Top Stories

జగన్ సర్కార్ పై ఉద్యోగుల జంగ్ సైరన్.. సీఎస్ కు జేఏసీ నోటీస్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు జంగ్ సైరన్ మోగిస్తున్నారు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు... మధ్యాహ్నం 12:15 గంటలకు సీఎస్ సమీర్ శర్మకు నోటీసు ఇవ్వనున్నాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలు బొప్పారాజు, బండి శ్రీనివాసులు ఈ నోటీస్‌ను ఇవ్వనున్నారు. 11 పీఆర్సీ అమలు, డిఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్స్‌ల చెల్లింపు షెడ్యూల్‌పై ఐక్య వేదిక నోటీస్ ఇవ్వనుంది. డిసెంబర్ 7 నుండి ఉద్యమ కార్యాచరణను అమలులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వంపై జేఏసీ నేతలు ఒత్తిడి చేయనున్నారు.  
Publish Date: Dec 1, 2021 9:59AM

వరి సాగు చేయండి.. కొనుగోలు బాధ్యత నాదే! కేసీఆర్ కు షాకిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే... 

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం వరి సాగుపైనే హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య యుద్ధమే సాగుతోంది. తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయలేమని ఎఫ్ సీఐ చెప్పిందంటున్న టీఆర్ఎస్.. కేంద్రంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ మోడీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు సీఎం కేసీఆర్. అంతేకాదు యాసంగిలో వరి సాగు చేయవద్దని అధికారికంగా ప్రకటించారు ముఖ్యమంత్రి. యాసంగిలో రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేశారు. రైతులు వరి సాగు చేసి ఇబ్బందులు పడవద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కేసీఆర్ సూచించారు. కేసీఆర్ ప్రకటనతో టీఆర్ఎస్ నేతలు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వం వరి ధాన్యం కొనదని, రైతులెవరు వరి సాగు చేయవద్దని చెబుతున్నారు. కాని సీఎం కేసీఆర్ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. సీఎం వరి సాగు చేయవద్దని చెబుతుంటే.. అతను మాత్రం వరి సాగు చేయాలని రైతులకు బహిరంగంగానే చెబుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చర్యలు రాజకీయంగా సంచలనం రేపుతుండగా.. గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారాయి.  యాసంగిలో రైతులు వరి సాగు చేస్తే మంచి ధరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదని మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ నియోజకవర్గ రైతులు యాసంగిలో సన్న ధాన్యం పండిస్తే మంచి ధరకు మిల్లర్లతో పంటను కొనుగోలు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఎవరు ఏం చెప్పినా రైతులు అయోమయానికి గురి కావద్దన్నారు. వరి సాగు చేసేందుకు నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నీటిని విడుదల చేయిస్తానని తెలిపారు. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోలుపై రైస్‌ మిల్లర్లతో చర్చించానని, మెట్టపంటలు వేసుకునే అవకాశం ఉన్న రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు కోరారు.  కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని భాస్కర్ రావు ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై ధర్నాకు దిగిన కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ ఏనాడై నా రైతులు పొలాల్లో నాట్లు వేయడం, కోతలు కోయ డం చూశారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి ఊరికే రాద్ధాంతం చేస్తే సమస్య సమసిపోదన్నారు. చత్తీస్‌గఢ్‌ నుంచి ధాన్యం బస్తా రూ.1,480కే మిర్యాలగూడ మిల్లులకు డెలివరీ చేస్తున్నారని తెలిపారు. మిల్లర్లతో లాలూచీ పడుతున్నారనే ఆరోపణలు సరికాదని భాస్కర్‌రావు అన్నారు. సాగర్ ఆయకట్టు రైతులు నిరభ్యంతరంగా వరి సాగు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సూచిస్తున్నారు. అయితే ఆయన ప్రభుత్వం కాకుండా మిల్లర్లతో కొనుగోలు చేయిస్తానని చెబుతున్నారు. 
Publish Date: Dec 1, 2021 9:48AM

పెద్దల సభకు గులాబీ బాస్? కేసీఆర్ ఢిల్లీకి మకాం మారుస్తారా?

