్రామంలో రైతుల వివరాలు, పంటల విస్తీర్ణం, పంట ఉత్పత్తి అంచనాలను క్షేత్రస్థాయి పరిశీలనతో ఖచ్చితంగా నమోదు చేయాలని సీఎం సూచించారు. కనీస మద్దతు ధరలు, కేంద్రం నిర్దేశించిన కోటాల మేరకు పంటల కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో అకాల వర్షాలు, తూకం, రవాణా, నిల్వ, మార్కెటింగ్ వంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ అందిస్తున్న నేపథ్యంలో ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతు వేదికల ద్వారానే ఈ విత్తనాల పంపిణీ జరగాలని పేర్కొన్నారు. సన్న వడ్లు సాగు చేసే రైతుల పూర్తి డేటాను సేకరించాలని, ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖకు సమగ్ర సమాచారం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రైతు వేదికలను రైతులకు ఉపయోగపడే సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. రైతులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకొని విత్తనాలు, ఎరువులు పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలని, వాటి పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత విధానాలను సమర్థంగా వినియోగించాలని సీఎం సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి విత్తనాల నుంచి కొనుగోళ్ల వరకు మొత్తం వ్యవస్థలో సాంకేతికతను అనుసంధానం చేయాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అమలు చేస్తున్న ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను అధ్యయనం చేసి, రైతులకు ప్రయోజనకరంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు. యాప్ ద్వారా బుక్ చేసిన యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని, ఈ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి నిరంతరం లేఖలు రాయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువుల్లో అత్యధిక వాటా తెలంగాణకు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి వాస్తవ పరిస్థితిని వివరించాలని, అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కోరాలని సూచించారు. మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈసారి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల మొక్కజొన్న కొనుగోళ్లలో నష్టాలను తగ్గించగలిగామని తెలిపారు. గతంలో టన్ను మొక్కజొన్నను రూ.13 వేలకే విక్రయించాల్సి వచ్చేదని, ఈసారి టెండర్లలో టన్నుకు రూ.21 వేలకుపైగా ధర లభించిందని చెప్పారు. ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేసి లాభాల బాటలో నడిపించాలని, ప్రభుత్వ డెయిరీ వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయాలని సూచించారు. పాల రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
Publish Date: Jun 16, 2026 5:35PM