ఉన్నావ్ దోషి భార్యకు బీజేపీ టికెట్

అతను బీజేపీ ఎమ్మెల్యే. 2017లో 17ఏళ్ల మైనర్ బాలికను రే-ప్ చేశాడు. 2019లో అతనికి జీవిత ఖైదు పడింది. కట్ చేస్తే, ఆయన భార్యకు లేటెస్ట్‌గా బీజేపీ టికెట్ ఇవ్వడం కాంట్రవర్సీగా మారింది. జాతీయ పార్టీకి ఇంత దిగజారుడుతనం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు. ఆమెకు టికెట్ ఇవ్వడం కరెక్టే అంటూ సమర్థించుకుంటున్నారు. ఉన్నావ్ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మైనర్ బాలికపై అత్యా.చార కేసులో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ దోషిగా తేలారు. 2019 డిసెంబర్ 20న ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ. అయితే, ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఇప్పుడు ఆయన భార్య బీజేపీ తరపున పోటీచేయబోతున్నారు. కుల్దీప్ సింగ్ సెంగార్ భార్య సంగీత సెంగార్‌కు యూపీ పంచాయితీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ టికెట్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఉన్నావ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫాతేపూర్ చౌరాసీ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. 2016లో ఆమె జిల్లా పరిషత్ చైర్మన్‌గా గెలుపొందారు. ఇప్పుడు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచారు.  రే-ప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తి భార్యకు టికెట్ ఇవ్వడాన్ని కమలనాథులు నిసిగ్గుగా సమర్థించుకుంటున్నారు. ‘‘కుల్‌దీప్ సింగ్ తప్పు చేశారు కాబట్టి ఇవాళ ఆయన జైల్లో ఉన్నారు. కుల్దీప్ చేసిన నేరాలకు అతడి భార్యను శిక్షించకూడదు. సుదీర్ఘ చర్చల అనంతరం కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు బీజేపీ టికెట్ ఇచ్చాం. ఇప్పటికే ఆమె ఉన్నావ్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ప్రజాదరణ ఉందోలేదో చూడాలి తప్ప.. నేరస్తుడి భార్య కాబట్టి పట్టించుకోకుండా వదిలేయకూడదు.’’ అంటున్నారు. తప్పు చేసినా పర్వాలేదు.. గెలిచే సత్తా ఉంటే చాలు అన్నట్టుగా బీజేపీ తీరు ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా అవేవీ పట్టించుకోవడం లేదు కమలనాథులు.
Publish Date:Apr 9, 2021

ఢిల్లీ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా!

సౌత్ ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో కాంటాక్ట్ అయిన వారిపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. లాక్ డౌన్ పిరియడ్ లో ఫుడ్ హోం డెలివరీలకు ప్రభుత్వాలు అనుమతించాయి. దాదాపు 72 మంది పిజ్జా ఆర్డర్ చేసుకున్న వారికి ఈ బాయ్ డెలివ‌రీ ఇచ్చాడ‌ట‌. అధికారులు వీరి ర‌క్త శాంప్లిస్‌ను కూడా సేక‌రిస్తున్నారు. వారందరినీ హోం క్వారెంటైన్ లో ఉంచారు. పిజ్జా డెలివరీ బాయ్ డయాలసిస్ పేషెంట్ అట‌. అత‌ను ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. అక్కడే కరోనా వైరస్ అంటుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు అతను పిజ్జా డెలివరీ చేయగా, ఇటీవల అతనిలో కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా వైరస్ హాట్ స్పాట్ కేంద్రాల్లో సౌత్ ఢిల్లీ కూడా వుంది.
Publish Date:Apr 16, 2020

అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రపంజా

అనుకున్నదంతా అయ్యింది..ఏదైతే జరక్కూడదని కేంద్రప్రభుత్వం భయపడిందో అదే జరిగింది. పవిత్ర అమర్‌నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పంజా విసిరారు. నిన్న రాత్రి అనంతనాగ్ జిల్లాలోని బటంగూ ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన ఎస్కార్ట్ వ్యాన్‌పై నిన్న రాత్రి 8.20 గంటల ప్రాంతంలో సాయుధులైన ముష్కరులు దాడి చేశారు..వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అదే సమయంలో హైవే మీదకు వస్తున్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సుకు ముష్కరుల తూటాలు తగిలడంతో ఏడుగురు యాత్రికులు మరణించగా..11 మంది గాయపడ్డారు..వీరంతా అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని వస్తున్నారు..అయితే రాత్రి 7 గంటల తర్వాత యాత్రా బస్సులు హైవే మీదకు తిరగకూడదని కానీ డ్రైవర్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకుంది పోలీసులు చెబుతున్నారు. మరోవైపు యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు..ఇలాంటి పరికిపంద చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.  
Publish Date:Jul 11, 2017

మరోసారి జమ్ముకాశ్మీర్లో చెలరేగిన అల్లర్లు....

  చాలా రోజుల నుండి ప్రశాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని గలందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీనిలో భాగంగానే భద్రతా దళాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. జతీయరహదారిపై కొంతసేపు వాహన రాకపోకలను నిలిపివేశారు. ఈ సమయంలో, భద్రతాదళాలపై అల్లరిమూకలు రాళ్లు రువ్వారు. వారిని అదుపు చేయడానికి సైనికులు టియర్ గ్యాస్ ప్రయోగించి... గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా ఎనిమిది మంది ఆందోళనకారులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Publish Date:Dec 30, 2016

మహారాష్ట్ర మంత్రి రాణే రాజీనామా

  మహారాష్ట్ర మంత్రివర్గంలో ఒక వికెట్ పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని గత కొంతకాలంగా రాజీనామా చేస్తూ ప్రభుత్వంలో అసమ్మతి నాయకుడిగా మారిన మంత్రి నారాయణ్ రాణే రాజీనామా చేశారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను తప్పితే, కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేదే లేదని రాణే చెబుతున్నారు. తనకు పక్కలో బల్లెంలా మారిన రాణేని పృథ్విరాజ్ చౌహాన్ వ్యూహాత్మకంగా మంత్రివర్గం నుంచి తానే తొలగిపోయేలా చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పృథ్విరాజ్ చౌహాన్‌ని ముఖ్యమంత్రి సీటు నుంచి తప్పించి రాణేని ముఖ్యమంత్రి చేస్తారన్న వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు రాణేనే మంత్రి పదవిని వదలాల్సి వచ్చింది. దీనినే రాజకీయం అంటారేమో!
Publish Date:Jul 21, 2014

దక్షణాఫ్రికా పర్యటనకు భారత జట్టు, జహీర్ కు చోటు

      దక్షణాఫ్రికాలో పర్యటించే భారత క్రికెట్ జట్టును బిసిసిఐ ఈ రోజు ప్రకటించింది. గత కొంతకాలంగా ఫిట్ నేస్ సమస్యలతో జట్టులో చోటును కోల్పోయిన పేసర్ జహీర్ ఖాన్ తిరిగి జట్టులో చోటును సంపాదించాడు. అయితే ఓపెనర్లు గౌతమ్, సెహ్వాగ లకు మరోసారి నిరాశ తప్పలేదు. అంబటి రాయుడుకు ఈసారి అవకాశమిచ్చారు.   భారత్ దక్షిణాఫ్రికా ఇన్విటేషనల్ ఎలెవన్ జట్టుపై భారత్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతుంది. ఆ తర్వాత మొదటి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 18వ తేదీ నుంచి న్యూ వాండరర్స్‌లో జరుగుతుంది. బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ డిసెంబర్ 25వ తేదీ నుంచి దర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో జరుగుతుంది. భారత్ డిసెంబర్ 5,8,11 తేదీల్లో దక్షిణాఫ్రికాపై వరుసగా జోహన్నెస్‌బర్గ్, దర్బన్, సెంచూరియన్‌ల్లో మూడు వన్డే మ్యాచులు ఆడుతుంది. వన్డే జట్టు: మహేంద్ర సింగ్ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, అజింక్యా రహనే, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ టెస్టు జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహనే, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ, ప్రజ్ఞాన్ ఓజా, ఇషాంత్ శర్మ
Publish Date:Nov 25, 2013

