Top Stories

dummy

political-news-img

అమెరికాకు ఎదురుదెబ్బ.. ప్రతీకారం తప్పదంటూ ట్రంప్ హుంకరింపు

యుద్ధంలో అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాను ఇరాన్ గట్టి దెబ్బకొట్టిందా? అమెరికా అహందెబ్బతిందా? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. , ఇరాన్ సరిహద్దుల్లోకి చొరబడిన అమెరికా నిఘా విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చివేసాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్ననేపథ్యంలో హుర్ముజ్ ప్రావిన్స్‌ సమీపంలోని సరిహద్దుల వద్ద ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు తమ దేశ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికాకు చెందిన మానవరహిత నిఘా విమానాన్ని ( గుర్తించి, తక్షణమే కూల్చివేసాయి. అందుకు సంబంధించి ఆ విమాన శిధిలాల ఫుటేజీని ఇరాన్ అధికారికంగా విడుదల చేయడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. గత కొంతకాలంగా అమెరికా ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. అణు ఒప్పందాల విషయంలోనూ, ఆర్థిక ఆంక్షల విషయంలోనూ ఇరు దేశాల మధ్య తీవ్ర వైరం నెలకొంది. ఈ క్రమంలో అమెరికా తన అత్యాధునిక నిఘా విమానాలను ఇరాన్ సరిహద్దుల్లో మోహరించడం, ఇరాన్ వాటిని కూల్చివేయడం అనేది కేవలం ఒక ప్రమాదం కాదు, ఇది ఒక పెద్ద యుద్ధానికి సంకేతంగా మారుతోంది. ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా వెనకాడబోమని ఈ చర్య ద్వారా స్పష్టం చేసింది. ఇరాన్ విడుదల చేసిన దృశ్యాల్లో అమెరికా విమానం శకలాలు ఎడారి ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపించింది. ఆ విమానంలోని కీలక పరికరాలు, డాక్యుమెంట్లు మరియు ఇతర సాంకేతిక సామాగ్రిని ఇరాన్ స్వాధీనం చేసుకుంది. తాము శాంతిని కోరుకుంటున్నామని, కానీ తమ భూభాగంలోకి ఎవరైనా అక్రమంగా వస్తే సహించేది లేదని ఇరాన్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ వీడియో సాక్ష్యాలు ఇప్పుడు అమెరికాకు మింగుడుపడని అంశంగా మారాయి. ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ ప్రజలు ఈ చర్యను తమ దేశానికి గర్వకారణంగా అభివర్ణిస్తున్నారు. అదే సమయంలో పెంటగాన్ వర్గాలు దీనిపై తీవ్రంగా మండిపడుతున్నాయి. అంతర్జాతీయ జలాల్లో ఉన్న తమ విమానాన్ని కావాలనే ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా దీనికి ప్రతికారంగా తీవ్ర స్థాయిలో ఇరాన్ పై దాడులకు తెగబడే అవకాశాలున్నాయని అంతర్జాతీయ రక్షణ సంబధ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా మరో 24 గంటలు అంటూ ఇరాన్ కు స్పష్టమైన హెచ్చరిక చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఏది ఏమైనా ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి.

Publish Date: Apr 7, 2026 3:43PM

political-news-img

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్టైన ఆయన దాదాపు ఏడాది కాలంగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పలు షరతులు విధిస్తూ ఉపశమనం కల్పించింది. ఈ నిర్ణయం కేసు తదుపరి దర్యాప్తు మరియు న్యాయపరమైన పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. పోలీసుల విచారణకు సహకరించాలని దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు స్పష్టం చేశారు. దాదాపు ఏడాదిగా ఆయన జైలులో ఉన్నారు. ఇదే కేసులోని పలువురు నిందితులకు ఇప్పటికే న్యాయస్థానం బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.

Publish Date: Apr 7, 2026 3:34PM

political-news-img

సరిహద్దుల్లో ఎన్నికల సెగ.. అడుగడుగునా నిఘా!

