political-news-img

గోవా గవర్నర్ భూమిని కబ్జా చేసిన వైసీపీ!

వైసీపీ కబ్జాల పర్వం ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో నిర్మించిన, నిర్మించతలపెట్టిన పార్టీ కార్యాలయాల భూ కేటాయింపులపై మరో సారి చర్చమొదలైంది. విజయనగరంలో నిర్మించిన వైసీపీ కార్యాలయం భూమి ప్రభుత్వానికి కాదనీ, అది తమ కుటుంబానికి చెందిన భూమి అంటూ గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు ఆరోపించారు. సాక్షాత్తూ ఒక రాష్ట్ర గవర్నరే వైసీపీ తమ కుటుంబ భూమిని కబ్జా చేసిందంటూ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. తమ కుటుంబానికి చెందిన భూమిని దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుని వైసీపీ కార్యాలయం నిర్మించారని ఆయన మీడియా ముఖంగా ఆరోపించారు. గోవాగవర్నర్ పూసపాటి అశోకగజపతి రాజు విజయనగరం పర్యటనకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో చట్టాలను ఏ విధంగా దుర్వినియోగం చేశారో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తికి లేదా కుటుంబానికి చెందిన భూమిని.. రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఎలా చూపిస్తారని ఆయన అప్పటి అధికారుల తీరును నిలదీశారు. దాదాపు ఏడాది క్రితమే ఈ భూ అక్రమంపై తాను అప్పటి విజయనగరం జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేశానని అశోక్ గజపతిరాజు చెప్పారు. ఆ తర్వాత కొన్ని నెలల క్రితం మరోసారి అధికారులను కలిసి రిమైండర్ ఇచ్చాననీ.. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. బాధితులు ఇచ్చే నిజమైన ఫిర్యాదులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరియు జిల్లా పరిపాలన యంత్రాంగం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా ఉంటూ ఇలాంటి ఆరోపణలు చేయడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తాను గోవా గవర్నర్‌గా రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు స్వీకరించడానికి ముందే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలనే నియమం ఉందే తప్ప, తన స్వంత కుటుంబ ఆస్తులకు, హక్కులకు నష్టం వాటిల్లినప్పుడు ఒక పౌరుడిగా మాట్లాడకూడదనే నిబంధన ఎక్కడా లేదని అశోకగజపతిరాజు పేర్కొన్నారు.

Publish Date: Jun 30, 2026 10:40AM

political-news-img

ఐటీ సిటీలో హర్రర్: బెంగళూరులో ఒకే రోజు ముగ్గురి హత్య!

ఇండియన్ సిలికాన్ వ్యాలీ , గ్లోబల్ ఐటీ హబ్‌, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒకే రోజు రాత్రి మూడు దారుణ హత్యలు జరగడం కలకలం రేపింది. లా అండ్ ఆర్డర్ కు సంబంధించి ఎటువంటి సమస్యా లేని, శాంతిభద్రతలకు నిలయంగా భావించే బెంగళూరు నగరంలో గంటల వ్యవధిలో మూడు వేర్వేరు చోట్ల ముగ్గురు హత్యకు గురి కావడం ఒక్కసారిగా ఐటీ నగరాన్ని వణికించేసింది. ఒకే రాత్రి ఇద్దరు మహిళలు, ఒక రౌడీషీటర్ దారుణ హత్యకు గురి కావడంతో బెంగళూరులో భద్రతపై టెక్కీలలోనే కాకుండా స్థానికులలో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బెంగళూరులో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్‌గా పేరుమోసిన హల్మక్ రాజా ను ప్రత్యర్థి ముఠా నడిరోడ్డుపై నడిరోడ్డుపై నరికి చంపారు. అదే రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఇరువురూ వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు ఇళ్లళ్లో ఒంటరిగా ఉన్న మహిళలే కావడం గమనార్హం. ఒకే రాత్రి ఇలా వేర్వేరు ప్రాంతాలలో ఇద్దరు మహిళలు అమానుషంగా హత్యకు గురికావడం నగరంలోని మహిళల రక్షణను ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ మహిళల హత్యల వెనుక ఉన్నది ఎవరు, అసలు హంతకులకు వీరితో ఉన్న విరోధం ఏంటి, లేదా ఇది దోపిడీ దొంగల పనా అనే కోణంలో పోలీసులకు ఇంకా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టబోమని, త్వరలోనే ముగ్గురు హంతక ముఠాలను కటకటాల్లోకి నెడతామని పోలీసులు తెలిపారు.

Publish Date: Jun 30, 2026 10:21AM

political-news-img

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. ఎఫ్‌ఐఆర్ కు ముందే సొత్తు రికవరీ!

