జపనీస్ పెంపకం.. ఇలా పెంచితే పిల్లలు చదువులో, ప్రవర్తనలో టాప్ లో ఉంటారట..!
జపనీస్ పెంపకం.. ఇలా పెంచితే పిల్లలు చదువులో, ప్రవర్తనలో టాప్ లో ఉంటారట..! ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో, పిల్లలను సరైన మార్గంలో నడిపించడం ఒక పెద్ద ఛాలెంజ్ అనుకోవచ్చు. అయితే పిల్లలు చురుగ్గా ఉంటూ, చదువులో కూడా రాణిస్తూ, మంచి ప్రవర్తనతో ఉండటానికి జపనీస్ పెంపకం చాలా బాగా సహాయపడుతుందట. ఇంతకీ ఆ జపనీస్ పెంపకం చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. జపనీస్ పెంపకం.. జపనీస్ పెంపక విధానం బాధ్యతాయుతమైన, సున్నితమైన , స్వయం సమృద్ధిగల పిల్లలను తయారుచేయడంలో సహాయపడుతుందట. పిల్లల భవిష్యత్తును బలోపేతం చేయడానికి సహాయపడుతుందట. జపనీస్ పెంపకం చిట్కాలు.. బాధ్యతను నేర్పించడం.. జపాన్‌లో పిల్లలు చాలా చిన్న వయస్సు నుండే చిన్న పనులను స్వయంగా చేసుకోవడం నేర్చుకుంటారు. స్కూల్ బ్యాగులు సర్దుకోవడం, గదిని శుభ్రం చేసుకోవడం లేదా చిన్న చిన్న ఇంటి పనులలో సహాయం చేయడం వంటివన్నీ వారి దినచర్యలో భాగం. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, బాధ్యతా ఉండటాన్ని అభివృద్ధి చేస్తుంది. క్రమశిక్షణ.. జపనీస్ పెంపకంలో క్రమశిక్షణను కఠినంగా కాకుండా ఒక అలవాటుగా నేర్పిస్తారు. పిల్లలకు సమయానికి విలువ ఇవ్వడం, నియమాలను పాటించడం , ఇతరులను గౌరవించడం నేర్పిస్తారు. పాఠశాలల్లో, పిల్లలు తమ తరగతి గదులను కూడా స్వయంగా శుభ్రం చేసుకుంటారు. ఇది వారిలో సామూహిక బాధ్యతా భావాన్ని పెంపొందిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. జపనీస్ తల్లులు తమ పిల్లల బాల్యంలో వారితో గాఢమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుంటారు. దీనిని 'అమాయే' అని పిలుస్తారు. దీనిలో పిల్లలు సురక్షితంగా , ప్రేమతో చుట్టుముట్టబడినట్లు భావిస్తారు. ఇది వారి మానసిక వికాసాన్ని మెరుగుపరుస్తుంది , వారు మరింత ఆత్మవిశ్వాసంగా మారడానికి సహాయపడుుతంది. టీమ్ వర్క్.. జపనీస్ సంస్కృతిలో పిల్లలకు టీమ్ వర్క్, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ,అందరూ కలిసి ఆలోచన చేయడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి నేర్పిస్తారు. ఇది వారు సమాజంలో మరింత మెరుగ్గా కలిసిపోవడానికి సహాయపడుతుంది. స్క్రీన్ సమయం.. జపనీస్ తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్లు , టెలివిజన్‌కు దూరంగా ఉంచి, సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. చదవడం, ఆరుబయట ఆడుకోవడం , కళలలో నిమగ్నమవడం వారి దినచర్యలో భాగం. ఇది వారి సంపూర్ణ అభివృద్ధికి దోహదపడుతుంది. తప్పుల నుండి నేర్చుకోవడం.. ప్రతి చిన్న తప్పుకు పిల్లలను తిట్టే బదులు, వారికి సలహా ఇచ్చి, వారి తప్పుల నుండి నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందిస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణానికే ప్రాధాన్యత.. అక్కడ కేవలం మార్కుల మీదనే కాకుండా, నిజాయితీ, వినయం, సానుభూతి వంటి గుణాలపై దృష్టి పెడతారు. అందుకే అక్కడ చదువు కన్నా, వ్యక్తిత్వ నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. *రూపశ్రీ.
Publish Date: Jul 29, 2026 3:39PM