ఎన్నికల్లో వందల కోట్ల ఖర్చు.. కరోనా కష్టాల్లో కనిపించని నేతలు

ఏ ఎన్నిక వ‌చ్చినా అభ్య‌ర్థులు ఈజీగా ఓ 20 నుంచి 50  కోట్లు ఖ‌ర్చు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఇదీ ఇంకా ఎక్కువే. ఒక్కో ఓటుకు వేల‌కు వేలు ఇస్తారు.  ఎన్నిక‌ల కోస‌మే అన్ని కోట్లు ఖ‌ర్చు చేసి ప్ర‌జాప్ర‌తినిధులుగా గెలిచిన నాయ‌కులు.. గెలిచాక త‌మను గెలిపించిన ప్ర‌జ‌ల కోసం ఒక్క రూపాయి అయినా ఖ‌ర్చు చేస్తున్నారా? అనేది ప్ర‌శ్న‌. అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. ఇసుక నుంచి, మైన్ల నుంచి, మ‌ద్యం షాపుల నుంచీ, ప్రాజెక్టులు, అభివృద్ధి ప‌నుల నుంచి కోట్ల‌కు కోట్లు దండుకుంటున్నారు. వ‌సూల్ రాజాలుగా మారుతున్నారు. ఇలా ఈ రెండేళ్ల కాలంలోనే అనేక మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. వంద‌ల కోట్ల‌కు ప‌డ‌గెత్తారు. ఇక ప్ర‌జ‌ల‌కు అంద‌నంత ఎత్తుకు ఎదిగిపోయారు. 

ఎంత సంపాదించుకున్నా.. ప్ర‌జ‌ల‌కు ఎంతో కొంత తిరిగి ఇచ్చేస్తే బాగుంటుంది. లేదంటే ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బ‌డ‌తారు. ఆ ఇచ్చేదేదో ఏ ఎన్నిక‌ల టైమ్‌లో తాము గెలిచేందుకు తాయిలాల రూపంలో కాకుండా.. ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో ప్ర‌జ‌ల ప్రాణాలు నిలిపేందుకు ఖ‌ర్చు చేస్తే బాగుంటుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. అందుకు తాము సంపాదించేసిందంతా ఊడ్చేసి.. కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చుచేయాల్సిన ప‌నిలేదు. త‌మ అక్ర‌మ, స‌క్ర‌మ సంపాద‌న‌లో ఓ వంతు విదిల్చినా చాలు. అనేక మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. సినీ హీరో సోను సూద్ కరోనా కష్టాల్లో ఎంతో మందికి ఆపద్బాందుడిగా నిలిచారు. తన ఆస్తులను తాకట్టు పెట్టి మరీ కరోనా బాధితులకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనులు చేస్తూ రియల్ హీరోగా మారారు. కాని కోట్లాది రూపాయలు కూడబెట్టిన ప్రజా ప్రతినిధులు మాత్రం కరోనా కష్ట కాలంలో ప్రజలకు కనిపించకుండా పోయారు. 

ఏపీ వ్యాప్తంగా దాదాపు ప్ర‌తీ జిల్లాలోనూ క‌రోనా రోగుల‌కు బెడ్స్ దొర‌క‌డం లేదు. ప్రైవేట్ హాస్పిట‌ల్స్‌కు వెళితే.. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు లాగేస్తున్నారు. అందుకే, చాలా మందికి ప్ర‌భుత్వ ఆసుప‌త్రులే దిక్కు. అక్క‌డ స‌రిప‌డా ప‌డ‌క‌లు లేవు. ఒక్కో బెడ్ మీద ఇద్ద‌రిని, ముగ్గురుని ఉంచి వైద్యం చేస్తున్న దుర్బ‌ర ప‌రిస్థితులు. అనేక మందిని నేల పైనో, కుర్చీల్లోనో ఉంచి చికిత్స చేస్తున్న దృశ్యాలు కోకొల్ల‌లు. ఇక మందులు, ఆక్సిజ‌న్ కొర‌త గురించి చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు. ఇంత దారుణ ప‌రిస్థితులు ఉంటున్నా.. ఏ ఒక్క ప్ర‌జాప్ర‌తినిధి అయినా అటువైపు క‌న్నెత్తి చూస్తున్నాడా? క‌నీసం ప‌ట్టించుకుంటున్నాడా? అలా చేష్ట‌లుడిగి ఉండే దానిక‌న్నా.. త‌మ వంతుగా ఎంతోకొంత ఉడ‌తా సాయం చేయొచ్చుగా. వారంతా త‌మ‌కు ఓటేసిన ప్ర‌జ‌లేగా. త‌మ‌ను గెలిపించిన ఓట‌ర్లేగా. వాళ్ల‌కు మంచి చేస్తే మ‌ళ్లీ వాళ్లు ఓట్ల రూపంలో త‌మ రుణం తీర్చుకుంటారుగా. కానీ, ఏ ఎంపీ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ.. అలాంటి  మంచి చేసే పాపాన పోవ‌డం లేదు. అధికార పార్టీ నేతలైతే ప్రజలను గాలికొదిలేసి గుర్రపు స్వారీలు చేస్తూ జల్సాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలే జనంలోకి వెళ్లే వాళ్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