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో.. ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి ముందే భారీగా సొత్తు రికవర్ కావడం సంచలనం సృష్టించింది. దేశవిదేశాల నుంచి భక్తులు అయోధ్య రామాలయానికి సమర్పించే కానుకలు, విరాళాల లెక్కింపు విభాగంలో జరిగిన ఒక భారీ చోరీ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తు సాగుతుండగానే.. దాదాపు 58 లక్షల రూపాయల సొత్తు రికవర్ కావడం సంచలనం సృష్టించింది. సాధారణంగా ఏదైనా దొంగతనం లేదా అక్రమం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాతే రికవరీ ప్రక్రియ మొదలవుతుంది. కానీ అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కుంభకోణం కేసులో ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే, ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగడానికి ముందే.. ఆలయ ట్రస్ట్ అధికారులు తమ సొంత విచారణ ద్వారా నిందితుడి నుంచి ఏకంగా 58 లక్షల నగదును రికవర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయోధ్య రామమందిర విరాళాల నిధులలో భారీగా అక్రమాలు జరిగాయన్న విషయం.. తొలిసారిగా ఈ నెల 4న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు వేగంగా స్పందించారు. అప్పటి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఆ మరుసటి రోజే అంటే జూన్ 5న కొంతమంది పోలీసు సిబ్బందిని వెంటబెట్టుకుని అధికారులు నేరుగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అవినాష్ శుక్లా నివాసానికి చేరుకున్నారు. అక్కడ జరిపిన ఆకస్మిక తనిఖీలలో చోరీకి గురైన స్వామివారి సొమ్ములో సుమారు 58 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అయితే చట్టపరమైన లూప్‌హోల్స్ బయటపడకుండా ఉండేందుకు నిందితులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. కేవలం రూ. 58 లక్షల నగదు రికవరీతోనే ఆగకుండా, జూన్ 5వ తేదీ నుంచి జూన్ 8వ తేదీల మధ్య గల కేవలం మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే, నిందితులు మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని బ్యాంక్ ఆన్‌లైన్ బదిలీల ద్వారా నేరుగా ట్రస్ట్ అధికారిక బ్యాంక్ ఖాతాకు తిరిగి పంపించేశారు. ఈ వ్యవహారమంతా అత్యంత గుట్టుచప్పుడు కాకుండా, తెరవెనుక సాగడం గమనార్హం. ఈ భారీ కుంభకోణం వార్తలు మీడియా ద్వారా బహిర్గతం కావడంతో, నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. తాజాగా ఈ రహస్య నగదు రికవరీకి సంబంధించిన సిసిటివి విజువల్స్ కూడా లీక్ అయ్యాయి. నిందితుడు నల్లటి భారీ బ్యాగ్‌తో పోలీసుల పర్యవేక్షణలో వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రభుత్వం అధికారికంగా సిట్ వేయడానికి ముందే, ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేకుండానే ఈ సమాంతర రికవరీ ప్రక్రియలు జరగడంపై ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. అసలు చట్టపరమైన ఫిర్యాదు నమోదు చేయకుండానే ఈ స్థాయిలో రికవరీ ఎందుకు ప్రారంభించారు? ఇందులో తెరవెనుక ఏవైనా ఒప్పందాలు జరిగాయా? నిబంధనల ఉల్లంఘనలు ఏ స్థాయిలో జరిగాయి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది మంది నిందితులు అరెస్టయ్యారు.

