సుబ్బారావు వెనుక సుబ్బారెడ్డి! బాలినేనికి వైవీ చెక్? గుప్తాతో గూడుపుఠాని!

ఎక్కడైనా బావే.. కానీ వంగతోట కాడ కాదంటారు. అలాగే ఎక్కడైనా బావే.. కానీ రాజకీయంగా కాదంటారు టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. త‌న బావ‌ బాలినేని శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనేందుకు టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎంత చేయాలో అంత చేస్తున్నారనే టాక్ అయితే ప్రకాశం జిల్లాలో యమ స్పీడ్‌గా నడుస్తోందీ. శత్రువుకు శత్రువు.. మనకు మిత్రుడు అనే కాన్సెప్ట్‌ను ఎంచుకున్న వైవీ సుబ్బారెడ్డి.. ఆ దిశగా తనదైన స్టైల్‌లో ముందుకు వెళ్తున్నారని సమాచారం. 

ఆ క్రమంలో ఒంగోలుకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సుబ్బారావు గుప్తాను ఇటీవల తెరపైకీ తీసుకు వచ్చి.. తిరుమల వెంకన్న సాక్షిగా నీకు అండ.. దండ.. నేను ఉన్నానంటూ అతడికి వైవీ సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారనే టాక్ అయితే ఒంగోలు మహానగరంలో చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగానే టీటీడీ బోర్డు చైర్మన్‌ వారి ఆశీస్సులతోనే సుబ్బారావు గుప్తా... అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో మీడియా సాక్షిగా ప్రెస్ మీట్లు పెట్టీ మరీ చెలరేగిపోతున్నారని తెలుస్తోందీ. 

గతేడాది డిసెంబర్ 12న వైవీ సుబ్బారెడ్డి బావ.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగన్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల.. భవిష్యత్తులో తామంతా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలు.. మంత్రి బాలినేని వాసన్న మనస్సులో అలజడిని రేపాయి. దీంతో బాలినేని వాసన్న గ్యాంగ్ రంగంలోకి దిగి.. ప్రాణ భయంతో గుంటూరులో దాక్కున్న సుబ్బారావు గుప్తాపై వాసన్న రైట్ హ్యాండ్ సుభానీ దాడి చేసి.. మొకాళ్ల మీద కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించడం.. ఆ తర్వాత మంత్రి బాలినేని స్వయంగా సుబ్బారావు గుప్తాకు కేకు తినిపించడం వరకు మొత్తం ఎపిసోడ్ వీడియో అంతా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.  అయితే ఈ దాడిపై ఆర్యవైశ్య సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. అయినా జగన్ పార్టీకి జరగాల్సిన నష్టమంతా అప్పటికే జరిగిపోయిందీ. 

కానీ ఈ ఎపిసోడ్ మొత్తంలో దెబ్బలు తిని బాధితుడిగా మారిన సుబ్బారావు గుప్తా మాత్రం జనంలో హీరో అయ్యారు. ఆ  తర్వాత సుబ్బారావు గుప్తా.. విజయవాడ వేదికగా ఆర్య వైశ్య సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం... రాష్ట్రమంతా పర్యటించి... తనపై జరిగిన దాడిని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తానని ప్రకటించడం.. అందులో భాగంగా స్వయంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ముఖ్యంగా మంత్రుల తీరును బహిరంగంగానే ఎండగట్టడం.. తమ ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంచి నాయకుడు, కమలహాసన్‌లా మంచి నటుడంటూ కితాబు ఇవ్వడం.. ఆయన వద్దకు వచ్చి.. క్లాసులు చెప్పించుకోవాలంటూ మంత్రి కొడాలి నానికీ సుబ్బారావు గుప్తా మీడియా సాక్షిగా సూచించడం.. 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగుతానంటూ.. బల్లగుద్దీ మరీ సుబ్బారావు గుప్తా ప్రకటించడం.. ఈ మొత్తం వ్యవహారమంతా.. బాలినేని వాసన్న బావమరిది టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందనే టాక్ అయితే ప్రకాశం జిల్లాలోనే కాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వైరల్ అవుతోంది. 

గతేడాది డిసెంబర్ 12వ తేదీ వరకు జగన్ పార్టీలో ఓ సాధారణ కార్యకర్తగా ఉండడమే కాకుండా.... మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే భయం భక్తి కలిగిన ఓ పార్టీ కార్యకర్తగా... మంత్రి బాలినేని ముఖ్య  అనుచరుడుగా ఉండి.. బయట ప్రపంచానికి అంతగా తెలియని.. ఈ సుబ్బారావు గుప్తా.. జస్ట్ 50 అంటే 50 రోజుల్లో ఇంతగా.. ఇంతలా ధైర్యంగా అధికార పార్టీ మంత్రులనే  టార్గెట్ చేస్తూ వారిపై ఇలా చెలరేగిపోవడం వెనక కచ్చితంగా పెద్దల హస్తం తప్పకుండా ఉందని ఆర్య వైశ్య సంఘం నేతలు గుసగుసలాడుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

ఏదీ ఏమైనా ఈ సుబ్బారావు గుప్తా వెనక ఉన్నది ఏవరన్నదీ మాత్రం ఆ దేవదేవుడు తిరుమల వెంకన్నకే ఎరుక అని సోషల్ మీడియాలో అయితే కామంట్లు వస్తున్నాయి. అయితే 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైయస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి గెలవగా.. అదే ఎన్నికల్లో అదే అసెంబ్లీ  స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటికే ఈ బావ, బావమరుదుల మధ్య గ్యాప్ ఉంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య దూరం చాలా చాలా బాగా పెరిగిందీ. ఒకానొక సమయంలో వీరి మధ్య ఏర్పాడిన గ్యాప్ తగ్గించేందుకు నాటి ప్రతిపక్షనేత వైయస్ జగన్ జోక్యం చేసుకున్న ఫలితం లేకపోయిందని ఆ పార్టీ నేతలే ఇప్పటికీ చెప్పుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. 

ఆ క్రమంలోనే వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టేటట్లు.. బాలినేని శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించేటట్లు.. ముందుగానే వైయస్ జగన్ సాక్షిగా వీరిద్దరి మధ్య ఓ డీల్ అయితే గతంలోనే  కుదిరిందనే టాక్ ప్రకాశం జిల్లా సరిహద్దులోని గిద్దలూరులో సైతం ప్రచారంలో ఉంది. మరి మంత్రి బాలినేని వారికి ఇంతలా చెక్ పెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి వారు కాకుంటే ఇంకెవరైనా ఉండి ఉంటారా? అని ప్రకాశం జిల్లా వాసులు ఆలోచిస్తున్నారు. ఏదీ ఏమైనా ఇంతకీ సుబ్బారావు గుప్తాను ఆడిస్తుందీ ఎవరనేది మాత్రం ఆ పెరుమాళ్ల వారకే ఎరుక.