Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్తరాంధ్ర వైసీపీలో ఎవరికి వారే యమునా తీరే!
posted on: Apr 22, 2026 4:35PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముఖద్వారంగా భావించే ఉత్తరాంధ్రలో వైపీపీ ప్రభ పూర్తిగా మసకబారింది. గతంలో ఈ ప్రాంతంపై పట్టు సాధించిన వైసీపీ ప్రస్తుతం చతికిలపడింది. పొలిటికల్ గా ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ఇసుమంతైనా ప్రభావం చూపలేని పరిస్థితులకు దిగజారింది. గత ఎన్నికలలో ఓటమి తరువాత ఆ పార్టీ ఉత్తరాంధ్ర నేతలలో అంతర్గతవిభేదాలు ఈ ప్రాంతంలో పార్టీ కుదేలయ్యేలా చేశాయి.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు. దీంతో ఆయన చేసేదేం లేక చేతులెత్తేసి విశాఖ నగరానికే పరిమితమయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పూర్తిగా ధర్మాన సోదరులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వంటి నేతలను స్థానిక నాయకత్వమే పక్కన పెట్టింది. ఇందుకు విరుద్ధంగా, కింజరాపు కుటుంబం నేతృత్వంలో టీడీపీ జిల్లా వ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. జనసేన మద్దతు కూడా తోడవడంతో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఇక పుంజుకోవడం కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే విధంగా విజయనగరంలోనూ వైసీపీ కుదేలైంది. ఒకప్పుడు జిల్లాపై గట్టి పట్టున్న బొత్స సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో పార్టీ ముక్కలు ముక్కలుగా చీలిపోయి వర్గపోరు పరాకాష్టకు చేరుకుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాగా జిల్లాలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఐక్యంగా పని చేస్తుండటంతో జిల్లాలో కూటమి బలం పెరిగింది.
ఇక విశాఖ జిల్లాలో వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. అక్కడ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు గుడివాడ అమర్నాథ్ కు పార్టీ అధిష్టానం ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. ఇక మిగిలిన స్థానిక నేతలు కూడా పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో జిల్లాలో వైసీపీ పరిస్థితి ఉండీ లేనట్లుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏ రకంగా చూసినా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వైసీపీ వర్గపోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కీలక నేతల మధ్య ఉన్న విభేదాలు, సమన్వయ లేమి కారణంగా ఆ పార్టీ క్యాడర్ నిస్తేజంగా మారిపోయింది. తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే ఈ ప్రాంతంలో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.






