అవునా  కుట్ర జరుగుతోందా ?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపధ్యంలో, లోక్ సభలో వైసీపీ పక్ష నేత మిదున్ రెడ్డి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని అన్నారు. అందులో భాగంగానే, రఘురామ కృష్ణం రాజు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారని,ఆయన చెప్పినట్లు పనిచేస్తున్నారని మిదున్ రెడ్డి ఆరోపించారు. అంతే కాదు, బోడి గుండుకు మోకాలుకు ముడి వేసినట్లుగా, గతంలో తెలుగు దేశం పార్టీ నాయకులు అరెస్ట్ అయిన సందర్భంలో  చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్రపతికి లేఖ రాయలేదని, తమ పార్టీ (వైసీపీ) ఎంపీ కృష్ణం రాజు అరెస్ట్ విషయంలో మాత్రం చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశారని, అదేదో మహా నేరం అయినట్లుగా మిదున్ రెడ్డి , అలాగే ఇతర  వైసీపీ నాయకులు కొత్త కోణాన్ని వెలికి తీశారు. చంద్రబాబు నాయుడు,  జగన్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రతోనే ఆయన ఈ లేఖ రాశారని ఆరోపించారు. 

ఇతర విషయాలు ఎలా ఉన్నా, చంద్రబాబు నాయుడు, మరీ అంత రాజకీయ ఎత్తు పల్లాలు, ఎత్తులు పై ఎత్తులు తెలియని అమాయకుడు కాదు. అయన రాజకీయ అనుభవం మిధున్ రెడ్డి వయసు కంటే కూడా ఎక్కువ ఉండవచ్చును. అంత అనుభవం  ఉన్న నాయకుడు, మూడింట రెండువంతుల కంటే ఎక్కువ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కుల్చేందుకు కుట్ర చేస్తున్నారు అనుకోవడం అయితే రాజకీయ అజ్ఞానం, కాదంటే, అమాయకత్వం అనిపించుకుంటుంది. అదే కాదంటే, పగ, ప్రతీకరాలే  శ్వాసగా జీవిస్తూ,స్వీయాపరాధంతో చిక్కులు కొనితెచ్చుకున్న జగన్ రెడ్డి బృందం టం నీడను చూసి తామే భయపడుతుండ వచ్చును. ఆ భయం నుంచి, ఇలాంటి ప్రేలాపనలు వస్తున్నాయో, ఏమో ..సరే, అదలా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరో కుట్రలు చేస్తే కూలి పోయేంత బలహీనంగా వుందా లేక అటూ ఇటూ అవుతున్న అస్మదీయులు జగన్ ప్రభుత్వం కూలి కూలిపోవాలని కోరుకుంటున్నారా? రాజకీయ ఓనమాలు తెలియని అమాయకులు కూడా, జగన్ రెడ్డి ప్రభుత్వం అంత బలహీనంగా ఉందని అనుకోరు. ప్రశాంత్ కిషోర్ మాయలే పనిచేశాయో, ‘ఒక్క ఛాన్స్’ అంటూ జగన్ రెడ్డి అమాయకంగా ముఖం పెట్టి చేసిన అభ్యర్ధనలే మోసం చేశాయో లేక ఆయన చేసిన మోసపూరిత వాగ్దనాలే పనిచేశాయో గానీ,గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అనూహ్య విజయాన్ని కట్ట బెట్టారు. ఏకంగా 151 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులను గెలిపించారు. ఒక విధంగా ఆ మంద బలాన్ని చూసుకునే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అరాచక పాలన యధేచ్చగా సాగిస్తున్నారని ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా బావిస్తున్నారు. మరి మిదున్ రెడ్డి, జగన్ సర్కార్, అస్థిరపు అంచుల్లో ఉందని ఎలా అనుకుంటున్నారు?

అదొకటి అయితే, రఘురామ కృష్ణం రాజు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో, రాష్ట్రంలో జరుగతున్నవ్యవహారాన్ని, ముఖ్యంగా ఆయన ప్రాణాలకు హని ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో అదే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళారు. ఇప్పుడే కాదు, గతంలో టీడీపీ నాయకులు  అచ్చెన్నాయుడు,  కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా అరెస్టులు, టీడీపీ కార్యకర్తల అరెస్టులు,  హత్యలపై చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశారు. అయినా, రాష్ట్రపతికి లేకః రాసినందుకే ఇంతలా ఉలిక్కి పడుతున్నారంటే, అసలు భయానికి ఇంకేదో కారణం ఉంటుందని,రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి లేఖను, ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రలో భాగం అనుకోవడం, అంటే మిదున్ రెడ్డి ఎవరిని అనుమానిస్తున్నారు? రాష్ట్రపతిని అనుమానించడం, అవమానించడం, రాజద్రోహాన్ని, దేశ ద్రోహాన్ని మించిన ద్రోహం కాదా... జగన్ రెడ్డికి ఇలాంటి సలహాలు ఇస్తున్న మేథావులు చెపితే బాగుటుంది ...