ప్రజాస్వామ్య పండుగగా అభివర్ణించే ఎన్నికలు.. సరిహద్దు ప్రజల పాలిట మాత్రం పరీక్షా సమయాలుగా మారుతున్నాయి. అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల మధ్య భౌగోళిక రేఖ కేవలం పరిపాలన పరమైన విభజన మాత్రమే. కానీ, అక్కడి ప్రజల బంధాలు, వ్యాపారాలు, అవసరాలు పెనవేసుకుపోయి ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల నగారా మోగడంతో, ఈ అనుబంధాల మధ్య ఎన్నికల నియమావళి ఒక అదృశ్య గోడలా నిలుస్తోంది. నిత్యం రాకపోకలు సాగించే సామాన్యుడు అడుగడుగునా నిఘా నీడలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలకు తమిళనాడుతో విడదీయలేని సంబంధం ఉంది. ఉదయం లేచింది మొదలు పాలు, కూరగాయల వ్యాపారం నుంచి షాపింగ్ వరకు అంతా తమిళనాడు పట్టణాలతోనే ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ నిరంతర తనిఖీలు సామాన్యుడిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పోలీసులు, ఎన్నికల అధికారులు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక, పత్రాలు చూపలేక సామాన్యులు గంటల తరబడి చెక్‌పోస్టుల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళనాడులోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బట్టలు కొనాలన్నా, బంగారం చేయించాలన్నా ఈ ప్రాంత వాసులకు కాంచీపురం, చెన్నై, వెల్లూరు మొదటి ప్రాధాన్యత. అయితే, రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదనే నిబంధన ఇప్పుడు శాపంగా మారింది. తమ కష్టార్జితాన్ని, పొలం అమ్మిన డబ్బునో లేక అప్పు తెచ్చిన మొత్తాన్నో తీసుకెళ్తుంటే.. సరైన ఆధారాలు లేవనే నెపంతో అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా సుమారు రూ. 2.34 కోట్లకు పైగా నగదు పట్టుబడటం అంటే, అందులో అధిక భాగం సామాన్యుల అవసరాల కోసం తీసుకెళ్తున్నదేనని స్థానికులు వాపోతున్నారు. సీజ్ చేసిన నగదును తిరిగి పొందాలంటే కోర్టుల చుట్టూ, ట్రెజరీల చుట్టూ తిరగడం మధ్యతరగతి వర్గాలకు తలకు మించిన భారంగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో వ్యాపారాలు అధికంగా నగదు లావాదేవీల మీదనే ఆధారపడి ఉంటాయి. గొర్రెల వ్యాపారులు, కూరగాయల రైతులు, చిన్న తరహా కాంట్రాక్టర్లు బ్యాంకింగ్ కంటే నగదు రూపంలోనే చెల్లింపులు జరుపుతుంటారు. ఇప్పుడు అధికారులు బ్యాంక్ లావాదేవీలపై, ఏటీఎంల వద్ద కూడా నిఘా ఉంచడంతో వ్యాపార రంగం కుదేలవుతోంది. షాపింగ్ మాల్స్ వెలవెలబోతున్నాయి. ఎప్పుడు ఎవరిని పట్టుకుంటారో, ఏ వస్తువును సీజ్ చేస్తారో తెలియని అయోమయ స్థితిలో ప్రజలు షాపింగ్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఒక రాష్ట్రంలో రేషన్ కార్డు ఉండి, మరో రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న వారు సరిహద్దుల్లో వేల సంఖ్యలో ఉన్నారు. వీరిని ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను అరికట్టాలనే లక్ష్యంతో అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా.. నిత్య అవసరాలైన పెట్రోల్, డీజిల్, చివరికి అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్సులలో వెళ్లే వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఇది మానవీయ కోణంలో చూస్తే బాధితులకు ఒకింత అసౌకర్యంగా మారుతోంది. ఎన్నికల పారదర్శకత కోసం నిబంధనలు ఖచ్చితంగా ఉండాల్సిందే. మద్యం, ఉచితాల పంపిణీని అరికట్టడం హర్షణీయమే. కానీ, ఆ క్రమంలో అమాయకులు బలికాకూడదని మేధావులు సూచిస్తున్నారు. అధికారులు మానవత్వంతో వృద్ధులు, మహిళలు, రోగుల పట్ల కొంత సానుకూల ధోరణి ప్రదర్శించాలంటున్నారు. ప్రజలకు అనవసరమైన చిక్కులు రాకుండా బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఐడీ కార్డులు, వ్యాపార బిల్లులను వెంట ఉంచుకోవాలని కూడా సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు డిజిటల్ పేమెంట్లను ఆశ్రయించడం ఉత్తమమంటున్నారు. మొత్తానికి, ప్రజాస్వామ్య పండుగలో ఓటు వేయడానికి సిద్ధమవుతున్న సామాన్యుడు.. ఈ ఆంక్షల చట్రంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాడు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ సరి‘హద్దు’ కష్టాలు తప్పేలా లేవు. అధికార యంత్రాంగం నిఘాను కొనసాగిస్తూనే, సామాన్యుడి ప్రాథమిక అవసరాలకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