భారత్ విజయాలకు వెస్టిండీస్ బ్రేక్

      భారత్ పర్యటనలో వెస్టిండీస్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. విశాఖపట్న౦లో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ రెండు వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది. డారెన్ సామి 45బంతుల్లో 63 పరుగులు చేసి విండీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్, ధావన్ శుభారంభాన్ని అందించలేకపోయారు. ఆ తరువాత కోహ్లి 99, ధోని 51 నాటౌట్ గా నిలిచి ఇండియాకు 288 పరుగులను అందించారు.     289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. చార్లెస్ 12, ఆతరువాత వచ్చిన శామ్యూల్స్ 8 పరుగులు చేసి వెంటనే అవుటయ్యారు. ఈ స్థితిలో విండీస్ ను పావెల్, డారెన్ బ్రావో శతక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఆ తరువాత సిమన్స్ 62, డారెన్ సామి 63 పరుగులు చేసి వెస్టిండీస్ కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో విశాఖలో భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది.   
Publish Date:Nov 25, 2013

వెస్టిండీస్ తో రెండో వన్డేకు 'వర్షం' దెబ్బ

      భారత్, వెస్టిండీస్ మధ్య రేపు విశాఖపట్నంలో జరగనున్న రెండో వన్డే కు వర్షం ఆటంకంగా మారె అవకాశం ఉంది. రెండు రోజులుగా విశాఖలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మైదానం మొత్తం నీటితో నిండివుంది. అత్యాధునిక డ్రైనేజ్ విధానం కలిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో మ్యాచ్ ఆరంభానికి కనీసం ఆరు గంటలకు ముందు వర్షం నిలిచిపోతే మ్యాచ్ నిర్వాహణకు ఎటువంటి ఆటంకం ఉండదని ఎసిఎ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి మ్యాచ్ సాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాయంత్రం ప్రాక్టీస్‌కు మైదానం అనుకూలిస్తుందని భావిస్తున్నారు. రెండో వన్డే మ్యాచ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇరు దేశాల జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నాయి.
Publish Date:Nov 23, 2013

కొత్త ప్రపంచ ఛా౦పియన్ 'కార్ల్‌సన్‌'

      ప్రపంచ చెస్ సరికొత్త చాంపియన్ గా యువ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ ఆవిర్భవించాడు. సొంతగడ్డపై ఐదుసార్లు చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు షాకిచ్చాడు. నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ తొలిసారిగా ప్రపంచ చాంపియన్‌షిప్ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పదో రౌండ్‌ను డ్రా చేసుకున్న కార్ల్‌సన్ 12 గేమ్‌ల ఈ మ్యాచ్‌లో మరో రెండు రౌండ్లు మిగిలుండగానే టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు.   పది రౌండ్లు ముగిసే సరికి 6.5-3.5తేడాతో చాంపియన్‌గా నిలిచాడు. ఈ పది రౌండ్లలో మూడు గేమ్‌లు నెగ్గిన కార్ల్‌సన్, ఏడు గేమ్‌లు డ్రా చేసుకున్నాడు. కాగా, సొంతగడ్డపై నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆనంద్ ఒక్క గేమ్‌లో కూడా విజయం సాధించలేకపోయాడు. ఆనంద్ 2000, 2007, 2008, 2010, 2012లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లు సాధించాడు. ఆనంద్ తన 22 ఏళ్ల కెరీర్‌లో కనీసం ఒక్క విజయం కూడా లేకుండా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను ముగించడం ఇదే తొలిసారి.
Publish Date:Nov 23, 2013

