అవినీతి అధికారుల మధ్య లెక్క తేలని వాటాలు,వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు......
Publish Date:Oct 17, 2019
Advertisement
కష్టపడి పని చేసే శ్రామికుల వేతనాలు అధికారుల చేతి వాటం ప్రదర్శించారు. అందినకాడికి దోచుకున్నారు. చివరకు వాటాల్లో తేడా వచ్చే సరికి అక్రమార్కుల బండారం బైటపడింది. అది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిన్న మొన్నటివరకు కేవలం టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో మాత్రమే అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు పారిశుధ్య విభాగానికి కూడా పాకే రోజంతా శ్రమించి పని చేసే కార్మికుల జీతాలను కూడా స్వాహా చేయడం మొదలు పెట్టారు కొందరు అధికారులు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు వాటా పంపకాల్లో తేడా రావడంతో చివరకు అవినీతి పుట్ట కదిలింది. విజయవాడ నగర పాలక సంస్థలో పారిశుధ్య నిర్వహణకు మూడు వేల మంది డ్వాక్రా సభ్యులు పనిచేస్తున్నారు. వీరికి ఇరవై నెలల క్రితం వరకూ పది వేల రూపాయల వేతనం చెల్లించేవారు. ఇరవై నెలల కిందట కార్మికుల జీతాన్ని పదకొండు వేల రూపాయలకు పెంచారు. జీతమైతే పెంచారు కానీ వాటిని అమలు చేయకుండా కాగితాలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో ఇప్పటి వరకు ఒక్కో కార్మికుడికి ఇరవై వేల వరకు వేతన బకాయిలు చెల్లించాల్సి వుంది. అందరికీ కలిపి ఇరవై నెలలకు సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల క్రితం మొత్తం వేతన బకాయిలు యాభై శాతం అంటే మూడు కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. కొంత మంది అవినీతి అధికారులు కుమ్మక్కై ఈ నిధుల్లో ముప్పై లక్షల వరకు పక్కదారి పట్టించారు. వాస్తవంగా పని చేసే కార్మికుల కన్నా రికార్డుల్లో ఎక్కువ సంఖ్య ను చూపి నిధులను దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తూ వచ్చాయి. దీనికి చెక్ పెట్టేందుకు కార్మికులకు ఐరిష్ హాజరును ప్రవేశపెట్టారు దీన్ని సైతం తప్పు దారి పట్టించేలా రికార్డు సృష్టించారని సమాచారం. కేవలం రికార్డుల్లో మాత్రమే ఉండి క్షేత్ర స్థాయిలో లేని కార్మికులకు ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా జీతాలు డ్రా చేశారు. ఇప్పుడు వారి వేతన బకాయిలను కూడా చడీచప్పుడూ లేకుండా స్వాహా చేసేందుకు పథకం వేసుకున్నారు. అదే సమయంలో అవినీతి అధికారుల మధ్య వాటాలు పంచుకోవడంలో విబేధాలు తలెత్తాయి. ఇప్పటి వరకూ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం కాస్త కమిషనర్ దృష్టికి వెళ్లింది. కార్పోరేషన్ లో జరుగుతున్న అవినీతి భాగోతంపై కమిషనర్ రహస్యంగా విచారణ జరిపారు. నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణ లో వాస్తవం ఉందని నిర్థారించుకున్నారు. సంబంధిత విభాగం ఉన్నతాధికారి కి షోకాజ్ నోటీస్ తో పాటు విభాగం సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి చర్యను తీసుకోబోతోందో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/corruption-scandals-that-shook-the-world-25-90188.html