political-news-img

కన్నతల్లే కసాయి... రెండేళ్ల చిన్నారి హత్య వెనుక షాకింగ్ కుట్ర

రెండేళ్ల చిన్నారి హత్య కేసు ఛేదన.. తల్లి, ప్రియుడి కుట్ర బట్టబయలు... మేడ్చల్–మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో సంచలనం సృష్టించిన రెండేళ్ల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొలుత ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కనిపించిన ఈ ఘటన వెనుక తల్లి, ఆమె ప్రియుడి కుట్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కన్నతల్లే తన ప్రియుడితో కలిసి పసిబిడ్డను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. కీసర మండలం చెర్యాల గ్రామంలోని ఈడెన్ గార్డెన్స్‌కు చెందిన రంగా స్వామి, జూన్ 13న తన రెండేళ్ల కుమారుడు రంగా హరికృష్ణ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మే 29న బాలుడు ఇంట్లో పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని తల్లి రంగా జ్యోతి కుటుంబ సభ్యులను నమ్మించింది. ఘటనపై అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో కీసర పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించారు. ఈ క్రమంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో జ్యోతి, మొగిళ్ల నవీన్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజే నవీన్ ఇంటికి వచ్చినట్లు, అనంతరం బాలుడిని ఆస్పత్రికి తరలించడంలో కూడా అతడు పాల్గొన్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో అనుమానం మరింత బలపడగా, జూన్ 19న బాలుడి మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. పోలీసుల విచారణలో జ్యోతి, నవీన్ ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. తమ అక్రమ సంబంధానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని భావించి ముందస్తు ప్రణాళికతో హత్య చేసినట్లు వెల్లడైంది. నవీన్ బాలుడిని నేలపై బలంగా కొట్టి చంపగా, తల్లి జ్యోతి అతనికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రీకరించే ప్రయత్నంలో బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది.ఈ కేసులో ప్రధాన నిందితులైన మొగిళ్ల నవీన్, రంగా జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన ఇతర కోణాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు వివరాలను జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి మీడియాకు వెల్లడించారు.

Publish Date: Jun 22, 2026 6:52PM

political-news-img

లక్నో అగ్ని ప్రమాదంలో... 14 మంది విద్యార్థులు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అలీగంజ్‌లోని ఉషా మెహతా మార్గ్‌లో గల ఒక అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ భవనంలో కోచింగ్ సెంటర్, యానిమేషన్ ఇన్స్టిట్యూట్ మరియు ఒక గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది 14 ఫైర్ టెండర్లతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం మొత్తం దట్టమైన పొగతో నిండిపోవడంతో రెస్క్యూ టీమ్‌ గోడలను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాల్సి వచ్చింది. లోపల చిక్కుకున్న విద్యార్థులను కాపాడేందుకు హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్ వాహనాన్ని కూడా రంగంలోకి దించారు. ప్రమాద తీవ్రతకు భయపడిన కొందరు విద్యార్థులు ప్రాణాలు దక్కించుకోవడానికి భవనం మొదటి అంతస్తు నుండి కిందికి దూకారు. ఈ క్రమంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు విద్యార్థులు ప్రాణరక్షణ కోసం వాష్‌రూమ్‌లలో దాక్కున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఒక్కో గదిని తనిఖీ చేస్తూ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. ఈ ఘోర ఉదంతంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటిస్తూ పీఎంఓ సామాజిక మాధ్యమాల్లో ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లలో కఠినమైన అగ్నిమాపక నిబంధనలను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవనంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో అధికారులు ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Publish Date: Jun 22, 2026 6:08PM

political-news-img

మైగ్రేన్ తగ్గాలంటే మందులు కాదు.. ముందుగా నీళ్లు ఇలా తాగండి!

మైగ్రేన్ తగ్గాలంటే మందులు కాదు.. ముందుగా నీళ్లు ఇలా తాగండి! తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తరచుగా వస్తున్నాయా? చాలామంది ఈ సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే వెతుకుతుంటారు. కానీ వీటి వెనుక గట్ హెల్త్ (జీర్ణవ్యవస్థ ఆరోగ్యం) కూడా ఒక ముఖ్యమైన కారణంగా ఉండొచ్చు. శరీరంలో నీటి కొరత, తప్పుడు ఆహారపు అలవాట్లు, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి అంశాలు తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను మరింత పెంచవచ్చు. ఈ వీడియోలో నీటిని సరైన సమయంలో, సరైన విధంగా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, గట్ హెల్త్‌ను మెరుగుపరచే సులభమైన మార్గాలు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు గురించి వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే గట్ హెల్త్ మరియు మెదడు ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధం, రోజువారీ జీవితంలో చిన్నచిన్న మార్పులతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో కూడా తెలియజేశారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

Publish Date: Jun 22, 2026 5:52PM

political-news-img

పోలీస్ స్టేషన్ వద్ద దివ్వల మాధురి హల్‌చల్!

