Latest News
జగన్ బాబోయ్ జగన్!
posted on: Jan 31, 2014 11:38AM

తనను చూసి తనని వ్యతిరేకించే పార్టీల వాళ్ళు భయపడాలని వైకాపా నాయకుడు జగన్ కోరుకుంటూ వుంటే వుండొచ్చు. అయితే ఆయన్ని చూసి బయటి పార్టీల వాళ్ళు భయపడే సంగతి అటుంచితే, ఆయన పార్టీలో వాళ్ళే జగన్‌ని చూసి భయపడుతున్నారు. జగన్ పేరు చెబితేనే జగన్ బాబోయ్ జగన్ అంటూ ఉలిక్కిపడుతున్నారు. జగన్ వ్యవహారశైలిని తట్టుకోలేక పార్టీలోని అనేకమంది సీనియర్ నాయకులు మెల్లగా పార్టీలోంచి బయటకి జారుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొంతమంది ఇప్పటికే ఇతర పార్టీల్లో స్థానాన్ని కన్ఫమ్ చేసుకుని, పార్టీ మారడానికి మంచి మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా చాలామంది ఏ పార్టీలో ఖాళీలున్నాయో వెతుక్కుంటున్నారు.
ఇతర పార్టీలలోనుంచి వైకాపాలోకి జంప్ జిలానీలు అవ్వాలని అనుకున్న కొంతమంది ఇప్పుడు అలాంటి ఆలోచనలు మానుకుని బుద్ధిగా వున్న పార్టీలలోనే గప్‌చుప్‌గా వుంటున్నారు. ఈ పరిస్థితి ఇలా వుంటే, వైకాపా కార్యకర్తలు జగన్ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఆయన మీటింగులూ గట్రాలు ఏవైనా ఏర్పాటు చేస్తే వాటికి వెళ్ళాలంటే వణికిపోతున్నారు. ఎందుకంటే జగన్ చుట్టూ కొంతమంది డిటెక్టివ్ పుస్తకాల్లో వర్ణించేలాంటి ‘దృఢకాయులు’ వలయంలా వుంటారు. ఎవరైనా అభిమానం ముదిరిపోయి జగన్‌కి దగ్గరగా వస్తే వెనకా ముందూ చూడకుండా వాళ్ళని తుక్కురేగేలా కొడుతూ వుంటారు. వాళ్ళు అలా కార్యకర్తల్ని చావబాదుతున్నా జగన్ గారు ఎంతమాత్రం పట్టించుకోకుండా చిరునవ్వుతో ముందుకు వెళ్తూ వుంటారు.
ఇలాంటి పరిస్థితులు చాలా సందర్భాలలో తలెత్తడంతో పార్టీ కార్యకర్తలు జగన్ దరిదాపుల్లోకి రావాలంటేనే భయపడుతున్నారు. ఈమధ్య ఓ మీటింగ్‌లో తప్పతాగిన ఒక కార్యకర్త గారు జగన్ లేడీస్‌ని మాత్రమే దగ్గరకి రానిస్తున్నారని, వాళ్ళ తలలు మాత్రమే నిమురుతున్నారని, మగ కార్యకర్తలను దగ్గరి కూడా రానివ్వడం లేదని పెద్ద గొంతుతో అరిచేశాడు. అక్కడితో ఆగకుండా జగన్ మీద ఒక రాయి కూడా విసిరేశాడు. దాంతో జగన్ చుట్టూ వున్న దృఢకాయుల బ్యాచ్ సదరు కార్యకర్తని ఎముకల్లో సున్నం కూడా లేకుండా విరగ్గొట్టేశారట. అదీ విషయం!






