Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమరావతిపై వైసీపీ డబుల్ స్టాండర్డ్స్.. సజ్జల ఏమన్నారంటే?
posted on: Mar 27, 2026 8:24AM

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత దిశగా వేగంగా అడుగులు పడుతున్న తరుణంలో వైసీపీ సేఫ్ గేమ్ అడుతున్నట్లు కనిపిస్తోంది. అమరావతి విషయంలో తన వైఖరిని మార్చుకుని యూటర్న్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్వీర్యం చేయడానికి శతధా ప్రయత్నించిన వైసీపీ ఇప్పుడు అమరావతికి అనుకూలమే అని చెప్పడానికీ, తాము అమరావతికి వ్యతిరేకం కాదని జనాలను నమ్మించడానికి తంటాలు పడుతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ కీలక నేత, జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సేఫ్ గేమ్ ప్రారంభించారు. తాజాగా ఆయన అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు. అమరావతిపై సజ్జల సేఫ్ గేమ్ ను ఆ ప్రాంత ప్రజల్లో వైసీపీ పట్ల, జగన్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఒకవైపు అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెబుతూనే.. అమరావతిని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా సజ్జల అభివర్ణించారు. దీంతో జనంలో వైసీపీ వైఖరి మారలేదన్న ఆగ్రహం వ్యక్తం అవుతోంది. నోటితో అమరావతికి అనుకూలం అని చెబుతూనే.. అదో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలను గతంలో అంటే వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో జగన్ అసెంబ్లీ వేదికగా అమరావతికి అనుకూలం అని ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తరువాత అందుకు భిన్నంగా వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ వైసీపీది అప్పుడూ, ఇప్పుడూ కూడా ద్వంద్వ నీతేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమరావతి విషయంలో వైసీపీ తీరు కారణంగానే గత ఎన్నికలలో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలూ కూడా అమరావతిని తాము అనుకూలమే అని తమ ఓటు ద్వారా నిర్ద్వంద్వంగా తీర్పిచ్చారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ప్రాతినిథ్యమే లేకుండా చేశారు.
దీంతో ఇప్పుడు అమరావతి విషయంలో తమ వైఖరి మారిందనీ, స్టాండ్ మార్చుకున్నామనీ చెప్పుకుని వచ్చే ఎన్నికల నాటికైనా తమపై ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సజ్జల వ్యాఖ్యలు అని పరిశీలకులు అంటున్నారు. అయితే అమరావతికి అనుకూలమే అని చెబుతూనే.. అదో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అని సజ్జల చేసిన వ్యాఖ్యలు ఆ ప్రయత్నాలకు ఆదిలోనే గండికొట్టాయని అంటున్నారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ, అమరావతి ప్రజలకు చేరువయ్యేందుకు వైసీపీ పడుతున్న పాట్లకు సజ్జల వ్యాఖ్యలు నిదర్శనమంటున్నారు.