రాజ్యసభకు కేసీఆర్ .. ఏంటి అవాక్కయ్యారా? అయినా మీరు వింటున్నది నిజమే.ఢిల్లీకి మకాం మార్చక తప్పని అనివార్య పరిస్థితులు లేదా అర్జెంటుగా ప్రగతి భవన్ ఖాళీ చేయక తప్పని వత్తిళ్ళ నేపధ్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. జాతీయ రాజేకీయాల్లో తెరాస కీలక భూమిక పోషిస్తుందని గత కొంత కాలంగా ముఖ్యమంత్రి పదే పడే ప్రస్తావిస్తున్న నేపధ్యంలో, రాష్ట్ర బాధ్యతలను వారసుడు కేటీఆర్’కు అప్పగించి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలకు షిఫ్ట్’అవుతారని రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా తెరాస వర్గాల్లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అందుకు ఇప్పుడు పరిస్థితుల ప్రభావం కూడా తోడైందని అందుకే కేసీఆర్ ఢిల్లీకి  మకాం మార్చేందుకు మానసికంగా సిద్డమయ్యారని, అందులో రాజ్యసభకు  వెళ్ళే అలోచన చేస్తునారని అంటున్నారు.      ఎవరు అవునన్నా,ఎవరు కాదన్నా గత కొంత కాలంగా ముఖ్యంగా తెరాస రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. మరో వంక , అంతర్గత కుమ్ములాటలు ఇతరేతర కారణాలవలన  పరిపాలన కోడా పట్టాలు తప్పింది, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ..ఈ అన్నిటినీ మించి పార్టీలో, అంతకంటే ఎక్కువగ్ ఫామిలీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.ఇంటి ఆడబిడ్డ గడప తొక్కలేని స్థితికి  పరిస్థితి చేజారిపోయింది. ఒక విధంగా చూస్తే ఇప్పటికే పార్టీ మీద, ప్రభుత్వ వ్యవహారాల్లో, కుటుంబ రాజకీయ వ్యవహరాల్లో పెద్దాయన పట్టు తప్పిందని అంటున్నారు.ఇతరుల విషయం ఎలా ఉన్నా, ముఖ్యమంత్రిని ఏదో తెలియని భయం వెంట్డుతోందని ఏ దిక్కు చూసినా అష్టమ దిక్కే కనిపిస్తోందనే భావన బలపడుతోందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.   అదలా వుంటే మరో వంక రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ట కూడా రోజు రోజుకు దిగజారుతోందని అంటున్నారు. వరిసాగు, ధాన్యం సేకరణ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద ఎంతగా విరుచుకు పడినా, బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకులను ఎంతగా తిట్టిపోసినా,పడిపోయిన ప్రతిష్ట పైకిలేవడం లేదు. కోటి ఎకరాల్లో వరి వేసినా, ఐ యాం హ్యాపీ’ కొనే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని శాసన సభలో చెప్పి ఇప్పుడు అందుకు అందుకు విరుద్ధంగా మాట్లాడడం వంటి ద్వంద వైఖరితో ముఖ్యమంత్రి వ్యక్తిగత  ప్రతిష్ట దిగజారుతోందని,  ప్రజల్లో ఆయన పట్ల  విశ్వాసం సన్నగిల్లుతోందని  అంటున్నారు.  మరో వంక అయన గురిచూసి వేసిన ప్రతి బాణం తిరిగొచ్చి  ఆయనకే గుచ్చుకుంటోంది. పాత వీడియోలు ప్రూఫ్ గా సోషల్ మీడియాలో ఆయన్ని ఆయనే ఆయన నోటితోనే దూషించుకోవడం చూసి, నెట్టింట అందరూ నవ్వుకుంటున్నారు. ఆ నవ్వులు ఆయన్నీ, చేరుతున్నాయి, ఆయన్ను ఇంకాస్త, ఫ్రస్ట్రేషన్’లోకి నెట్టేస్తున్నాయని అంటున్నారు. నిజాలు ఎలా ఉన్నా, హుజూరాబాద్ ఓటమి మొదలు ఒకదాని వెంట ఒకటిగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయనే అనే అభిప్రాయం అయితే, అంతటా వినవస్తోంది.    