నయన్ తో శ్రీశాంత్ వివాహం

      ఐపిఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో జైలుకు వెళ్లిన బెయిల్ పై బయటకు వచ్చిన క్రికెటర్ శ్రీశాంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. శ్రీశాంత్ వివాహం గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో డిసెంబర్ 12న జరగనుందని శ్రీశాంత్ తల్లి సావిత్రి దేవి తెలిపారు. రాజస్థాన్ కు చెందిన ఓ రాయల్ కుటుంబానికి చెందిన నయన్ తో శ్రీశాంత్ వివాహం జరగనుంది. వీరిద్దరూ గతకొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీశాంత్ జైలుకి వెళ్ళిన సమయంలో నయన్ ఆసరాగా నిలిచి, తన ప్రేమను చాటుకుంది. దాంతో వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు కూడా ఒప్పేసుకున్నారు. శ్రీశాంత్ పెళ్లి వివరాలు త్వరలోనే మరిన్ని తెలియనున్నాయి.
Publish Date:Nov 19, 2013

సచిన్ 74 ఔట్

      క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కెరీర్ చివరి మ్యాచ్‌లో 74 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. శుక్రవారం ఉదయం జోరుతో ఆట ప్రారంభించిన సచిన్ 112 బంతుల్లో 12 ఫోర్లతో 74 పరుగులు చేసి అవుట్ అయ్యారు. సచిన్ ఆట తీరు చూసేందుకు యూపీఏ వైస్ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీ, నటులు అమీర్‌ఖాన్, హృతిక్ రోషన్, వెంకటేష్ పలువురు ప్రముఖులు స్టేడియంకు తరలివచ్చారు. సచిన్ పెవిలియన్ వెళ్లే సమయంలో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు. ఈ క్రమంలో సచిన్ తల్లి భావోద్వేగానికి గురయ్యారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 221 పరుగులతో ఆధిక్యంలో ఉంది.
Publish Date:Nov 15, 2013

నేటి నుంచే సచిన్ ఆఖరి మ్యాచ్

      ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్ కు ముగింపు పలికే ఆ పోరు ఈ రోజు మొదలైంది. క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన ముంబై గడ్డపైనే ఈ పరుగుల వేటగాడు ఆఖరి ఆట ఆడుతున్నాడు. తన 200వ టెస్ట్‌తో తన పరుగుల దాహానికి పరిసమాప్తి పలుకనున్నాడు. మ్యాచ్ జట్ల మధ్యే జరుగుతున్న దృష్టంతా ఆ ఒక్కడిపైనే...ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ మ్యాచ్ లోనూ సచిన్ పై భారీగా అంచనాలున్నాయి. సచిన్ టెండూల్కర్ శతకంతో కెరీర్ కు ముగిస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.   మరోవైపు మొదటి మ్యాచ్ లో విజయంతో జోరు మీదున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి మాస్టర్ కు ఘనమైన వీడ్కోలు పలకాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్లోనైనా గెలిచి భారత అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లాడానికి వెస్టిండీస్ సిద్దమైంది.
Publish Date:Nov 13, 2013

ఇండియా టార్గెట్ 351

      ఇండియాతో జరుగుతున్న ఆరో వన్డే మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, భారత్ ముందు 350 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దీగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 350/6 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్లను త్వరగా కోల్పోయిన ఆస్ట్రేలియా... ఆతరువాత వాట్సన్, కెప్టెన్ బెయిలీ సెంచరీలతో వీర విహారం చేశారు. కెప్టెన్ బెయిలీ156 (114బంతుల్లో13ఫోర్లు6 సిక్సర్లు), వాట్సన్102 (94బంతుల్లో13ఫోర్లు3సిక్సర్లు) చేయడంతో భారీ స్కోరు చేయగలిగింది. వోజేస్ 44 పరుగులతో నాటౌట్ నిలిచాడు. ఇండియా బౌలర్లలో అశ్విన్, జడేజా రెండేసి వికెట్లు తీయగా..భువనేశ్వర్, షామి ఒక వికెట్ తీశారు.
Publish Date:Oct 30, 2013