Publish Date: Apr 7, 2026 3:27PM

political-news-img

బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులపై ధ్వజమెత్తిన కేటీఆర్

పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులను, గృహనిర్బంధాలను ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపడం నేరమా అని ప్రశ్నించిన కేటీఆర్.. మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్తేమీ కాదనీ, తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఇలాంటి ఆంక్షలెన్నో ఎదుర్కొన్నామన్నారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమేనని ఉద్ఘాటించిన కేటీఆర్.. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల అనుమతి లేకుండా సాగిస్తున్న బలవంతపు భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందనీ, బాధితులకు అండగా నిలబడుతుందనీ చెప్పారు. అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Publish Date: Apr 7, 2026 3:19PM

political-news-img

వరల్డ్ హెల్త్ డే..ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..అందిరి చేతుల్లోనూ ఉంది!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు చాలా వరకు ఆరోగ్యం కోసమే ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ చూసినా హాస్పిటల్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా చాలా రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సపం ఎలా ఆవిర్బవించింది? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఈ రోజు ఏ కార్యక్రమాలు చేపడతారు? ఆరోగ్యం కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తెలుసుకుంటే.. వరల్డ్ హెల్త్ డే ప్రారంభం.. వరల్డ్ హెల్త్ డే ప్రారంభానికి ప్రధాన కారణం World Health Organization (WHO). 1948 ఏప్రిల్ 7న WHO అధికారికంగా స్థాపించబడింది. అదే తేదీని గుర్తుగా 1950 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ డే జరుపుతున్నారు. ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఈ రోజును ఏర్పాటు చేశారు. ఉద్దేశ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జరుపుకోవడం వెనుక కొన్ని ముఖ్య ఉద్దేశ్యాలు ఉన్నాయి. ప్రజల్లో అవగాహన పెంచడం.. ఆరోగ్యం గురించి చాలామందికి సరైన సమాచారం, అవగాహన ఉండవు. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనశైలి, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. గ్లోబల్ హెల్త్ సమస్యలపై దృష్టి.. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ ఉంటుంది. ఈ థీమ్ ను అనుసరించి కార్యక్రమాల రూపకల్పన, వాటి ఆచరణ వైపు ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు.. మెంటల్ హెల్త్, క్లైమేట్ చేంజ్ ప్రభావం, యూనివర్సల్ హెల్త్ కేర్ వంటి అంశాలు ఉండవచ్చు. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు, ప్రాణాళికలు.. ప్రపంచ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు, సంస్థలను ప్రోత్సహించడం.. దేశాలు తమ ఆరోగ్య విధానాలను మెరుగుపరచడానికి ఈ రోజు ప్రేరణ కల్పిస్తుంది. ఇందుకోసం.. ఆరోగ్య సమాచారం, ఆరోగ్యం కోసం మెరుగు పరుచుకోవలసిన అంశాలు, పర్యావరణం, ఆరోగ్య సూత్రాలు.. వంటివి సూచించడం జరుగుతుంది. నిర్వహించే కార్యక్రమాలు.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. ఇవి ప్రతి గ్రామం, ప్రతి ఊరు, పట్టణాలలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వం, స్వచ్చంద ఆరోగ్య సంస్థల నేతృత్వంలో జరుగుతాయి. ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామాలు, పట్టణాల్లో ఫ్రీ మెడికల్ చెకప్‌లు, రక్తపరీక్షలు, షుగర్, BP పరీక్షలు వంటివి ఉచితంగా చేస్తారు. హెల్త్ ర్యాలీలు & అవగాహన కార్యక్రమాలు చేపడతారు. కొన్ని ప్రాంతాలలో వాకథాన్‌లు, మారథాన్‌లు, స్కూల్స్, కాలేజీల్లో అవగాహన సెషన్స్ నిర్వహిస్తారు. చాలా చోట్ల సెమినార్లు & వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. డాక్టర్లు, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రసంగాలు, మానసిక ఆరోగ్యం, పోషణపై చర్చలు వంటివి జరుపుతారు. వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కూడా ఇస్తారు. పిల్లలకు, పెద్దలకు టీకాలు వేయించడం, ప్రజల్లో ఇమ్యూనిటీ పెంపుకు తోడ్పడటం చేస్తారు. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తారు. హ్యాష్‌ట్యాగ్స్ ద్వారా అవగాహన, ఆరోగ్య చిట్కాలు పంచుకోవడం. ఆరోగ్య సమస్యల గురించి సరైన సమాచారం అందించడం, ఆరోగ్య విషయంలో చాలా చేసే నిర్లక్ష్యాల గురించి వివరించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్బాలు చెప్పడం వంటివి చేస్తారు. అందరూ చేయాల్సింది.. హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు.. ఆరోగ్యం బాగుంటే కోట్ల ఆస్తులు ఉన్నట్టే.. అందుకే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద కనబరచాలి. జాగ్రత్తలు తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రెగ్యులర్ చెకప్స్ కు హాజరు కావాలి. వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం వంటి చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని చాలా గొప్పగా మెరుగుపరుస్తాయి. ప్రతి రోజు వీటిని కొద్దిసేపు అయినా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే ఖరీదైన ఆహారం అనే అపోహను వదిలేయాలి. నోటికి రుచిగా ఉన్నది కాదు.. శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదో అది తినడం అలవాటు చేసుకుంటే.. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే భద్రంగా ఉంటుంది. *రూపశ్రీ.

