డీలిమిటేషన్ కు సై.. కేంద్రం మాటే వైసీపీ మాట!

posted on: Apr 16, 2026 2:21PM

దేశవ్యాప్తంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ( ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా ఈ ప్రక్రియ పట్ల ప్రాంతీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయనే వాదన ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం   భిన్నంగా స్పందించింది. కేంద్రం ప్రతిపాదించిన ఈ నియోజకవర్గాల పెంపు నిర్ణయాన్ని ఆ పార్టీ స్వాగతించింది. 

ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు.   పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు. 

వాస్తవానికి దక్షిణాదికి చెందిన పలువురు కీలక నేతలు, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వారు ఈ పునర్విభజన అంశంపై గట్టిగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన స్థానాల పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వారిలో ఉంది. ఈ నేపథ్యంలో వైకాపా కూడా ఇదే బాటలో నడుస్తుందని అంతా భావించారు. అయితే  సజ్జల చేసిన వ్యాఖ్యలు ఆ అభిప్రాయం తప్పని రుజువు చేశాయి.  

కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎలాగూ ఎన్డీయేలో భాగంగా ఉండటంతో అవి ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. అయితే ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా వైసీపీ  కేంద్ర నిర్ణయానికి మద్దతు ప్రకటించడం గమనార్హం.  పరిశీలకులు వైసీపీ స్టాండ్ పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  అమరావతి చట్టబద్ధత నుంచి తీసుకుంటే.. ఆ పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకూ వ్యతిరేకంగా ఉన్నా సరే కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ స్వాగతించడం లేదా అభ్యంతరం తెలపకపోవడం వైసీపీ విధానంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ పార్టీ అధినేత కేసుల భయంతోనే కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తే ధైర్యం చేయడం లేదని అంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...