మా ఆయనే దొరికాడా..ఆయను ఏమైనా అయితే చూస్తూ ఉరుకోము... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ పరిణామం శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. శ్రీనివాస్ విచారణను నిరసిస్తూ ఆయన భార్య దివ్వల మాధురి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విచారణ ప్రక్రియ శ్రీకాకుళం జిల్లా పరిధిలోని కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో కొనసాగింది. సమాచారం అందుకున్న దువ్వాడ మాధురి తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ భారీ హల్‌చల్ సృష్టించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు ఆమెతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలను, దువ్వాడ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా దువ్వాడ మాధురి అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఎన్నో నేరాలు జరుగుతుంటే పోలీసులు కేవలం తమ కుటుంబాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. "పోలీసులకు మా ఆయనే దొరికాడా? ఆయనకు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి, చూస్తూ ఊరుకోబోము" అంటూ ఆమె గట్టిగా హెచ్చరించారు. పాత ఫిర్యాదులపై ఇప్పుడు నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందన్నది మాధురి వాదన. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పవన్ కల్యాణ్ విమర్శించినప్పుడు తప్పు లేనప్పుడు, శ్రీనివాస్ మాట్లాడితే అది ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులు ఒకపక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి అక్రమాలను తాము ఎండగట్టినందుకే ప్రభుత్వం ఈ విధమైన వేధింపులకు దిగుతోందని దువ్వాడ మాధురి ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని, ఎలాంటి విచారణకైనా తాను కూడా సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు అధికార కూటమి తీరును తప్పుబడుతున్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే పాత కేసులను తిరగదోడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. మరోవైపు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అసభ్య పదజాలంతో దూషించినందుకే చట్టపరమైన విచారణ జరుగుతోందని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో, పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయో అనే అంశంపై జిల్లా రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Publish Date: Jun 22, 2026 5:36PM

political-news-img

మోదీ, అమిత్ షా వ్యూహాలు.. ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకమేనా?

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ, జాతీయ స్థాయిలో మోదీ-అమిత్ షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో, బలమైన ప్రాంతీయ శక్తులు సైతం కేంద్ర పెద్దల చాణక్యానికి తలవంచక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణ వరకు ప్రాంతీయ అధినేతల అహంకారం, వ్యూహాత్మక తప్పిదాలు వారి పతనానికి ఏ విధంగా దారితీస్తున్నాయో తెలుగువన్ వాస్తవ వేదికలో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు. రాజకీయాల్లో ఎప్పుడైనా పోరాటం ఉండాలని, ఎక్కడైతే రాజీ పడతారో అక్కడే పతనం ప్రారంభమవుతుందని జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు. పశ్చిమ బెంగాల్ ఉదాహరణను తీసుకుంటే.. మమతా బెనర్జీ బలమైన నాయకురాలైనప్పటికీ, ఇండియా బ్లాక్‌లో ఉంటూనే కాంగ్రెస్, సీపీఎంతో సరైన రీతిలో కలవలేకపోవడం ఓట్ల చీలికకు దారితీసిందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతమైందన్నారు. మమతా బెనర్జీ, చంద్రబాబు, జగన్ , కేసీఆర్.. ఎవరైనా సరే ప్రాంతీయ పార్టీల అధిపతుల్లో ఉండే అహంకారమే ఒక్కోసారి వారి సొంత రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. మరోవైపు తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ తీవ్రమైన నైతిక పతనాన్ని ఎదుర్కొంటోందని విమర్శించారు. గతంలో వచ్చిన టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, నాయకుల ప్రవర్తన ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. అదే సమయంలో బీజేపీ సైతం స్థానికంగా అంతర్గత వివాదాలు, నైతిక సమస్యల వల్ల ప్రజల్లో పట్టు కోల్పోయే ప్రమాదంలో పడిందని, దీనివల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఇక జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన వివిధ ఉద్యమాలు, కొత్త శక్తుల ఆవిర్భావంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రదర్శించిన లౌక్యం అద్భుతమని కొనియాడారు. విపక్షాలు లేదా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వంపై ఉద్రిక్తతలు సృష్టించి మైలేజ్ పొందాలని చూసిన ప్రతిసారీ, అమిత్ షా వ్యూహాత్మకంగా వ్యవహరించి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అరెస్టులు చేసి అనవసరంగా హీరోలను చేయడం కంటే, చట్టపరమైన వెసులుబాటు కల్పించి వారి వ్యూహాలనే నీరుగార్చడంలో కేంద్రం సఫలమైందని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్ల కాలం భారత రాజకీయాల్లో అత్యంత కీలకమని, ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవాలంటే అహంకారాన్ని వీడి ప్రజాక్షేత్రంలో గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో మోదీ, అమిత్ షా ద్వయం వేస్తున్న ఎత్తులను చిత్తు చేయకపోతే ప్రాంతీయ శక్తుల మనుగడ మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.

Publish Date: Jun 22, 2026 5:00PM

political-news-img

కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం...భవనంపై నుంచి దూకిన విద్యార్థులు!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం సాయంత్రం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ప్రముఖ విద్యాకేంద్రాల ప్రాంతమైన అలీగంజ్‌లో ఉన్న ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనతో విద్యార్థులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అలీగంజ్ పరిధిలోని పూర్నియా ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. నిత్యం వందలాది మంది విద్యార్థులతో రద్దీగా ఉండే ఈ కోచింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా పొగలు, మంటలు వ్యాపించాయి. లోపల క్లాసులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో విద్యార్థులు ప్రాణాలు కాపాడుకోవడానికి హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక విభాగానికి మరియు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడంతో పాటు భవనం లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అధికారులు వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే, మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో కొందరు విద్యార్థులు భవనంలోనే చిక్కుకుపోయారనే అనుమానాలు వ్యక్తమవడంతో, ఫైర్ సిబ్బంది ప్రత్యేక నిచ్చెనల సహాయంతో లోపలికి ప్రవేశించి సహాయక చర్యలు చేపట్టారు. ఇదిలావుండగా, లోపల పొగలు మరీ ఎక్కువ కావడంతో ఊపిరాడక, ప్రాణభయంతో కొందరు విద్యార్థులు భవనం పై అంతస్తుల నుంచి, కిటికీల గుండా కిందకు దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇలా దూకడం వల్ల కొద్దిమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయని, వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. గతంలో కూడా దేశంలోని పలు కోచింగ్ సెంటర్లలో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరిగి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. లక్నో ఘటనపై స్పందించిన స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు.. ఇలాంటి పెద్ద విద్యాసంస్థల్లో కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Publish Date: Jun 22, 2026 4:53PM

MOVIE NEWS