Publish Date: Jun 30, 2026 10:07AM

political-news-img

ఐపీఎల్ క్రికెటర్ శశాంక్ సింగ్ పై క్రిమినల్ కేసు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున మెరుపు ఇన్నింగ్ లతో ఆకట్టుకున్న క్రికెటర్ శశాంక్ సింగ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. శశాంక్ సింగ్ తో పాటు ఆయన తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన తండ్రి శైలేష్ సింగ్ పై కూడా కేసు నమోదైంది. ఇంతకీ జరిగిందేంటంటే.. వారిద్దరూ కలిసి తమ ఇంట్లో వంటపని చేసే వ్యక్తిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు భోపాల్ రాతిబాద్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్ ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. విపేంద్ర సింగ్‌కు ఇటీవలే ఒక పరిచయస్తుడి ద్వారా భోపాల్‌లోని నిల్బాద్ ప్రాంతంలో నివసిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్ బంగ్లాలో వంట మనిషిగా చేరాడు. నెలకు రూ. 15 వేల జీతంతో పాటు ఉచిత వసతి, భోజనం కల్పిస్తామని యజమానులు ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా.. భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడానికి కూడా తమ వంతు సహాయం చేస్తామని నమ్మబలికారు. పనిలో చేరిన కేవలం గంటల వ్యవధిలోనే బంగ్లాలో అతడికి వేధింపులు మొదలయ్యాయి. వంట బాగాలేదంటూ తండ్రీ కొడుకులు శశాంక్సింగ్, శైలేష్ సింగ్ లు అతడిపై మానసిక ఒత్తిడి తీసుకువచ్చారు. అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించారు. ఈ వేధింపులను తట్టుకోలేని విపేంద్ర సింగ్.. తాను ఉద్యోగం మానేసి స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోతానని వారికి చెప్పాడు. దీంతో శశాంక్ సింగ్ , ఆయన తండ్రి శైలేష్ సింగ్ లు అతడితో గొడవపడి, అతని మొబైల్ పోన్ లాక్కొని కొట్టడానికి రావడంతో అతడు ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అయినా వదలని తండ్రీ కొడుకులు.. తమ వ్యక్తిగత డ్రైవర్‌తో కలిసి ఆ గది తలుపులను బలవంతంగా బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి విపేంద్ర సింగ్‌పై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న విపేంద్రసింగ్ నేరుగా.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే అతనికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో విపేంద్ర సింగ్ ముఖం, శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మెడికల్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు ఐపీఎల్ క్రికెటర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్, వారి డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

Publish Date: Jun 30, 2026 9:54AM

political-news-img

కన్నబిడ్డలను హత్య చేసి తల్లి ఆత్మహత్యాయత్నం

బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఒక కన్నతల్లే వారిని దారుణంగా హత్య చేసి ఆ తరువాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శ్రీకాకుళం జిల్లా వెదుళ్లవలసలో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. వెదుళ్లవలస గ్రామానికి చెందిన కుర్మారపు వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు కన్నబిడ్డల కుత్తుకలను కోసి హత్య చేసి.. ఈ తరువాత అదే కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వరలక్ష్మిని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (రిమ్స్) తరలించారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. కన్నతల్లే ఇంతటి ఘోరానికి ఎందుకు ఒడిగట్టింది? ఆ ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు తీయడానికి దారితీసిన బలమైన కారణాలు ఏంటి? కుటుంబ కలహాలా లేక మానసిక ఒత్తిడి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Publish Date: Jun 30, 2026 9:38AM

political-news-img

అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందానికి తుది గడువుజులై 15!

అమెరికా, ఇరాన్ సంక్షోభం ముగింపు దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్యా శాంతి చర్చలకు జూలై 15 తుది గడువుగా ముహూర్తం ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా, ఇరాన్ దేశాల శాంతి చర్చలకు సంబంధించి ఈ గడువు అత్యంత కీలకమైనదిగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ లో పెచ్చరిల్లుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత శాంతి ఒప్పందాన్ని జూలై 15 లోగా పూర్తి చేయాలని అమెరికా, ఇరాన్ ను వాటంతట అవే డెడ్‌లైన్‌ను నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ప్రెసిడెన్షియల్ టాస్క్‌ఫోర్స్ ఆన్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అండ్ గ్రోత్ (పీటీఏజీ) వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ లోగా ఒక సయోధ్య కుదరకుంటే.. ప్రాంతీయ భద్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా ప్రపంచ దేశాల వాణిజ్యానికి వెన్నెముక లాంటి హర్మూజ్ జలసంధి వివాదంపైనే ఇరు దేశాలు ప్రధానంగా దృష్టి సారించాయి. అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో గత కొంతకాలంగా వాణిజ్య నౌకలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల వల్ల అంతర్జాతీయ చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ నౌకల సురక్షిత ప్రయాణానికి స్పష్టమైన హామీ ఇవ్వడం ఈ చర్చల ప్రథమ లక్ష్యంగా మారింది. దీనితో పాటు లెబనాన్ సంక్షోభాన్ని శాంతియుతంగా తగ్గించాలనే కోణంలో కూడా ఇరు దేశాల ఉన్నత స్థాయి సాంకేతిక బృందాలు ఒక నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ ఎదుర్కొంటున్న ఆంక్షల సడలింపు అంశం కూడా ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉండనుంది. గత కొన్ని రోజులుగా అమెరికా, ఇరాన్ ల మధ్య ప్రత్యక్ష క్షిపణి దాడులు జరిగినప్పటికీ, యుద్ధ వాతావరణాన్ని పక్కన పెట్టి దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాల అగ్రనేతలు మొగ్గు చూపుతున్నారు. జూలై 15 నాటికి ఇరు దేశాలు ఒకే తాటిపైకి వచ్చి చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు చేస్తాయా, లేదా పశ్చిమాసియా మరో తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న.

Publish Date: Jun 30, 2026 9:28AM

MOVIE NEWS