వైసీపీకి మరో చాన్స్ లేదు..!

ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ భవిష్యత్ ఎలా ఉందో తెలియడానికి సర్వేలు ఎందుకు?  ఏపీలో అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.     సర్వేలతో పని లేకుండానే వైసీపీకి వచ్చే ఎన్నికలలో మరోమారు అధికారం దక్కడం అసాధ్యం అని ఎవరినడిగినా చెప్పేస్తున్నారు. జగన్ మూడున్నరేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదు. ఏ వర్గమూ ప్రభుత్వ పాలన బాగుందని చెప్పే పరిస్థితి లేదు.

ప్రతిపక్షాలు, ప్రజలే కాదు.. స్వయంగా వైసీపీ వర్గాలు కూడా అంతర్గత సంభాషణల్లో ఈ విషయాన్నిఅంగీకరిస్తున్నారు. ఆఫ్ ది రికార్డుగా  వైసీపీ నేతలు తమ ప్రభుత్వం మరోసారి అనుమానమేనని చెబుతున్నారు.  స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోనే పార్టీకి ఎదురీత పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ వైసీసీ పట్ల వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని అంగీకరిస్తున్నారు. వై నాట్ 175 అంటూ జగన్ ప్రదర్శిస్తున్నది మేకపోతు గాంభీర్యమేనని అంటున్నారు. విశ్లేషకుల అభిప్రాయాలూ, సర్వేల ఫలితాలతో సంబంధం లేకుండానే వైసీపీ భవిష్యత్ ఏమిటన్నది సామాన్య జనానికి సైతం తేటతెల్లమైపోవడానికి.. ఆ పార్టీ నేతలు సొంత పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలూ, వ్యాఖ్యలే కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకులే.. సొంత పార్టీపైనా, ముఖ్యమంత్రిపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలుగుదేశం వైపే తమ అడుగులని విస్పష్టంగా ప్రకటించేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిపై ఈ అవిధేయత రానున్న రోజులలో మరింత పెరుగుతుందని కూడా వారు చెబుతున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే. ఇటీవల ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా జగన్ ప్రభుత్వానికి రానున్నది గడ్డుకాలమేనని తేల్చింది. ఇక మంత్రుల విషయానికి వస్తే కేబినెట్ లో ఉన్న పాతిక మంత్రులలో ముగ్గురు నలుగురు మినహా మిగిలిన వారెవరూ విజయం సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు వారికి గడపగడపకు లో ఎదురైన పరాభవాన్ని, నిరసనల వెల్లువను తార్కాణంగా చూపుతున్నారు. అలాగే మాజీ మంత్రులకు కూడా వచ్చే ఏన్నికలలో విజయావకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.

మాజీలు అయిన తరువాత వారు పెద్దగా జనంలోకి రాకపోవడం, అంతకు ముందు మంత్రులుగా కూడా వారు జనంలో పెద్దగా తిరిగింది లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో వారి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెబుతున్నారు. ఇక ఇండియా టుడే సర్వే ప్రకారమే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో  13 పార్లమెంటు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులకు విజయం సాధించే అవకాశాలు ఇసుమంతైనా లేవని వెల్లడైంది. ట్రెండ్ ఇలాగే సాగితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సర్వే చెబుతోంది.