అంతకు మించి, హుజూరాబాద్ ఓటమి పక్కలో బల్లెంలా, కదిలినా మెదిలినా కడుపులో గుచ్చుకుంటోంది. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు వచ్చి నిండా నెలరోజులు అయినా, ఈటల చేసిన గాయం మాత్రం మానడం లేదు. ఇన్ని రోజుల్లో, ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చినా ఒక్క సారైనా ముఖ్యమంత్రి హుజూరాబాద్ ప్రస్తావన చేయలేదు.ఈటల పేరు కూడా  ప్రస్తావించలేదు. దీన్నిబట్టే ఈటల చేసిన గాయం ఆయన్ని ఎంతలా సలుపుతోందో అర్థం చేసుకోవచ్చని, వేరే చెప్పనక్కరలేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే, అసెంబ్లీలో తనను చూడడం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి తనను ఓడించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఈటల పదేపడే చేసిన వ్యాఖ్య నిజమే కావచ్చని ఆ కారణంగానూ , పెద్దల సభకు వెళ్ళే ఆలోచన చేస్తునారని కొందరు అంటున్నారు.  మరో వంక, వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లుగా, ముహూర్తం దాక వచ్చి ముడిపడని కేటీఆర్ పట్టాభిషేకం ఆలస్యమయ్యే కొద్దీ, పట్టుతప్పుతున్న కుటుంబ కలహాలు, ఫ్యామిలీలో సాగుతున్న ‘కుర్చీ’ పట్లు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఏదో వంకన మకాం ఢిల్లీకి మార్చి, ఆ వంకన కేటీఆర్’ను ముఖ్యమంత్రిని చేసే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.ఈ వ్యూహంలో భాగాంగానే ... మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్’ను తెరపైకి తెచ్చారు.బీజేపీ, మోడీ వ్యతిరేకతను పావుగా మలచుకునే ప్రయత్నం సాగిస్తున్నారు.అయితే అక్కడ ఢిల్లీలో బీజేపీ మోడీ ప్రత్యాన్మాయ స్థానం కోసం గట్టిపోటీ నడుస్తోంది. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్, శరద్ పవార్ ... ఈ అందరినీ ఆడించే పొలిటికల్ రింగ్ మాస్టర్ ప్రశాంత్ కిశోర్ ఇలా ... చాలామంది ఎవరి ప్రయత్నాలలో వారున్నారు.   అయినా, ఇతర విషయాలు ఎలాఉన్నా, ఉద్యమ వాసనలు లేని కొత్తతరం రాజకీయ వ్యూహంలో రాష్ట్రాన్ని వారసునుకి అప్పగించే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అంటున్నారు. ఇటు పార్టీ పగ్గాలు, అటు ప్రభుత్వ పగ్గాలు కేటీఆర్ చేతిలో పెడితే, వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యర్ధుల కంటే కేటీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఒక మెట్టు పైన నిలపాలని, అందుకోసం అయినా కేటీఆర్’ను వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని అందుకోసమే మకాం దేల్హికి మార్చే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే, అన్నీ అనుకున్నట్లు జరుగుతయ్యా ... కేటీఅర్ పట్టాభిషేకానికి వినాయకుడు ఈసారైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది చూడవలసి వుందని అంటున్నారు.
Publish Date: Dec 1, 2021 9:26AM

