వివేకా హత్యలో ఆ ఇద్దరు ప్రముఖులెవరు? వాచ్ మెన్ రంగన్నను ఎందుకు బెదిరించారు? 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య అలియాస్ రంగన్న ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వివేకాకు సన్నిహితుడిగా ఉండే ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించాడంటూ వాచ్ మెన్ రంగన్న చెప్పడం కలకలం రేపుతోంది. అంతేకాదు హత్యలో ఇద్దరు ప్రముఖులు ఉన్నారని చెప్పడంతో.. ఆ ఇద్దరు ఎవరన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. వివేకా హత్యకు 8 కోట్ల రూపాయల సుపారీ జరిగిందనే వార్తలు వస్తుండటంతో... పెద్ద తలకాయల హస్తం ఉందనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది. 

వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంత కాలం పెదవి విప్పని ఆయన వాచ్‌మన్ రంగన్న ఇప్పుడు బహిరంగంగానే పలు విషయాలను వెల్లడిస్తున్నారు.  వివేకా హత్యకు ముందు అర్ధరాత్రి ఎవరో కొందరు ఇంట్లోకి వచ్చారని రంగన్న చెప్పారు. వాళ్లు ఎవరో తనకు తెలియదన్నారు.  ఎర్ర గంగిరెడ్డి వివేకాతోనే ఉంటారు.. నాతో ఎన్నోసార్లు మాట్లాడారు.. ఇప్పుడు నేనెవరో తెలియదంటే ఏమనుకోవాలి..?  అని రంగన్న ప్రశ్నించారు. తనకేమీ కాదని అంటేనే సీబీఐకి అన్ని విషయాలు చెప్పానన్నారు. 

వివేకా హత్య కేసులో జమ్మలమడుగు న్యాయమూర్తి ఎదుట శుక్రవారం వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మన్‌ రంగయ్య..  స్థానికులు, మీడియా ప్రతినిధుల ఎదుట పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ‘‘ఆ ముగ్గురిలో ఒకరు... తమ పేర్లు బయటికి చెబితే నన్ను నరికేస్తామన్నారు.. అందుకే... భయపడ్డానని చెప్పారు. సీబీఐ సారోళ్లు మేమున్నామని ధైర్యం చెప్పడంతో ఏమైనా కానీ అని  కోర్టులో అవే చెప్పానని  రంగయ్య వివరించారు. ‘గురువారం నన్ను సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు లేదంటే మళ్లీ కడపకు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం మళ్లీ జమ్మలమడుగుకు తీసుకెళ్లి కోర్టులోకి పంపించారు. రాత్రి పెద్ద సారోళ్లు పులివెందులకు తీసుకొచ్చి జేఎన్‌టీయూ వద్ద వదిలేశారు. నా ఖర్చులకు ఏమైనా ఇవ్వండి సార్‌ అంటే ఢిల్లీ పెద్దసారు 15 వందలు ఇచ్చారు"  అని వాచ్ మెన్ రంగయ్య చెప్పారు. 

మరోవైపు వాచ్ మెన్ రంగన్న తనపై ఆరోపణలు చేయడంపై స్పందించారు ఎర్ర గంగిరెడ్డి.  వివేకానందరెడ్డి తనకు దేవుడితో సమానమని చెప్పుకొచ్చారు. తాను చీమకు కూడా హాని చేయనని తెలిపారు. కేవలం వివేకాతో తాను సన్నిహితంగా వుండటం వల్లే కేసులు పెట్టారని స్పష్టం చేశారు. వాచ్‌మెన్ రంగన్నను వివేకా ఇంట్లో చూశానే తప్ప ఏ రోజూ మాట్లాడలేదన్నారు గంగిరెడ్డి. రంగన్నను  తాను బెదిరించింది అవాస్తవమన్నారు. వివేకా హత్యకేసులో  నా ప్రమేయం ఉందని అతను నాపై ఎలా చెబుతున్నాడో అర్ధం కావట్లేదన్నారు. వివేకా హత్యకేసులో  నా ప్రమేయం ఉందంటే నేను ఏ శిక్షకైనా సిద్ధం.. ఏ ప్రమాణానికైనా సిద్ధమన్నారు గంగిరెడ్డి. హత్య జరిగిన ముందురోజు రాత్రి ముందు వివేకాతో కలిసే ఉన్నానని, నన్ను మా ఇంటి దగ్గర దింపి ఆయన ఇంటికెళ్లారని గంగిరెడ్డి తెలిపారు. హత్య జరిగిందని ఉదయం 7 గంటలకు వివేకా బావమరిది తనకు కాల్ చేసి చెప్పారన్నారు. వివేకా కుమార్తె సునీత కూడా తనను వివరాలు అడిగారన్నారు.