జిల్లా కేంద్రాల్లోనే బెడ్స్ కొర‌త తీవ్రంగా ఉంది. ఇక మండ‌లాలు, గ్రామాల్లో ప‌రిస్థితి మ‌రింత దారుణం. ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క వ‌ర్గ ప‌రిధిలో తాత్కాలిక కొవిడ్ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందిగా? అన్నీ ప్ర‌భుత్వ‌మే చేయాలా? అన్నిటికీ ప్ర‌భుత్వ‌మే కావాలా? ఏం.. త‌మ ప‌ర‌ప‌తితోనో, త‌మ డ‌బ్బుతోనో.. ఏ ఫంక్ష‌న్ హాల్‌నో, ఏ బ‌డినో, ఏ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ప్రాంగ‌ణాన్నో తాత్కాలిక కొవిడ్ ఐసోలేష‌న్ కేంద్రాలుగా మార్చొచ్చుగా. గ్రామ‌, మండ‌ల స్థాయిలో.. ఎక్క‌డిక‌క్క‌డ‌.. ప‌దుల సంఖ్య‌లో బెడ్స్ ఏర్పాటు చేసి.. న‌లుగురు వైద్య‌ సిబ్బందిని అరేంజ్ చేసి.. కొవిడ్ ట్రీట్‌మెంట్ ఇప్పించొచ్చుక‌దా. రాష్ట్ర వ్యాప్తంగా రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్ల‌కు తీవ్ర కొర‌త ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ ఫండ్స్ నుంచో.. లేక‌పోతే మీ సొంత నిధుల‌తోనో క‌రోనా మెడిసిన్‌కు ఆర్డ‌ర్ పెట్టి ప్రాంతాల వారీగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచొచ్చు క‌దా. త‌మ నియోజ‌క వ‌ర్గంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు నిల్వ ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చుగా. త‌ప్పేముంది?  పాల‌కులు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కాకుండా.. ఇంకెప్పుడు ఇలాంటి ప‌నులు చేస్తారు. డ‌బ్బులు ఖ‌ర్చు చేయాల్సింది ఇలాంటి స‌మ‌యంలోనే క‌దా. ఇప్పుడు కాక‌పోతే.. ఇంకెప్పుడు?

ఎమ్మెల్యే, ఎంపీల‌కు నిధుల‌కు ఏమైనా కొర‌త ఉందా?  నెల‌కు ల‌క్ష‌ల్లో జీతాలు తీసుకుంటారు. అల‌వెన్సులు గ‌ట్రా అధిక మొత్తంలోనే ఉంటాయి. వారి చేతిలో ఎమ్మెల్యే ఫండ్‌, ఎంపీలాడ్స్ లాంటి నిధులు అందుబాటులో ఉంటాయి. ఒక‌వేళ వాటిని ఖ‌ర్చు చేయ‌డానికి రూల్స్ ఒప్పుకోక‌పోయినా.. ప్ర‌స్తుత క‌ష్ట‌కాలంలో త‌మ జేబుల‌ నుంచి సొమ్ములు తీసి ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడేందుకు ఖ‌ర్చు చేయ‌వ‌చ్చుగా.    ఎన్నిక‌ల వేళ‌.. అడ‌గ‌కున్నా.. పోలింగ్ చీటీలు ప‌ట్టుకొని.. వెతుక్కుంటూ వ‌చ్చి మ‌రీ చేతిలో వేల‌కు వేలు పెట్టి త‌మ‌కే ఓటేయ‌మ‌ని చెప్పి వెళ్తారే.. ఇప్పుడూ అలానే ఎక్క‌డెక్క‌డ క‌రోనా పేషెంట్లు ఉన్నారో లిస్టు తీసుకొని.. వారి ప‌రిస్థితి ఎలా ఉంది?  వారికి మందులు అందుబాటులో ఉన్నాయా? హాస్ప‌టిల్‌లో చేర్పించాల్సిన అవ‌స‌రం ఉందా?  బెడ్స్ ఉన్నాయా?  రెమ్‌డెసివిర్ స్టాక్ ఉందా? ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు స‌రిప‌డా ఉన్నాయా? ఐసోలేష‌న్ సెంట‌ర్స్ కావాలా? ఇలా రోగులకు కావాల్సిన వైద్య‌, ఆరోగ్య సేవ‌ల‌ను అందించే ప్ర‌య‌త్నాన్ని ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎందుకు చేయ‌డం లేదు? 

బ‌రువంతా అధికారులు, వైద్య సిబ్బంది మీదే వ‌దిలేసి.. తాము మాత్రం ఎంచ‌క్కా ఏసీ గ‌దుల్లో సేద తీరుతుంటే.. ఇక్క‌డ ప్ర‌జ‌లు కొవిడ్‌తో పిట్ట‌ల్లా రాలిపోతుంటే.. త‌మ‌కు ప‌ట్ట‌డం లేదా మ‌హాప్ర‌భో. ఇప్ప‌టికైనా స్పందించండి.. కాస్త క‌నిక‌రించండి.. మ‌న‌వ‌తా ధృక్ప‌దంతో వ్య‌వ‌హ‌రించండి.. మీ నిధులు కొన్ని విదిలించండి.. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టుకోండి. ఇది.. ఓ ఓట‌రు ఆవేద‌న‌. ప్ర‌జ‌ల ఆక్రంద‌న‌. మ‌రి, ఇది మీ చెవికి సోకుతుందా? ఈ మంచి మీ త‌ల‌కు ఎక్కుతుందా? క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో మీ వంతుగా ఉడ‌తాభ‌క్తి సాయానికి సిద్ధ‌మా?  మిమ్మ‌ల్నే అడుగుతోంది.. ఓ ఎమ్మెల్యే గారూ.. ఓ ఎంపీ గారూ.. విన‌బ‌డుతోందా....