తెలుగుదేశంలో ఇక యువ జోష్!

తెలుగుదేశం మహానాడులో యువజోష్ ఉరకలెత్తుతోంది. పార్టీని గెలుపు దిశగా నడిపించేందుకు యువతకు వచ్చే ఎన్నికల్లో 40 శాతం స్థానాలు కేటాయిస్తామని అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. నాలుగు దశాబ్దాల నాడు తెలుగుదేశం యువరక్తంతో కదంతొక్కిన సంగతి ఇప్పుడు ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు సంతకంగా ఇంత కాలం నిలుస్తూ వచ్చిందంటే ఆ నాడు పడిన పునాదుల మీద.. తెలుగువారి ఖ్యాతి, సత్తా, సమర్ధతా చాటుతూ వారి అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూ సాగుతుండటమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల పండుగను సగర్వంగా నిర్వహించుకుంటోంది.

అయితే రానున్న కాలంలో పార్టీ మరింత దూకుడుగా, పోరాట పటిమతో ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి స్థితిలో పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు నెత్తురు మండే, శక్తులు నిండే యువ శక్తి అవసరం ఎంతైనా ఉంది. దానిని గుర్తెరిగే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో  40శాతం సీట్ల యువతకే అని ప్రకటించారు. అంతటితో ఆగకుండా పని చేసేవారికే పదవులని అన్నారు.  ఆ తరువాత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శినారా లోకేష్ మాటలు రానున్న కాలంలో పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టమౌతోంది.

లోకేష్ చెప్పిన అంశాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో విస్తృత చర్చకు తేరలేపాయి. వరుసగా మూడు సార్లు ఓడిన వారికి పార్టీ టికెట్ ఇచ్చేది లేదనీ, ఈ విషయాన్ని ఇప్పటికే అధినేత పొలిట్ బ్యూరోలో స్పష్టం చేశారనీ లోకేష్ చెప్పారు. అలాగే ఒక వ్యక్తి పార్టీలో ఒకే పదవిని రెండు సార్లు చేపడితే మూడో సారి బ్రేక్ తప్పదని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీలో ప్రతిపాదించాననీ, దానిపై చర్చ జరుగుతుదనీ చెప్పిన లోకేష్ తన ప్రతిపాదనను తనతోనే ఆచరణలో పెడతానని కుండ బద్దలు కొట్టారు. పార్టీ జాతీయ కార్యదర్శిపదవికి వచ్చేసారి బ్రేక్ తీసుకుంటానని చెప్పారు.    పార్టీలోకి కొత్త తరం, కొత్త రక్తం, కొత్త నాయకత్వాన్ని ప్రొత్సహించడానికి తనతోనే కార్యాచరణను మొదలు పెడతానని చెప్పిన లోకేష్.. ఎన్నికల్లో విజయం సాధించాలంటే డబ్బే ప్రధానం కాదన్నారు. అదే సమయంలో డబ్బు కూడా అవసరమేనని చెప్పారు.

ప్రతి విషయాన్నీ హేతు బద్ధంగా వివరిస్తూ పరిణితి చెందిన నేతలా లోకేష్  భవిష్యత్ లో  పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టబోయే చర్యలను విపులంగా వివరించారు. ఇక లోకేష్ ప్రతిపాదించిన కీలక అంశం ఏమిటంటే.. అధికారంలోకి వచ్చిన అనంతరం పార్టీకీ, ప్రభుత్వానికీ మధ్య గ్యాప్ లేకుండా చూసేందుకు అవసరమై చర్యలు తీసుకోవడం. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పాలనా పరంగా ప్రజారంజకంగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వానికీ పార్టీకీ మధ్య అంతరం పెరిగిపోయిందన్న వాదన పార్టీ శ్రేణుల నుంచి బాగా వినిపించేది.  

దీనితో ప్రభుత్వ పథకాల గురించి పార్టీ శ్రేణులు ప్రజలలోకి తీసుకువెళ్లే అవకాశం లేకుండా పోయేది. అది పార్టీకి ఒకింత నష్టం చేసిందని లోకేష్ గుర్తించినందునే అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీకి, ప్రభుత్వానికి గ్యాప్ తగ్గించేలా విస్పష్ట చర్యలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు.  అధికారంలో ఉండగా జరిగిన తప్పిదాలను గుర్తించి, మరోసారి అవి పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకునే దిశగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత తీసుకున్న లోకేష్ ను పార్టీ శ్రేణులు ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి.  ప్రతిపాదించిన మార్పులను ఆచరణలో పకడ్బందీగా అమలు చేస్తే తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.