అమిత్ షాను వైసీపీ ఎంపీలు ఎందుకు కలిశారో?

కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షాను కలిశారు వైసీపీ ఎంపీలు,  వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభలో పార్టీ నేత మిథున్ రెడ్డి.. అమిత్ షాతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు పలు విషయాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని సమావేశం తర్వాత వైసీపీ ఎంపీలు చెప్పారు.  ప్రభుత్వం తరపున ఒక నివేదికను అందించామని తెలిపారు.

ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనాల వ్యయానికి ఆమోదముద్ర వేయాలని అమిత్ షాను వైసీపీ ఎంపీలు కోరారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరించాలని విన్నవించారు. ఇటీవల సంభవించిన వరదల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని... వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందించాలని కోరామని వైసీపీ ఎంపీలు వెల్లడించారు. 

సీఎం ఇంటి స‌మీపంలో దొంగ‌ల ముఠా.. క్రైం కేపిట‌ల్‌గా తాడేప‌ల్లి?

అయితే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు అమిత్ షాను కలవడంపై మరో చర్చ కూడా జరుగుతోంది. ఇటీవల కాలంలో కేంద్రం నుంచి ఏపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులున్నాయి. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కార్ కు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తోంది కేంద్రం. అప్పుల విషయంలో ఆరా తీస్తోంది. కేంద్రం నిధులను పక్కదారి పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీ నిధులను తరలింపును అడ్డుకుంది. కేంద్ర పథకాలను వైఎస్సార్, జగనన్న పేర్లు పెట్టొద్దని ఆదేశించింది.

ఇలా వరుసగా జగన్ సర్కార్ కు షాకులు ఇస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఆదేశాలతోనే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి... అమిత్ షాను కలిశారని అంటున్నారు. కేంద్రానికి అండగా ఉంటామని, తమకు సహకరించాలని రాజీ బేరానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. తమకు కొరకరాని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయాన్ని అమిత్ షా దృష్టికి మరోసారి వైసీపీ ముఖ్య నేతలు తీసుకెళ్లారని తెలుస్తోంది. 

కొండెక్కిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీకి ఆధారాలు దొరకలేదట..