హోదాపై కేంద్రం పాత పాట.. జగనన్న మౌనమే శాపమా? 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ముగిసిన అధ్యాయం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు హోదా ఇవ్వనందునే...కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజికి అంగీకారం తెలిపింది.. ఇదే  పాత పాటను కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంట్ లో పాడి వినిపించింది. తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు  లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంతే కాదు, విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మౌలిక వసతులు, విద్యాసంస్థల ఏర్పాటు వంటి వాటికి దీర్ఘకాల సమయం ఉందన్నారు.విభజన అంశాల పూర్తి కోసం చట్టంలోనే పదేళ్ల గడువు ఉందని వివరించారు. చట్టంలో పేర్కొన్న అన్ని పూర్తి చేసేందుకు కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు.. ఏపీ, తెలంగాణ ప్రతినిధులతో సమీక్ష చేస్తోందని వెల్లడించారు. ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగయాని, ద్వైపాక్షిక సమస్యల సామరస్యపూర్వక పరిష్కారం కోసం 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తన సమాధానంలో చెప్పారు.14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిన వ్యవహారమని ఉద్ఘాటించారు.  కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచి ఉంటే.. ఏపీకి 2015-16 నుంచి 2019-20 సంవత్సరాల మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అదనపు సాయం లభించేదో.. ఆ మొత్తాన్ని ప్రత్యేక సాయం కింద అందించడానికి అంగీకరించినట్లు చెప్పారు. 2015-16 నుంచి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కేంద్రమే చెల్లించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసిందని లోకసభకు ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు.మొత్తానికి, కేంద్ర మంత్రి ఏపీకి ఇంకేమీ చేసేది లేదని, చేయవలసిందీ లేదని నిర్లక్ష్యపూరితంగా సమాధానం ఇచ్చారు. అయినా 22 మంది వైసేపీ ఎంపీల్లో ఎవరు నోరు విప్పలేదు. ఇదెక్కడి అన్యాయమని అడిగే సాహసమే చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం,  మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అయితే అసలు కేంద్రం చేసిన అవమానాన్ని అసలు గుర్తించినట్లే లేదు.  అయితే తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న అయిదేళ్ళలో ప్రత్యేక హోదా కోసం అంతులేని పోరాటం చేసింది. చివరకు కేంద్రం మొండి వైఖరి మారక పోవడంతో, బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కేంద్రంలో మంత్రి పదవువులను వదులుకుని ఎన్డీఎ నుంచి బయటకు వచ్చింది. కేంద్రం తలపెట్టిన అన్యాయయానికి వ్యతిరేకంగా గల్లీ నుంచి డెల్లి వరకు  ధర్మ పోరాటం సాగించింది.కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మద్దతుతో,ఇదే ఇష్యూ ఫై మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తెచ్చి, ఆంద్ర ప్రదేశ్ హోదా విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్ళింది. అయితే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసింది. రాష్ట్రంలో అధికారంతో పాటుగా లోక్ సభలో 25 కు 22 సీట్లు వైసీపీకి కట్టబెట్టినా, అధికారం అప్పగిస్తే కేంద్రంతో కోట్లాది అయినా ప్రత్యేక హోదా సాధిస్తానని మాటిచ్చిన జగన్మోహన రెడ్డి ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే కాడి వదిలేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది కాబట్టి , హోదా అడిగే పరిస్థితే లేదని ముందుగానే సరండరై పోయారు. అయినా అడుగుతూనే ఉంటాం.. ఆ తర్వాత కేంద్రం దయ మన ప్రాప్తం, అంటూ యుద్ధానికి ముందే సంధి మంత్రం జపించారు. తెల్ల జెండా ఎగరేశారు. పార్లమెంట్ లోపలగానీ, బయట గానీ వైసేపీ ఎంపీలు ఏనాడు, ప్రత్యేక హోదా ప్రస్తావనే చేయలేదు.  అయితే తెలుగు దేశం పార్టీ మాత్రం, ఉన్నది ముగ్గేరే ఎంపీలు అయినా లోక్ సభలో ఇంచు మించుగా ప్రతి సెషన్ లోనూ ఏదో ఒక రూపంలో ప్రత్యేక హోదా అంశాన్ని తెచ్చి, హోదా ఇష్యూ ను సజీవంగా ఉంచుతోంది. 
Publish Date: Nov 30, 2021 6:55PM