Publish Date: Apr 7, 2026 2:17PM

political-news-img

సీఎస్కే వరుస వైఫల్యాలు.. అశ్విన్ ఏ మంటున్నాడంటే?

టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ఉరుములేని పిడుగులా ఐపీఎల్ కు తన రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. గత ఏడాది అనూహ్యంగా క్యాష్ రిచ్ లీగ్‌ ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన అశ్విన్.. తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను తొలిసారిగా బహిర్గతం చేశారు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో సతమతమవుతున్న తరుణంలో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత సీజన్ తన కెరీర్‌లోనే అత్యంత నిరాశాజనకమైన సమయమన్న అశ్విన్ ఫిట్‌నెస్ పరంగా తాను ఆడే స్థితిలో ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోయాననీ, అందుకే తప్పుకున్నానీ చెప్పాడు. ఐపీఎల్ 2025లో జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నఅశ్విన్.. కేవలం వ్యక్తిగత కారణాలతోనే కాకుండా జట్టు ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తాను తప్పుకోవాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నానన్నాడు. ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌కు తన వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఆ నిర్ణయం తీసుకు న్నానన్నాడు. తాను జట్టులో ఉంటే రిటెన్షన్ విషయంలో మేనేజ్‌మెంట్‌ సందిగ్ధంలో పడుతుందని, అదే తాను తప్పుకుంటే సుమారు రూ. 10 కోట్ల భారీ మొత్తాన్ని ఫ్రాంచైజీ ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని అశ్విన్ చెప్పాడు. తాను తప్పుకోవడం వల్ల జట్టుకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని తాను భావించానన్నాడు. ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలుకావడంపై స్పందించిన అశ్విన్.. జట్టులోని యువ ఆటగాళ్లను వినియోగించుకుంటున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు వారి సహజ సిద్ధమైన ప్రతిభకు తగ్గట్టుగా బాధ్యతలు అప్పగించాలన్నాడు. జెమీ ఓవర్టన్ వంటి బౌలర్లకు అలవాటు లేని యార్కర్లు వేయమని ఒత్తిడి చేయడం ఉపయోగం సంగతి అటుంచి ప్రత్యర్థికి అప్పనంగా పరుగులు ఇచ్చే పరిస్థితి ఎదురౌతుందని అభిప్రాయపడ్డాడు యువ ఆటగాళ్లకు సరైన శిక్షణ, ప్రాక్టీస్ వాతావరణం కల్పించకుండా కేవలం ఫలితాలను ఆశించడం వల్ల ప్రయోజనం ఉండదని అశ్విన్ కుండబద్దలు కొట్టేశాడు. అశ్విన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎస్కే అభిమానులైతే.. అశ్విన్ మాటలు నూటికి నూరుపాళ్లూ వాస్తవమంటున్నారు. ఇప్పటికైనా సీఎస్కే టీమ్ మేనేజ్ మెంట్ తన వ్యూహాలకు పదును పెట్టి జట్టును విజయాల బాట పట్టించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Publish Date: Apr 7, 2026 2:06PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img