భానుమతి సినిమాకు అందుకే రాయలేనని చెప్పా: యర్రంశెట్టి సాయి

ఆయన పరిచయం అక్కర్లేని పేరున్న రచయిత, మాజీ రైల్వే అధికారి.... యర్రంశెట్టి సాయి. హ్యూమరాలజీ పేరిట ఒక తరాన్ని దశాబ్ద కాలం పాటు ఊపేసిన సాయి గారి పోస్టులు ఈ మధ్య సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సెటైర్లకు, పదునైన వ్యాఖ్యలకు యర్రంశెట్టి సాయి పెట్టింది పేరు. అభినేత్రి భానుమతి తో తనకున్న చిన్నపాటి అసోసియేషన్ పై ఆయన పెట్టిన పోస్టు, భానుమతి అభిమానులందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. అదేదో ఆయన మాటల్లోనే చదవండి.... " ఎవరో భానుమతి ఫోటో పెట్టారు FB లో.వెంటనే ఒక ఫ్లాష్ బాక్ గుర్తుకొచ్చింది. భానుమతి గారిని ఒకసారి చెన్నై లో కలుసుకున్నాను. ఆ వివరాలు చెప్తాను.

నేను రైల్వే అని మీకు తెలుసుకదా. ఒకసారి మా బాస్ (శాస్త్రి గారు)ఫోన్ చేసి, సాయీ. నువ్వు అర్జెంట్ గా చెన్నై వెళ్లి భానుమతి గారిని కలుసుకో. ఆమె ఒక మూవీ తీస్తున్నారు. దానికి నిన్ను రైటర్ గా పెట్టుకోమని ఆమెకు చెప్పాను అన్నారు.(శాస్త్రి గారికి భానుమతి గారు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అని నాకు తెలుసు.) నేను అప్పటికే రెండు మూడు సినిమాలకు వర్క్ చేసి వున్నాను. నాకున్న ప్రాబ్లెమ్ ఏమిటంటే అప్పటికే చాలా అద్భుతమైన ఇంగ్లీష్ మూవీస్ చూసి వుండటం చేత నాకు తెలుగు సినిమా కథలు ఓ పట్టాన నచ్చేవి కావు.

నాకు మూవీ బ్రాడ్ అవుట్ లైన్ నచ్చక పోతే, మొదట్లోనే తప్పుకుంటాను.నాకు ఏమాత్రం నచ్చని సినిమాలు చాలా సక్సెస్ అయాయి కాబట్టి నా తింకింగ్ కరెక్ట్ కాకపోవచ్చు. భానుమతి గారు తను తీయాలనుకుంటున్న సినిమా కథ చెప్పారు. కథ సగం లోనే నాకు అర్థమై పోయింది.ఆ కధ సినిమాకి పనికి రాదని. అదే ఇంకెవరైనా అయితే సారీ. నేను ఈ కధకి న్యాయం చెయ్యలేను అని చెప్పి తప్పుకునే వాడిని. కానీ ఎదురుగ్గా ఉన్నది భానుమతి గారు. ఆమె సినిమాలు అన్నా,ఆమె నటన అన్నా ఎంతో ఇష్టం నాకు.ఎందుకంటే ఆమె కామెడీ కూడా అద్భుతంగా చేశారు.

పైగా ఆమె మంచి రచయిత్రి. ఆ పరిస్థితుల్లో సారీ ఎలా చెప్పాలి అనేది నాకు పెద్ద సమస్య అయిపోయింది. ఎంతో కష్టం మీద ఎన్నో కారణాలు చెప్పి తప్పించుకున్నాను. తరువాత ఆమె ఆ సినిమా నిర్మించారు. అది ఫ్లాప్ అయింది. బహుశా అదే ఆమె తన స్వంత బ్యానర్ మీద నిర్మించిన ఆఖరి చిత్రం అనుకుంటాను. అదే ఆ మహానటి తో నాకున్న అనుబంధం, " అంటూ యర్రంశెట్టి సాయి చెప్పుకుంటూ వచ్చారు. ఇదీ, తానూ అభిమానించే మహానటి, రచయిత్రి కూడాఅయిన భానుమతి గురించి సాయి చెప్పుకొచ్చిన ఇంటరెస్టింగ్ పాయింట్..