సిరివెన్నెలకు నివాళి.. హోదా లేదట.. జగనన్న బాదుడు..టాప్ న్యూస్@8PM

ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో ఆయన బాధ పడుతున్నారు. ఈనెల 24న హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు నిపుణులైన వైద్య బృందం చికిత్సను అందించినప్పటికీ ఫలితం దక్కలేదు.  సాయంత్రం 4.07 గంటలకు ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ---- ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయని చెప్పారు.  ----- ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన నిధులు రూ. 1,309 కోట్లను తక్షణమే పంచాయతీల ఖాతాలలో జమచేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ పనుల కోసం గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులను దారిదోపిడీదారుల్లా తరలించుకుపోవడం దారుణమని అన్నారు. ---- ఏపీ ప్రభుత్వం కన్ను  ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లపై పడిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఎన్టీఆర్ వర్సిటీ డబ్బును రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు మళ్లించేందుకు దుష్ట ఆలోచన చేసిందని విమర్శించారు.కెనరా బ్యాంకులో దాచిన డబ్బును ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ----- జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే  రాజోలు నియోజకవర్గంలో రోడ్లకు ప్రతి రెండున్నర అడుగులకు ఒక గొయ్యి ఉందని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏపీలో సీఎం జగన్ భూకబ్జాలు, ఇసుక దోపిడీతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలై అంధకారంలో కూరుకు పోయిందన్నారు నాదెండ్ల మనోహర్.  ---- రాష్ట్రంలోని ప్రజలపై మరో పన్ను బాదుడు మొదలు కానుంది. ఏపీలో పాత వాహనాలపై గ్రీన్‌ట్యాక్స్‌ విధించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. రవాణా వాహనాలు ఏడేళ్లు దాటితే రూ.4వేలు, పదేళ్లు దాటితే రూ.5వేలు, పన్నెండేళ్లు దాటితే రూ.6వేలు చొప్పున గ్రీన్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. మోటార్ సైకిల్ పదిహేనేళ్లు దాటితే రూ.2వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.5వేలు, కార్లు, జీపులు పదిహేనేళ్లు దాటితే రూ.5వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.10వేల చొప్పున పన్నులను వేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ---- సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. యాసంగి సీజన్‌లో వరి వేయద్దని చెప్పినపుడు.. మరి  ఏ పంట వేయాలో చెప్పాలని కేసీఆర్‌‌ను ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎక్కడ హత్యలు చేసిందో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రా రైస్ కొనే బాధ్యత కేంద్రానిదేనని.. వాటిని రాష్ట్రం కూడా కొని తీరాల్సిందేనన్నారు.  ----- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. పంట అమ్ముకోలేక రైతులు ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగానే రైతు చట్టాల రద్దుపై.. చర్చ జరగకుండా టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో అడ్డుకున్నారని విమర్శించారు. వరి కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ------- మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో, అందులోనూ అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు వెలుగు చూడడం కలకలం రేపింది. మద్య నిషేధానికి అనుకూలంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రతిజ్ఞ చేసిన మరునాడే ఈ మద్యం సీసాలు వెలుగు చూశాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు.  ---  భారత సైన్యం నిఘా సామర్థ్యం మరింత బలోపేతమైంది. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన అడ్వాన్స్‌డ్ హెరోన్ డ్రోన్లను లడఖ్ సెక్టర్‌లో మోహరిస్తుండటంతో చైనా కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల సేకరణ నిబంధన క్రింద ఈ డ్రోన్లను మన దేశం కొనుగోలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వీటిని మన దేశానికి అప్పగించడంలో కొన్ని నెలలు జాప్యం జరిగింది.
Publish Date: Nov 30, 2021 6:55PM

జనాలకు జగన్ మరో షాక్.. ఈ బాదుడు మాములుగా లేదుగా! 

ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరో బాదుడుకు రంగం సిద్ధమవుతోంది.  పాత వాహనాలపై గ్రీన్‌ట్యాక్స్‌ విధించాలని అధికారులు  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రవాణా వాహనాలు ఏడేళ్లు దాటితే రూ.4వేలు, పదేళ్లు దాటితే రూ.5వేలు, పన్నెండేళ్లు దాటితే రూ.6వేలు చొప్పున గ్రీన్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. మోటార్ సైకిల్ పదిహేనేళ్లు దాటితే రూ.2వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.5వేలు, కార్లు, జీపులు పదిహేనేళ్లు దాటితే రూ.5వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.10వేల చొప్పున పన్నులను వేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం కోసం రవాణాశాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. హరిత పన్నును రద్దు చేయాలని రవాణా రంగం ప్రతినిధులు కోరుతున్నారు.   ఖజానా ఖాళీ కావడంతో ఎక్కడెక్కడ పన్నులు వేయాలా అని ఆలోచిస్తున్న జగన్ సర్కార్ .. రవాణాశాఖ అధికారుల ప్రతిపాదనలను వెంటనే ఆమోదించే అవకాశాలున్నాయి. కొన్ని రోజులుగా జనాలపై భారాలు మోపుతూనే ఉంది వైసీపీ ప్రభుత్వం. ఇంటి పన్నులు పెంచింది. చెత్తకు పన్ను వసూల్ చేస్తోంది. లిక్కర్ పైనా ట్యాక్సులు పెంచుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. దేశంలో పెట్రోల్, డీజిల్ రేటు ఎక్కువగా ఉన్న టాప్ రాష్ట్రాల్లో ఏపీ ఉంది.  ఇటీవల ఎక్సైజ్ ట్యాక్ తగ్గించిన కేంద్రం.. రాష్ట్రాలు తమ పరిధిలోని వ్యాట్ తగ్గించాలని సూచించింది. కేంద్రం సూచనతో బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై కొంత వ్యాట్ తగ్గించాయి. కాని జగనన్న సర్కార్ మాత్రం పైసా కూడా తగ్గించలేదు. తాజాగా గ్రీన్ ట్యాక్స్ విధించాలని చూస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. చమురు ధరలతోనే తమకు చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇంకా గ్రీన్ ట్యాక్స్ తో మరింత భారం పడుుతుందని గగ్గోలు పడుతున్నారు. 
Publish Date: Nov 30, 2021 5:05PM